అంచనాలు నిజం కావాలి!

Imd Forecast Monsoon Rainfall Normal This Year - Sakshi

ఎండలు మండిపోతున్న వేళ... ఇది చల్లటి వార్తే. అంతకంతకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్‌ ధరలు, వాటితో పాటు ఆకాశానికి అంటుతున్న ఆహార ధరలు, వెరసి విరుచుకు పడుతున్న ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో కొంత ఉపశమన వార్త. ఆ చల్లటి కబురు ఏమిటంటే – ఈ ఏడాది వర్షాలు సకాలంలోనే పడతాయట! రాబోయే నైరుతి రుతుపవనాల్లో దేశంలో సగటు వర్షపాతం ‘సాధారణం’గానే ఉంటుందట! రాబోయే వర్షాకాలానికి సంబంధించి భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించిన తొలి అంచనా ఇది. అయితే, సగటు వర్షపాతమంటే ఎంత అనే పరిణామాన్ని తగ్గించి, నిర్వచనాన్ని సవరించడం గమనార్హం. కాకపోతే, ఐఎండీ అంచనాలు నిజమైతే, కూరగాయల ధరలపై నేరుగా ప్రభావం చూపి, భారం కొంత తగ్గుతుందని ఆశ. 

కొన్నేళ్ళుగా ఏటా సగటు వర్షపాతం బాగుంది. కరోనాలో పట్టణాలను వదిలి వలసపోతున్న శ్రామికవర్గానికి గ్రామాల్లో వ్యవసాయం రంగంలో ఉపాధి కల్పనకు ఈ ‘సాధారణ’ వర్షపాతం ఉపయోగపడింది. ఈసారీ నైరుతి రుతుపవనాలు బాగుంటే, వ్యవసాయ రంగానికి మరింత ఊపు నిస్తుంది. కరోనా తగ్గుముఖం పట్టి, జనం తిరిగి పట్టణాల బాట పడుతుండడంతో, గ్రామీణ భారతంలో శ్రామికులకు మళ్ళీ గిరాకీ ఉంటుంది. కూలీ హెచ్చి, వారి కొనుగోలు శక్తీ పెరుగుతుందని భావన. జనాభాలో సగానికి పైగా వర్షాధారిత వ్యవసాయం మీదే ఆధారపడే దేశానికి సాధారణ వర్షపాతం, తద్వారా పెరిగే గ్రామీణ వినియోగం, మెరుగుపడే ఆర్థిక వ్యవస్థ శుభసూచనలే. 

జూన్‌ – సెప్టెంబర్‌ సీజన్‌కు సంబంధించి ఏటా ఐఎండీ రెండుసార్లు అంచనాలిస్తుంది. ఏప్రిల్‌లో చెప్పింది తొలి అంచనా. మళ్ళీ సరిగ్గా నైరుతి రుతుపవనాలు రావడానికి ముందు మే నెల చివరలో మరింత నిర్దిష్టమైన రెండో అంచనా వస్తుంది. ప్రస్తుతానికైతే... మధ్య పసిఫిక్‌ను వేడెక్కించి, నైరుతి భారతావనిపై వర్షాలను ఆవిరి చేసే ‘ఎల్‌నినో’ లాంటి పరిస్థితులేమీ ఉండవనే లెక్కతో ఐఎండీ తొలి అంచనా వేసింది. రాగల నాలుగు నెలల కాలం ‘ఎల్‌నినో’కు వ్యతిరేకంగా, భారత్‌కు లబ్ధి చేకూర్చే ‘లానినా’ పరిస్థితులు ఉన్నాయట. అయితే, ‘దీర్ఘకాలిక సగటు (ఎల్పీఏ)’ వర్షపాతం అంటే ఒకప్పుడు 89 సెంటీమీటర్ల వర్షపాతమని లెక్క. 1951 నుంచి 2000 వరకు 50 ఏళ్ళ సగటును బట్టి అలా తీర్మానించారు. కానీ, ప్రతి దశాబ్దానికి ఒకసారి దాన్ని సవరించాల్సి ఉంటుంది. నాలుగేళ్ళ క్రితం 1961 నుంచి 2010 సగటును చూసుకొని, ఆ నిర్వచనాన్ని 88 సెంటిమీటర్లకు తగ్గించారు. తాజాగా ఈ ఏడాది 1971 నుంచి 2020 వరకు సగటును బట్టి, దాన్ని మళ్ళీ సవరించారు. ‘ఇప్పుడిక ఎల్పీఏ అంటే 87 సెంటీమీటర్ల వర్షపాతమే’ అని తీర్మానించారు. 

సాధారణంగా ఎల్పీఏ లెక్కలో 96 నుంచి 104 శాతం మధ్య ఎంత వర్షం కురిసినా, ఆ ఏడాది వర్షపాతం ‘సాధారణ’మనే అంటారు. ఆ పద్ధతిలో రానున్న నైరుతి రుతుపవనాలు సాధారణ వర్షపాతం అందిస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. మంచిదే. కానీ, ఎల్పీఏ నిర్వచనం ప్రకారం మునుపటి దశాబ్దాలతో పోలిస్తే సగటు వర్షపాతం 2 సెంటీమీటర్ల మేర తగ్గడం ఒకింత ఆందోళన కరం. ఒక్క సెంటీమీటరేగా అనుకోవడానికి వీల్లేదు. ఆ ఒక్క సెంటీమీటర్‌ సగటు వర్షపాతం వివిధ ప్రాంతాల్లో, విభిన్న రకాలుగా ఉండే వర్షాలలోని మార్పులకు సంకేతం. వాతావరణ శాఖ మాత్రం శతాబ్ద కాలంలో ప్రతి దశాబ్దానికోసారి సగటు వర్షపాతంలో మార్పులొస్తాయనీ, ఒక 30 ఏళ్ళ కాలం తగ్గుతూ వస్తే, తర్వాతి 30 ఏళ్ళు పెరుగుతూ వస్తాయని వివరిస్తున్నారు. ప్రస్తుతం మనం నిర్జల శకం చివరలో ఉన్నాం గనక వచ్చే 30 ఏళ్ళ తేమ శకంలో వర్షపాతం బాగుంటుందని భరోసా ఇస్తున్నారు. 

నిజానికి, వాన రాకడ – ప్రాణం పోకడ ఎవరైనా ఎంత కచ్చితంగా చెప్పగలరన్నది ప్రశ్న. అందులోనూ కాలచక్రంలో మార్పులతో, రుతువులు ముందు వెనుకలవుతూ అనిశ్చిత వర్తమాన వాతావరణంలో ఇది మరింత క్లిష్టమే. ఇక, పాశ్చాత్య దేశాల అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన వాతావరణ అంచనాలతో పోలిస్తే, మన దగ్గర అంచనాలు ఎంత నిర్దుష్టమనేదీ మరో ప్రశ్న. మన వాతావరణ అంచనాలు గతంలో పలు సందర్భాల్లో విఫలమైన ఉదాహరణలూ అనేకం. ఆ అప్రతిష్ఠనూ, అనుమానాలనూ ఐఎండీ పోగొట్టుకోవాలి. అలాగే ఒకప్పుడు వాతావరణ కేంద్రాల డేటా బాగా ఆలస్యమయ్యేది కూడా! అయితే, ఇప్పుడు ఆటోమేటెడ్‌ వ్యవస్థకు మారడంతో, ఏ క్షణానికి ఆ క్షణం డేటా వస్తుందని ఐఎండీ కథనం. అలాగే, ఒకప్పుడు 1000 పై చిలుకు వాతావరణ కేంద్రాలే ఉండగా, ఇప్పుడు 4 వేల కేంద్రాలున్నాయి. వీటన్నిటి వల్లే ఎల్పీఏ సహా అనేక అంశాలను ఎప్పటికప్పుడు సవరించుకుంటూ, అంచనాలు వేయగలుగుతున్నామనేది వాతావరణ శాఖ మాట. 

వాతావరణ అంచనాలు ఎంత కచ్చితంగా ఉంటే, వ్యవసాయాధారిత దేశంలో రైతులు సహా అనేక వర్గాలకు అంత ఉపయోగం. అందుకే, మొక్కుబడిగా కాక నిక్కచ్చిగా ఇవ్వడం ముఖ్యం. దేశ వార్షిక సగటు వర్షపాతం 117.6 నుంచి 116 సెంటీమీటర్లకు తగ్గినట్టు లెక్క. ఈ పరిస్థితుల్లో దేశంలో కురిసే మొత్తం వర్షంలో దాదాపు 75 శాతానికి ఆధారమైన నైరుతి రుతుపవనాలు కీలకం. వరుసగా ఈ నాలుగో ఏడాదీ అవి సకాలంలో, సవ్యంగా వర్షిస్తే ప్రజానీకానికి హర్షమే. రుతుపవనాలతో పాటు మొదలయ్యే ఖరీఫ్‌ సాగుకు ఎరువులు మరో సమస్య. ఏడాదిగా ప్రపంచమంతటా ఎరువులు, వాటి ముడిపదార్థాల ధరలు ద్విగుణం, త్రిగుణమయ్యాయి. ఉక్రెయిన్‌లో యుద్ధంతో దిగుమతీ గడ్డుగా మారింది. మరి ఆఖరులో హడావిడి పడక, తగిన ప్రణాళికతో దేశ పాలకులు సిద్ధమవుతున్నారా?

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top