అవాంఛనీయ దృశ్యాలు

Rajya Sabha Suspends 8 Opposition MPS - Sakshi

కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా తీసుకున్న ముందుజాగ్రత్త చర్యల వల్ల ఈసారి పార్లమెంటు సమావేశాలు భిన్నంగా కనబడ్డాయి. కానీ రాజ్యసభలో ఆది, సోమవారాల్లో దృశ్యాలు మాత్రం పాత సభల్నే గుర్తుకుతెచ్చాయి. రైతుల మేలుకోసమంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు బిల్లులపై రాజ్యసభలో ఆదివారం వాగ్యుద్ధం చోటుచేసుకుంది. బిల్లుల్ని అడ్డుకోవడానికి విపక్షాలు ప్రయత్నించడం, ఆ క్రమంలో సభాధ్యక్ష స్థానంలో వున్న డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌పైకి పుస్తకాలు విసరడం, ఆయన దగ్గరున్న మైక్‌ లాక్కోవడానికి ప్రయత్నించడం, బిల్లుల ప్రతుల్ని చించివేయడం వంటి ఘటనలు అందరినీ దిగ్భ్రాంతిపరిచాయి. పావుగంటకుపైగా రాజ్యసభ రణరంగాన్ని తలపిం చింది. ఈ గందరగోళంలోనే వ్యవసాయ బిల్లులు మూడింటిపైనా కేంద్రం మూజువాణి ఓటు కోరడం, సవరణలు తిరస్కరించినట్టు.. బిల్లుల్ని ఆమోదించినట్టు హరివంశ్‌ ప్రకటించడం అయిపోయింది. ఈ ఉదంతాల పర్యవసానంగా 8 మంది సభ్యుల్ని ఈ సమావేశాలు ముగిసేవరకూ సస్పెండ్‌ చేశారు. మార్షల్స్‌ అడ్డుకోకపోతే హరివంశ్‌పై దాడి కూడా చేసేవారేమోనని రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు అనడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. సస్పెండైనవారు క్షమాపణలు చెబితే అను మతిస్తామని కేంద్రం... సస్పెన్షన్‌ని రద్దు చేయడంతోపాటు మరికొన్ని డిమాండ్లు నెరవేర్చేవరకూ పార్లమెంటును బహిష్కరిస్తామని విపక్షం చెప్పడంతో ఇప్పుడు ప్రతిష్టంభన ఏర్పడింది. 

బిల్లు అంశాలపైనా, వాటి వెనకున్న ఉద్దేశాలపైనా, ఆ బిల్లుల్ని ప్రవేశపెట్టడంలో నిబంధనలు పాటించలేదన్న అంశంపైనా అభ్యంతరాలు చెప్పి...దేశ ప్రజలకు తమ గళాన్ని వినిపించాల్సిన విపక్ష సభ్యుల్లో కొందరు అనవసర ఆవేశాలకు పోయి బాహాబాహీకి దిగడం సరికాదు. మూడు సాగు బిల్లులపైనా విపక్షాలకు మాత్రమే కాదు... కొన్ని రైతు సంఘాలకు, సాగు రంగ నిపుణులకు కూడా అభ్యంతరాలున్నాయి. రైతు సంఘాల వాదనలేమిటో, పంజాబ్, హరియాణాల్లో ఉద్యమిస్తున్న రైతుల మనోగతమేమిటో రాజ్యసభలో ప్రభావవంతంగా వినిపించడానికి విపక్షం సరిగా ప్రయత్నిం చలేదు. ఈ బిల్లుల్లో కొన్ని లోపాలున్నాయని సంఘ్‌ పరివార్‌ సంస్థల్లో ఒకటైన భారతీయ కిసాన్‌ సంఘ్‌(బీకేఎస్‌) కూడా అంటున్నది. ముఖ్యంగా కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) విషయంలో రాజీపడబోమన్న హామీ ఇవ్వాలంటోంది. అలాగే సాగు ఉత్పత్తిని రైతు వద్ద నుంచి కొన్న వెంటనే ఆ మొత్తాన్ని చెల్లించేలా చూడాలంటోంది. ఆ విషయంలో ప్రభుత్వం లేదా బ్యాంకు గ్యారెంటీగా వుండాలని కోరుతోంది.  రైతు ఉద్యమ నాయకుల సందేహాలు వేరే వున్నాయి. ఇవి చట్టాలుగా మారి అమల్లోకొచ్చాక అసలు ఎంఎస్‌పీ వుంటుందా అనే ఆందోళన రైతుల్లో వుంది. అలాగే ఇప్పుడున్న కమిషన్‌ ఏజెంట్ల వ్యవస్థ పోయి కార్పొరేట్‌ వ్యాపార సంస్థ గుత్తాధిపత్యం వస్తే తాము తట్టుకో గలమా అని సాధారణ రైతులు సందేహపడుతున్నారు. ఇందుకు కారణాలున్నాయి. వ్యవసాయ రంగ సంస్కరణలపై నియమించిన శాంతకుమార్‌ కమిటీ ఇచ్చిన నివేదికలో అనేక అంశాలు రైతులకు గుబులు పుట్టించేవే. భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) ధాన్య సేకరణకు స్వస్తిచెప్పాలని, ఆ పని రాష్ట్రాలు చేసుకోవాలని ఆ కమిటీ సూచించింది. సేకరణ చేయలేని పేద రాష్ట్రాలకు మాత్రమే ఇకపై ఎఫ్‌సీఐ తోడ్పాటు వుండాలని ప్రతిపాదించింది. ధాన్య సేకరణలో, నిల్వలో ప్రైవేటు సంస్థల పాత్ర వుండాలనికూడా అది సూచించింది. కేంద్రం ప్రకటించే ఎంఎస్‌పీపై రాష్ట్రాలు బోనస్‌ ఇవ్వ కూడదని తెలిపింది. ఈ నివేదికలోని సిఫార్సుల అమలుకే ఇప్పుడు మూడు సాగు బిల్లులు తెచ్చా రన్నది విపక్షాల విమర్శ. వీటికి ప్రభుత్వం వైపునుంచి సమాధానం రాబట్టే దిశగా అడుగులేయడానికి బదులు రాజ్యసభలో విపక్షాలు ఆగ్రహావేశాలకు పోయాయి. బిల్లులపై వోటింగ్‌కు సిద్ధపడకుండా, మూజువాణి ఓటుతో వాటిని ఆమోదింపజేసుకునేందుకు ప్రభుత్వం ఆత్రుత ప్రదర్శించిందన్న విపక్షాల ఆరోపణ నిజమే కావొచ్చు... కానీ ఆ విషయంలో ప్రభుత్వ వైఖరిని బహిర్గతం చేసేందుకు తగిన వ్యూహం విపక్షాల దగ్గర లేకుండాపోయింది.

