ఎక్కాల్సిన రైలు ఎప్పుడొస్తుంది? | Sakshi Editorial On 131st Constitutional Amendment Bill | Sakshi
Sakshi News home page

ఎక్కాల్సిన రైలు ఎప్పుడొస్తుంది?

Apr 19 2026 5:09 AM | Updated on Apr 19 2026 5:09 AM

Sakshi Editorial On 131st Constitutional Amendment Bill

జనతంత్రం

131వ రాజ్యాంగ సవరణ బిల్లును ఎన్డీఏ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకోసమే ప్రతిపాదించిందని ప్రతిపక్షం ఆరోపించింది. నిజమే కావచ్చు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును, నియోజకవర్గాల పునర్విభజనతో కలిపేయడం వెనుక రాజకీయ కుట్ర దాగున్నదని ప్రతిపక్షం విమర్శించింది. ఇది కూడా నిజమే కావచ్చు. నియోజకవర్గాల పెంపును అన్ని రాష్ట్రాల్లో సమాన నిష్పత్తిలో పెంచుతామని ప్రధాని ఇచ్చిన హామీ బిల్లులో లేకపోవడం మోసపూరిత చర్యగా విపక్షం అభివర్ణించింది. అలా అనుమానించడంలో కూడా తప్పు లేదు. కనుక రాజ్యాంగ సవరణ బిల్లుకు అవసరమైన సంఖ్యాబలాన్ని అందివ్వకుండా అది వీగిపోయేలా చేసింది. అయితే బిల్లును ఓడించడం ద్వారా ప్రతిపక్షం సాధించిన ఘనకార్యమేమిటన్నదే అర్థంకాని ప్రశ్నగా మిగిలిపోతున్నది.

మన దేశంలో జరుగుతున్న అన్ని ఎన్నికల్లో పురుషులతో సమానంగా మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. చాలా సందర్భాల్లో పురుషుల కంటే ఎక్కువ సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొంటూ తమ రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నారు. స్థానిక సంస్థల ప్రతినిధులుగా పురుషులతో సమానస్థాయిలో రాణించగలుగుతున్నారు. చారిత్రక కారణాల వలన ఆర్థిక స్వాతంత్య్రంలో గానీ, వనరుల అజమాయిషీలో గానీ పురుషులతో పోలిస్తే వారు పోటీ పడలేరు. విస్తృత ప్రజా సంబంధాలను నెరపడంలో కూడా కుటుంబ బాధ్యతలు, సామాజిక బంధనాల వల్ల పురుషుల కంటే వెనకబడుతున్నారు. ఫలితంగా పురుష పుంగవులతో పోటీపడి గౌరవ ప్రదమైన సంఖ్యలో చట్టసభలకు ఎన్నిక కాలేకపోతున్నారు. సగం జనాభాకు ప్రాతినిధ్యం వహించేవారి ప్రాతినిధ్యం పది నుంచి పదిహేను శాతం దాటడం లేదు. వారిలో కూడా తండ్రి చాటు బిడ్డలు, భర్త నీడలోని భార్యలే ఎక్కువ!

ఆందోళనకరమైన ఈ అసమానతను అధిగమించాలంటే మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు అవసరమనే ప్రతిపాదన చాలాకాలం కిందనే రాజకీయ వేదికపైకి వచ్చింది. ముప్ఫయ్‌ సంవత్సరాల కిందట 1996లో మహిళా బిల్లు తన ప్రయాణానికి సిద్ధమై స్టేషన్‌లో కూర్చున్నది. ‘నువ్వు ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు’ అని అభ్యుదయ కవి ఆరుద్ర చెప్పిన మాట మహిళా బిల్లులో నిజమైంది. రాజకీయ నేతలు కుంటిసాకులు చెప్పకుండా అప్పుడే ఆమోదించి వుంటే చట్టసభల్లో మూడో వంతు మహిళలు మూడు దశాబ్దాల కిందనే ప్రవేశించి ఉండే వారు. బహుశా వారిలో చాలామంది రంగంలోంచి తప్పుకొని రెండో తరానికి మార్గమిచ్చి ఉండేవారు. నిజంగానే ఒక తరం మహిళలు ఎక్కాల్సిన రైలు వారి జీవితకాలం లేటయ్యింది.ఇంకో మూడేళ్లలో రెండో తరం ఎక్కడానికి అవకాశం ఉందను కున్న రైలును స్టేషన్‌కు చేరకముందే ప్రతిపక్షం చైన్‌ లాగి నిలిపే సింది. అది ఎప్పటికొస్తుందో!

