'బుల్లిబాయ్‌' యాప్‌.. వికృత పోకడలు

Editorial About Bulli Bai App Case  - Sakshi

దేశంలో విద్వేష వాతావరణం క్రమేపీ విస్తరిస్తున్నదని కలవరపడుతున్నవారికి తాజా పరిణామం మరింత ఆందోళన కలిగిస్తుంది. వందమంది ముస్లిం మహిళల ఫొటోలను మార్ఫింగ్‌ చేయడంతోపాటు వారిని వేలం వేస్తూ దుండగులు ఆన్‌లైన్‌లో పెట్టిన వైనం అందరినీ దిగ్భ్రాంతి పరిచింది. సరిగ్గా ఆరునెలల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు ఈ మాదిరే వందమంది మహిళలను లక్ష్యంగా చేసుకున్నారు. దానిపై ఇంతవరకూ సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమైనందువల్లే కావొచ్చు, దుండగులు మరోసారి రెచ్చిపోయారు. విద్వేషం తలకెక్కినవారికి యుక్తాయుక్త విచక్షణ ఉండదు. ఏం చేస్తున్నామన్న స్పృహ ఉండదు. అరెస్టయిన ఇద్దరిలో ఒకరు ఉత్తరాఖండ్‌కు చెందిన పద్దెనిమిదేళ్ల యువతి కాగా, మరొకరు బెంగళూరు యువకుడు.

లక్షణంగా చదువుకోవాల్సిన వయసులో... పైపైకి ఎదగడానికి కావలసిన జ్ఞానాన్ని సముపార్జించి భవిష్యత్తుకు బంగారు బాటలు పరుచుకోవాల్సిన వయసులో పిల్లలు ఇంత విషపూరితంగా మారడానికి, దారి తప్పడానికి వారిని ప్రేరేపించిందీ, ఉన్మాదాన్ని నూరిపోసిందీ ఎవరు? సరిగ్గా దర్యాప్తు చేస్తే ఇవన్నీ బయటపడకపోవు. కొందరు భావిస్తున్నట్టు కేవలం ఆకతాయితనంతో చేసిన చిల్లర చేష్టగా దీన్ని కొట్టిపారేయడం అసాధ్యం. ఓపెన్‌ సోర్స్‌ వెబ్‌ టూల్‌ గిట్‌హబ్‌లో ఉంచిన ఈ యాప్‌ రూపకల్పన కేవలం వీరిద్దరు మాత్రమే చేసివుంటారని భావించడం కష్టం. సంఘటిత నేరగాళ్ల ప్రమేయం లేకుండా ఇది జరిగిందని విశ్వసించడం అసాధ్యం. 

దుండగుల లక్ష్యంగా మారిన మహిళల్లో అత్యధికులు ఉన్నత విద్యావంతులు, వివిధ రంగాల్లో లబ్ధప్రతిష్ఠులు. ఇందులో పాత్రికేయులున్నారు, కళాకారులున్నారు, పరిశోధకులున్నారు, సినీతారలు న్నారు. వీరంతా తమ తమ రంగాలకే పరిమితం కాకుండా జరుగుతున్న అన్యాయాలపై బాధ్యతగా గళమెత్తుతున్నవారు. సామాజిక మాధ్యమాలతో సహా అన్ని వేదికల్లోనూ నిక్కచ్చిగా, నిర్మొహ మాటంగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నవారు. సామాజిక అసమానతలకూ, అన్యాయాలకూ వ్యతిరేకంగా పోరాడుతున్నవారు. అయిదేళ్ల క్రితం జేఎన్‌యూలో అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైన నజీబ్‌ అనే విద్యార్థి నాయకుడి తల్లి ఫాతిమా నఫీస్‌ ఫొటోను సైతం దుండగులు యాప్‌లో ఉంచారు.

తమ ఉన్మాద చేష్టకు వారినే ఏరికోరి లక్ష్యంగా చేసుకోవడంలో– ఆ పిల్లలు కావొచ్చు, వారి వెనకున్న నేరగాళ్లు కావొచ్చు– ఆశించిన ప్రయోజనం ఏమిటి? ఆ మహిళలను అంగడి సరుకుగా చిత్రీకరించడం, వారి పరువు ప్రతిష్ఠలు దెబ్బతీయడం, భయకంపితులను చేయడం, ఆ మహిళలు తలెత్తుకోలేకుండా చేయడం తక్షణ ప్రయోజనం కావొచ్చు. కానీ అంతకన్నా ముఖ్యంగా కళ్లముందు జరిగే అన్యాయాలపై మరే మహిళా గొంతెత్తకుండా చూడటం, సమాజంలో పరస్పర వైషమ్యాలు పెంచడం, అది నిస్సహాయంగా మిగిలిపోయేలా చేయడం ఈ చేష్టల ఆంతర్యం. సారాంశంలో ఇది సామాజిక ధ్వంస రచన. అందుకే దీన్ని తేలిగ్గా తీసుకోలేం.