బిల్లుల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయడంలో, తగిన చాకచక్యాన్ని ప్రదర్శించడంలో విఫ లమైన కాంగ్రెస్‌ బిల్లును సమర్ధించే ఇతర పార్టీలపై ఉక్రోషాన్ని ప్రదర్శించింది. వాస్తవానికి ఆ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలోనే ఈ మాదిరి సాగు రంగ సంస్కరణలకు బీజాలు పడ్డాయి.  2014 సాధారణ ఎన్నికలకు ముందు అప్పటి మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం సాగు ఉత్ప త్తుల మార్కెటింగ్‌ కమిటీ(ఏపీఎంసీ)ల పరిధి నుంచి పండ్లు, కూరగాయలను తప్పిస్తున్నట్టు ప్రకటించింది. ఆ రెండింటినీ రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చని తెలిపింది. కాంట్రాక్టు వ్యవసాయం ప్రతిపాదన కూడా ఆ ప్రభుత్వానిదే. దళారుల బెడద నుంచి రైతుల్ని తప్పించడం కోసం వారి ఉత్పత్తుల్ని దేశంలో ఎక్కడైనా అమ్ముకునేవిధంగా సంస్కరణలు తీసుకొస్తామని చెప్పింది. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఏపీఎంసీ చట్టాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్‌ తెలిపింది. ఆ విషయంలో తమది తప్పిదమేనని ప్రకటించకుండా, అందుకు క్షమాపణ చెప్పకుండా ఇప్పుడు బిల్లుల్ని వ్యతిరేకించడం అవకాశవాదమవుతుంది. అప్పుడైనా, ఇప్పుడైనా సాగు రంగంపై ప్రభుత్వపరంగా పెట్టుబడి చాలా తక్కువ. అది గణనీయంగా పెంచడం, ఇప్పటికీ అత్యధికులకు ఉపాధి కల్పిస్తున్న ఆ రంగానికి తగిన రక్షణలు కల్పించడం అవసరం. సాగు ఉత్పత్తుల ధర, ఆ మొత్తాన్ని చెల్లించడానికి అనుసరించే విధానం వంటివి కార్పొరేట్‌ రంగం, రైతులు తేల్చుకుంటారని బిల్లు చెబుతోంది. ఒకటి, రెండు ఎక రాలుండే రైతు కార్పొరేట్లతో బేరసారాలాడే స్థితిలో వుంటాడని ఎవరూ అనుకోరు. అందుకు చట్ట పరమైన రక్షణలుండాలి. అలాగే ఎంఎస్‌పీ విషయంలో ఇస్తున్న హామీ బిల్లులో భాగం కావాలి. ఈ రెండూ సాధించడంలో విపక్షాలు విఫలం అయ్యాయి. పర్యవసానంగా రైతులకు నష్టం జరిగింది. మున్ముందైనా ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచించాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top