డీలిమిటేషన్‌ బిల్లుతో మహిళా రిజర్వేషన్‌ బిల్లును లింక్‌ చేయడమేమిటని ప్రతిపక్షం ప్రశ్నిస్తున్నది. ఇప్పుడు ప్రారంభ మైన జనగణన పూర్తయిన తర్వాత, ఆ నివేదికను ప్రచురించిన తర్వాత రాజ్యాంగ విధిగా డీలిమిటేషన్‌ ప్రక్రియను చేపట్టవలసి ఉన్నది. ఈ ప్రక్రియ ద్వారా లోక్‌సభ సీట్ల సంఖ్యను 543 నుంచి 850 వరకు పెంచాలని కేంద్రం భావిస్తున్నది. కనుక ఆ నిష్పత్తి ప్రకారమే మహిళా సీట్లను పెంచి తాజా జనగణనతో సంబంధం లేకుండా 2011 లెక్క ప్రకారమే పునర్విభజన చేయడానికి బిల్లును రూపొందించినట్టు కేంద్రం చెబుతున్నది. అయితే తాజా జనగణన ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైంది. ఈ నేప థ్యంలో దాని రిపోర్టు వచ్చేవరకు ఆగకుండా ఆదరాబాదరాగా పదిహేనేళ్ల కిందటి లెక్కలతో డీలిమిటేషన్‌ చేపట్టవలసిన అవసరమేమిటన్నది హేతుబద్ధమైన ప్రశ్న. ఇప్పుడున్న 543 సీట్లలోనే మహిళలకు మూడో వంతు కేటాయించి అమలు చేయడానికి దానికోసం ప్రత్యేక చట్టం చేయడానికి ఉన్న అభ్యంతరమేమిటో, రాజ్యాంగపరమైన అవాంతరాలేమిటో అర్థం కాని ప్రశ్న. కేంద్రం కూడా ఈ సందేహాలను తీర్చలేదు.

డీలిమిటేషన్‌ ప్రక్రియ పట్ల ప్రతిపక్షాలకు అభ్యంతరాలు న్నాయి. కానీ, రాజ్యాంగంలోని 82వ అధికరణం ప్రకారం పదేళ్ల కోసారి జరిగే ప్రతి జనగణన తర్వాత చట్టసభల స్థానాలను పునర్విభజన చేయడానికి పార్లమెంట్‌ ఒక అథారిటీని నియమించవలసి ఉన్నది. అట్లాగే 170వ అధికరణం ప్రకారం రాష్ట్రాల్లో కూడా! 1971 దాకా ఈ పద్ధతే కొనసాగింది. జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన జరుగుతున్న నేపథ్యంలో కుటుంబ నియంత్రణ విజయవంతంగా అమలు చేస్తున్న రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య తగ్గుతున్నదనే వాదన ముందుకొచ్చింది. దాంతో 1976లో అప్పటికి ఉన్న సీట్ల గరిష్ఠ సంఖ్యను స్తంభిం పచేసేలా చట్ట సవరణ జరిగింది. మొదట 2002 వరకు, ఆ తర్వాత 2026 వరకు ఈ గరిష్ఠ పరిమితిని విధించడం జరిగింది. ఈ పరిమితికి లోబడే ఇప్పటివరకు జరిగిన పునర్విభజనలన్నీ మార్పులు, చేర్పులకు మాత్రమే పరిమితమయ్యాయి.

చట్టసభల్లో సీట్ల సంఖ్యను స్థిరీకరించి యాభై ఐదేళ్లు గడిచిపోయాయి కనుక ఇప్పుడు సీట్ల సంఖ్యను పెంచుతామని ఎన్డీఏ సర్కార్‌ చెబుతున్నది. రాజ్యాంగ నిబంధన కూడా పదేళ్ల కోసారి జరిగే జనగణన తర్వాత సీట్ల పునఃపంపిణీ జరగాలని ఆదేశిస్తున్నది. జనాభా పెరిగితే సీట్ల సంఖ్య పెరగాలని రాజ్యాంగంలో లేకపోవచ్చు. కానీ ఎక్కువమంది ప్రజలు ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావడమే 82 అధికరణం అంత స్సూత్రం. ఈ మౌలిక సూత్రాన్ని విస్మరించి ఎన్నాళ్లిలా గరిష్ఠ సంఖ్యను స్తంభింపజేయగలరు? మల్కాజిగిరి లోక్‌సభ నియో జకవర్గంలో 38 లక్షలమంది ఓటర్లున్నారు. ఇక్కడి నుంచి ఎన్ని కైన ప్రజాప్రతినిధి ఎంతమందికి అందుబాటులో ఉండగలరు? అసలీ సీట్ల పెంపును విపక్షం ఎందుకు వ్యతిరేకిస్తున్నది?

