నేపాల్‌తో మళ్లీ సాన్నిహిత్యం

Nepal PM India Visit Delhi Kathmandu Friendship Editorial By Vardelli Murali - Sakshi

భారత్‌తో ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరుచుకునేందుకు నేపాల్‌ ప్రధాని షేర్‌ బహదూర్‌ దేవ్‌బా దేశంలో మూడు రోజులు పర్యటించారు. రెండేళ్ల క్రితం సరిహద్దుల విషయంలో వివాదం తలెత్తాక అప్పటికే అంతంతమాత్రంగా ఉన్న సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. వాటిని మళ్లీ సరిచేసుకోవడమే దేవ్‌బా తాజా పర్యటన ఆంతర్యం. నిరుడు జూలైలో అయిదోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక దేవ్‌బా జరిపిన మొదటి విదేశీ పర్యటన ఇది. ఇరుగు పొరుగు అన్నాక సమస్యలు తలెత్తడం, అవి విభేదాలుగా పరిణమించడం వింతేమీ కాదు. శతాబ్దాలుగా భారత్, నేపాల్‌ దేశాల మధ్యా సాంస్కృతిక, వాణిజ్య సంబంధాలున్నాయి.

అందుకే అప్పుడప్పుడు పొరపొచ్చాలు ఏర్పడినా, మరో దేశం ఆ సమస్యలను స్వప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని చూసినా ఇరు దేశాలూ ఎప్పటికప్పుడు సంయమనం పాటించి లోటుపాట్లు సరిదిద్దుకుంటున్నాయి. తిరిగి ఒక్కటవుతున్నాయి. దేవ్‌బాకు ముందున్న ప్రధాని కేపీ ఓలి చైనా ప్రభావంతో మన దేశంతో తగాదాకు దిగారు. పర్యవసానంగా ఇరు దేశాల సంబంధాలూ దెబ్బతిన్నాయి. ఆ తర్వాత వచ్చిన దేవ్‌బా ఆ సంబంధాలను తిరిగి మామూలు స్థితికి తెచ్చేందుకు కృషి చేశారు. దానిలో భాగంగానే ఆయన భారత్‌ పర్యటనకొచ్చారు. నేపాల్‌కు ఇది ఎన్నికల సంవత్సరం కూడా.

కనుక రెండు దేశాల మధ్య తలెత్తిన సరిహద్దు వివాదం సమస్య ఆ ఎన్నికల్లో ప్రముఖంగా ప్రస్తావనకు రావడం ఖాయం. ఉత్తరాఖండ్‌లో భాగంగా ఉన్న లింపియాధుర, కాలాపానీ, లిపులేఖ్‌ ప్రాంతాలను నేపాల్‌ 2020లో తన మ్యాప్‌లో భాగంగా చూపింది. దానికి సంబంధించిన బిల్లుకు అక్కడి పార్లమెంటులో ఆమోద ముద్ర పడింది. రాబోయే ఎన్నికల్లో దేవ్‌బాను దెబ్బతీయడానికి మాజీ ప్రధాని ఓలి శర్మ, ఇతరులు గట్టిగానే ప్రయత్నిస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత త్వరగా ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శుల స్థాయిలో ఈ వివాద పరిష్కారానికి ఒక యంత్రాంగం ఏర్పాటు చేసుకోవాలి.

బిహార్‌లోని జయనగర్‌ నుంచి నేపాల్‌లోని కుర్తా వరకూ నడిచే రైలుకు ఇరు దేశాల ప్రధానులు పచ్చజెండా ఊపారు. 35 కిలోమీటర్ల నిడివిగల ఈ మార్గంలో ఇరు దేశాల మధ్యా ప్రారంభమైన తొలి బ్రాడ్‌గేజ్‌ రైల్వే లైన్‌ ఇది. దీన్ని మరింత దూరం పొడిగించడానికి మన దేశం సాయపడ బోతోంది. అలాగే మన దేశం నిర్మించిన విద్యుత్‌ కారిడార్‌ను కూడా లాంఛనంగా దేవ్‌బాకు అప్పగించారు. ఈ కారిడార్‌ వల్ల అక్కడి ఈశాన్య ప్రాంత మారుమూల పల్లెలకు సైతం నేపాల్‌ విద్యుత్‌ సదుపాయం అందించగలుగుతుంది. ఇవిగాక నేపాల్‌లో విద్యుదు త్పత్తి ప్రాజెక్టులను ఉమ్మడిగా అభివృద్ధి చేయడంతో సహా మరెన్నో ఒప్పందాలపై ఇరు దేశాలూ సంతకాలు చేశాయి. 

