● రెండు పంచాయతీల్లో
ప్రత్యర్థులుగా బరిలోకి..
● సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు హోరాహోరీ
ద్వారకాతిరుమల: కుటుంబ బంధాలు వేరు.. రాజకీయ పోరు వేరు! ఒకే కుటుంబానికి చెందిన అత్తాకోడళ్లు ఎన్నికల బరిలో ప్రత్యర్థులుగా నిలవడంతో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ద్వారకాతిరుమల మండలంలో రెండో విడత ఎన్నికల ప్రచారం ఊపందుకున్న వేళ.. రెండు పంచాయతీల్లో అత్తాకోడళ్ల మధ్య నెలకొన్న పోటీ చర్చనీయాంశంగా మారింది. సీహెచ్ పోతేపల్లిలో టీడీపీ తరఫున అత్త పల్లపాటి మహాలక్ష్మి, వైఎస్సార్ సీపీ తరఫున కోడలు పల్లపాటి ప్రియ సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. మహాలక్ష్మి భర్త, ప్రియ మామ సొంత అన్నదమ్ములు కావడంతో ఈ పోటీకి కుటుంబ నేపథ్యం తోడైంది. అయితే ఇదే పంచాయతీలో మరో టీడీపీ అభ్యర్థి కూడా సర్పంచ్ పదవికి పోటీలో ఉండటం విశేషం. మరోవైపు రామన్నగూడెం పంచాయతీలోనూ అత్తాకోడళ్లు తలపడుతున్నారు. దేవినేనివారిగూడెం నుంచి ఆరో వార్డు సభ్యురాలి స్థానానికి టీడీపీ తరఫున అత్త తుందుర్తి ఇందిర పోటీలో ఉండగా.. టీడీపీ రెబల్ అభ్యర్థిగా కోడలు తుందుర్తి మాధవి బరిలో నిలిచారు. ఇందిర భర్త, మాధవి మామ కూడా సొంత అన్నదమ్ములే కావడం గమనార్హం. రెండు చోట్లా ఒకే కుటుంబానికి చెందిన అత్తాకోడళ్లు గెలుపే లక్ష్యంగా ప్రచారం సాగిస్తుండటంతో గ్రామాల్లో పోరు ఆసక్తికరంగా మారింది. ఈ నెల 29న వెలువడే ఎన్నికల ఫలితాలతో అత్తాకోడళ్లలో విజయం ఎవరిని వరిస్తుందో తేలనుంది.