డీలిమిటేషన్‌ ప్రక్రియను తాము వ్యతిరేకిస్తున్నామని ప్రతి పక్ష కూటమి చెప్పడం లేదు. పాలకపక్షం వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకిస్తున్నామని చెబుతున్నది. డీలిమిటేషన్‌ జరిగే ప్పుడు అధికారంలో ఉన్న పార్టీలకు కొంత లాభం జరుగుతుందనే అపోహ రాజకీయ పార్టీల్లో ఉన్నది. ఎన్నికల సమయంలో ఏ గాలీ లేకపోతే కొద్దిమేరకు ఇది ఉపయోగపడవచ్చేమో! కానీ పాజిటివ్‌ లేదా నెగెటివ్‌ ధోరణులు బలంగా ఉన్నప్పుడు ఇదేమీ ఉపకరించదు. అయినా ఈ అభిప్రాయాన్ని రాజకీయ పార్టీలు బాహాటంగా అంగీకరించవు కనుక స్పష్టాస్పష్టమైన కొన్ని భావనలను వారు ముందుకు తెస్తున్నారు. 

అభ్యంతరాల్లో ముఖ్యమైనది... కుటుంబ నియంత్రణ సమర్థంగా అమలుచేసిన రాష్ట్రాలు జనాభా లెక్క ప్రకారం జరిగే పునర్విభజనలో నష్టపోతాయి. యాభయ్యేళ్ల తర్వాత కూడా ఇదే వాదన. ఈ వాదన ప్రకారం దక్షిణాది రాష్ట్రాలకు, బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. అంటే హిందీ రాష్ట్రాలకు లాభం, హిందీయేతర రాష్ట్రాలకు నష్టం. దీనికితోడు నార్త్‌ – సౌత్‌ వాదన. దక్షిణాది రాష్ట్రాలపై పెత్తనం చేయడానికి, హిందీభాషను బలవంతంగా రుద్దడానికి బీజేపీ ప్రభుత్వం పనిచేస్తున్నదనే అభిప్రాయం కూడా బలంగా ఉన్నది. బీజేపీ సర్కార్‌కు హిందీ – హిందూ ఎజెండా ఉన్నదనే సంగతిని ఎవరూ దాచలేరు. ఆ పార్టీ గత కొంతకాలంగా తన ఎజెండాను బలంగా జనంలోకి తీసుకొనిపోతున్నది. దేశంలోనే సీనియర్‌ మోస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ దాన్ని వ్యతిరేకించి నిలబడలేకపోతున్నది. అసమర్థ నాయకత్వం ఆ పార్టీ పాలిటి శనిగా దాపురించింది. బీజేపీ ఎజెండాను ఎదిరించే ప్రాంతీయ పార్టీలు కొన్ని సమర్థంగా నిలబడగలుగుతున్నాయి.

ఇప్పుడు డీలిమిటేషన్‌ ప్రక్రియ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన ఆవశ్యకత. మహిళా రిజర్వేషన్లు దేశ ప్రజల చిరకాల వాంఛితం. ఇప్పుడు ప్రారంభమైన జనగణన ముగిసి తుది రిపోర్టు 2028 నాటికి అందుబాటులోకి వస్తుందని చెబు తున్నారు. ఆ తర్వాత డీలిమిటేషన్‌ కమిషన్‌ను వేయాలి. అది తన రిపోర్టును ఇవ్వటానికి ఐదు సంవత్సరాల కంటే తక్కువ సమయాన్ని ఎప్పుడూ తీసుకోలేదు. కేంద్రంలోనూ, రాష్ట్రా ల్లోనూ ఇప్పుడు సీట్ల సంఖ్య పెరగనున్న నేపథ్యంలో మరింత ఎక్కువ సమయం పట్టినా ఆశ్చర్యం లేదు. అంటే 2033 కంటే ముందు ఈ ప్రక్రియ పూర్తికాదు. 2029 ఎన్నికల నాటికే ముందుకు తెస్తామని ఎన్డీఏ సర్కార్‌ చెప్పిన మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌ ఇంకో ఐదేళ్లు వెనక్కు పోతాయి.