మన దేశంతో నేపాల్‌ క్రమేపీ సన్నిహితమవుతున్న తీరును చైనా గమనిస్తూనే ఉంది. దేవ్‌బా మన దేశం రావడానికి మూడు రోజుల ముందు నేపాల్‌లో చైనా విదేశాంగమంత్రి వాంగ్‌ యీ పర్య టించారు. ఒక్క మన దేశంతో మాత్రమే కాదు... అమెరికాతో కూడా నేపాల్‌ దగ్గరవుతుండటాన్ని దృష్టిలో ఉంచుకునే వాంగ్‌ యీ హుటాహుటీన ఈ పర్యటనకొచ్చారు. నేపాల్‌లో రోడ్లు, విద్యుత్‌ ప్రాజెక్టుల కోసం ఒక సంస్థ ద్వారా తాను అందించదల్చుకున్న సాయం అంగీకారమో కాదో మార్చి 28 లోగా చెప్పాలని అమెరికా గడువు విధించింది. 50 కోట్ల డాలర్ల విలువైన ఆ గ్రాంటు స్వీకరించడానికి నేపాల్‌ కొంత సందేహించింది.

అయితే దీన్ని అంగీకరించకపోతే నేపాల్‌తో తన ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించుకుంటానని అమెరికా హెచ్చరించడంతో గడువుకు ఒక్కరోజు ముందు నేపాల్‌ పార్లమెంటు ఆ గ్రాంటు తీసుకోవడానికి ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను వ్యతిరేకిస్తూ ఐక్యరాజ్యసమితిలో నేపాల్‌ ఓటువేసింది. దీనికి కూడా అమెరికా ఒత్తిడే కారణం. చిత్రమేమంటే ఈ రెండు అంశాల్లోనూ ప్రచండ నాయకత్వంలోని మావోయిస్టు సెంటర్, మాధవ్‌ నేపాల్‌ ఆధ్వర్యంలోని యూనిఫైడ్‌ సోషలిస్టులు ప్రభుత్వానికి మద్దతునిచ్చాయి. చైనాకు అత్యంత సన్నిహితమని ముద్ర ఉన్న మాజీ ప్రధాని శర్మ ఓలి నాయకత్వంలోని యూనిఫైడ్‌ మార్క్సిస్టు–లెనినిస్టు పార్టీ సైతం తటస్థంగా ఉండిపోయింది.

ఈ పరిణామాలతోపాటు భారత్‌లో దేవ్‌బా పర్యటించడాన్ని కూడా చైనా జీర్ణించుకోలేకపోయింది. నెహ్రూ ఏలుబడిలో దక్షిణాసియా దేశాలతో మన సంబంధాలు సక్రమంగా ఉండటం లేదని నిపుణులు విమర్శించేవారు. ముఖ్యంగా నేపాల్‌తో సంబంధాల విషయంలో మనం పెద్దన్న పోకడలకు పోతే ఆ దేశం చైనాను ఆశ్రయించే అవకాశం ఉన్నదని హెచ్చరించేవారు. చిత్రమేమంటే అనంతరకాలంలో కేంద్రంలో ఏ పార్టీ అధికా రంలో ఉన్నా ఈ విషయంలో దిద్దుబాటు చర్యలు అంతంతమాత్రమే. అందువల్లే నేపాల్‌కు చైనా సన్నిహితం కాగలిగింది. వేలాదిమంది నేపాలీ విద్యార్థులకు తమ దేశంలోని విద్యాసంస్థల్లో చవగ్గా చదువుకునే అవకాశం కల్పించింది.

నేపాల్‌లో మాండరిన్‌ భాష నేర్పించడానికి పలు కేంద్రాలను ప్రారంభించింది. ఇప్పటికైతే నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీలు భారత్, అమెరికాలతో దేవ్‌బా ప్రభుత్వ సంబంధాలపై నోరెత్తడంలేదు. అయితే ఈ ఏడాది చివరిలో జరగబోయే ఎన్నికలనాటికి అమెరికా మాటెలా ఉన్నా భారత్‌ వ్యతిరేకతను రెచ్చగొట్టి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తాయి. కనుక సరిహద్దు అంశంలోనైనా, మరే ఇతర విషయంలోనైనా మన దేశం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో, సామరస్యపూర్వకంగా వ్యవహరించడం అవసరం. ఆ దిశగా చర్యలు తీసుకోవడానికి దేవ్‌బా తాజా పర్యటన దోహదపడితే ఇరు దేశాల సంబంధాలూ మరింత మెరుగుపడతాయి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top