ఆన్‌లైన్‌ విధానం అందుబాటులోకొచ్చాక... సామాజిక మాధ్యమాలు విస్తరించాక పౌరులకు గోప్యత లేకుండా పోయిందన్నది వాస్తవం. పౌరుల్లో ఎవరెవరు ఏ ఏ వెబ్‌సైట్లు చూస్తున్నారో, ఎలాంటి లావాదేవీలు నిర్వహిస్తున్నారో నిత్యం కన్నేసి ఉంచే విభాగాలు ప్రపంచ దేశాల న్నిటితోపాటు మన దేశంలో కూడా పెరిగాయి. దేశాల భద్రతకు ఇది అవసరం కూడా. గుర్తుతెలియని వ్యక్తులు చొరబడే ప్రయత్నం చేశారని తమ ఖాతాదారులను వివిధ మాధ్యమాలు హెచ్చరిస్తున్న ఉదంతాలు అడపా దడపా చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వెబ్‌సైట్‌లో ఒక అవాంఛనీయమైన యాప్‌ ప్రత్యక్షమైందని ఫిర్యాదు వచ్చేవరకూ గ్రహించ లేకపోవడం, వెనువెంటనే దర్యాప్తు జరిపి దాన్ని ఫలానా ప్రాంతంనుంచి ప్రయోగించి ఉంటారని ఆచూకీ రాబట్టలేకపోవడం చేతగానితనం కాదా? మహిళలపై జరిగే నేరాలను అరికట్టడానికి మన దేశంలో కఠినమైన చట్టాలు వస్తున్నాయి.

కానీ ఆ నేరాలు తగ్గటం మాట అటుంచి క్రమేపీ పెరుగుతూ పోవడంలో పోలీసుల వైఫల్యమే ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఫిర్యాదు నమోదు చేసుకోవడం దగ్గరనుంచి మొదలయ్యే అలసత్వం నేరగాళ్లకు ఊతం ఇస్తోంది. ఈ వికృత యాప్‌ విషయంలోనూ జరిగింది ఇదే. తమ వెబ్‌సైట్‌లో ఉంచిన యాప్‌ను ఆరునెలలక్రితం ఇదే సంస్థ తొలగించింది. అది మినహా తమకేం కాలేదన్న ధైర్యంతో ఇప్పుడు మరో యాప్‌తో ఆ నేరగాళ్లు బయల్దేరారు. 

అట్టడుగు వర్గాలవారినీ, మహిళలనూ కించపరచడం, వారిపై విద్వేషం వెళ్లగక్కడం మన దేశంలో కొత్తేమీ కాదు. ‘మతములన్నియు మాసిపోవును–జ్ఞానమొక్కటె నిలిచి వెలుగును’ అన్నాడు మహాకవి గురజాడ. కానీ ఆయన ఆశించినదానికి విరుద్ధంగా ఆధునికత పెరిగేకొద్దీ, అభివృద్ధి విస్తరిస్తున్నకొద్దీ విద్వేషం రూపం మార్చుకుంటోంది. ఊహించ సాధ్యంకాని పోకడలు పోతోంది. చూస్తుండగానే అది పిల్లలను కూడా కాటేస్తోంది. తెలిసీ తెలియని వయసులో వారిని నేరగాళ్లుగానో, బాధితులుగానో మార్చి వారి జీవితాలను అగాథంలోకి నెట్టేస్తోంది. దీన్ని సకాలంలో గుర్తించి చర్యలు తీసుకోవడంలో విఫలమైతే సమాజం కల్లోలభరితమవుతుంది. విద్వేషపూరిత ప్రసంగాలు చేసేవారి విషయంలో కేంద్ర ప్రభుత్వం అలసత్వంతో వ్యవహరిస్తున్నదన్న ఆరోపణలు ఇప్పటికే వస్తున్నాయి. కనుక ఈ యాప్‌ రూపకర్త్తలపై కఠిన చర్యలకు ఉపక్రమించడం పాలకుల బాధ్యత. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top