ఇప్పుడు ప్రతిపక్షం కోరుకుంటున్నదేమిటి? ఐదేళ్ల తర్వాత రాజ్యాంగబద్ధ ప్రక్రియ ప్రకారం జరిగే డీలిమిటేషన్‌ వారి అభీష్టానికి అనుగుణంగా జరుగుతుందా? 2028లో మోదీ ప్రభుత్వమే ఉంటుంది. డీలిమిటేషన్‌ కమిషన్‌ను నియమించడానికీ, దాని విధివిధానాలు రూపొందించడానికీ పార్లమెంట్‌లో సాధారణ మెజారిటీ చాలు. అప్పుడు మోదీ మనస్సులో ప్రతిపక్షం ఆశిస్తున్న మార్పేమైనా వస్తుందా? ‘ఇదే బిల్లులో జనాభాతో నిమిత్తం లేకుండా అన్ని రాష్ట్రాల్లో 50 శాతం వంతున సీట్లను పెంపుదల చేసే విషయాన్ని బిల్లులో పొందుపరుస్తాం... ఓ గంట టైమివ్వండ’ని అమిత్‌ షా సభలో అడిగినప్పుడు ప్రతి పక్షాలు ముక్తకంఠంతో ఎందుకు అంగీకరించలేదు? గంట కాదు, రెండు గంటలు కాదు రేపటి వరకైనా సరే, మార్చి తీసుకురమ్మని ఎందుకు కోరలేదు? అలా స్పందించి ఉంటే ఎన్డీఏ సర్కార్‌ చిత్తశుద్ధి ఏపాటిదో తేలిపోయేది కదా! ఇప్పుడు ప్రతి పక్షాల చిత్తశుద్ధిపైనే ప్రజలకు అనుమానాలు కలిగేలా వ్యవహరించారు.

ఇక్కడ 50 శాతం సీట్ల చొప్పున పెంపుదల అనేది ఏ ప్రాతిపదికపై చేస్తారనేది కూడా ప్రశ్నార్థకమే. రాజ్యాంగ మౌలిక సూత్రమైన సమానత్వ ప్రాతిపదిక ప్రకారం నియోజకవర్గాల పునర్విభజనకు జనాభాయే ప్రాతిపదిక కావాలి. అందుకే పదేళ్లకోసారి జరిగే జనగణన అనంతరం అందుకు అనుగుణంగా సీట్ల పునఃపంపిణీ చేయాలని రాజ్యాంగంలో 82వ అధికరణం ఆదేశించింది. దాంతో నిమిత్తం లేకుండా 50 శాతం సీట్ల సమాన పెంపు అంశం న్యాయసమీక్షకు నిలబడుతుందా అన్నది కూడా సందేహాస్పదమే. లోక్‌సభ అనేది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది తప్ప ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించదు.

లోక్‌సభ అనే పేరులోనే ‘హౌస్‌ ఆఫ్‌ ద పీపుల్‌’ అనే అర్థం ఉన్నది. రాజ్యసభను మాత్రం ‘కౌన్సిల్‌ ఆఫ్‌ ద స్టేట్స్‌’ అంటారు. రాష్ట్రాల లెజిస్లేటర్లే దాని సభ్యుల్ని ఎన్నుకుంటారు. శాసన ప్రక్రియలో ఏ ప్రాంతానికీ అన్యాయం జరక్కుండా ఉండాలంటే రాజ్యసభలో సమాన ప్రాతినిధ్యాన్ని డిమాండ్‌ చేయవచ్చు. న్యాయ సమీక్షకు ఇది లోబడే ఉంటుంది. కొన్ని దేశాల్లోని ఎగువ సభల్లో రాష్ట్రాల జనాభాలతో నిమిత్తం లేకుండా సమాన సంఖ్యలో ప్రాతినిధ్యం ఇప్పటికే ఉన్నది. కొన్ని ప్రాంతాలకు నష్టం కలిగించగల రాజ్యాంగ సవరణలను ఎగువ సభలు అడ్డుకోగలవు కూడా! అసలు విషయాలను పక్కదారి పట్టించి సవరణ బిల్లును అడ్డుకోవడం ద్వారా ప్రతిపక్షం సాధించిందే మిటి! మహిళల మూడు దశాబ్దాల నిరీక్షణను మరో పదేళ్లు పొడిగించడం తప్ప!


వర్ధెల్లి మురళి 
vardhelli1959@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement