● వేతనాల మంజూరులో ప్రభుత్వం నిర్లక్ష్యం
● మరో మూడు రోజుల్లో పదవీకాలం ముగింపు
● ఆవేదన వ్యక్తం చేస్తున్న ఎంపీటీసీ సభ్యులు
అంబాజీపేట: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండున్నరేళ్లు అవుతున్నా ప్రజాప్రతినిధులను అగౌరవ పరుస్తూనే ఉంది కూటమి ప్రభుత్వం. ఎంపీటీసీలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రెండు విడతలుగా గౌరవ చెల్లించగా, 2024 జూన్ నెలలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వారంతా పూర్తి నిర్లక్ష్యానికి గురవుతున్నారు. జిల్లాలో అమలాపురంలో 61 మంది, పి.గన్నవరం 79, రావులపాలెం 86, ముమ్మిడివరం 52, రాజోలు 63, రామచంద్రపురం 59 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. వీరికి 32 నెలల వేతనం అందాల్సి ఉంది. ఈ నెల 23తో వారి పదవీ కాలం ముగియనుంది. పలు సమావేశాల్లో వారికి అందాల్సిన గౌరవ వేతనాల కోసం బడ్జెట్లు ప్రవేశపెట్టినా ప్రజా ప్రతినిధుల ఖాతాల్లో ఒక్క రూపాయి విదల్చడం లేదు. అధిక శాతం ఎంపీటీసీ సభ్యులు వైఎస్సార్ సీపీ వారు కావడం వల్లే నిధులు మంజూరు చేయడం లేదని వారు అంటున్నారు.
స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో జరగనున్న మండల సర్వసభ్య సమావేశంలో సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజాప్రతినిధులు ఎదురుచూస్తున్నారు. ప్రజలు నేరుగా ఎన్నుకున్న తమను పదవిని బట్టి గౌరవించడం ప్రభుత్వం బాధ్యత అని, తమకు ఇవ్వాల్సిన గౌరవ వేతనాలు బకాయి పెట్టడం ఎంతవరకు సమంజసమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాడిన తరువాత గత రెండున్నరేళ్లలో ఎంపీటీసీల పేరున ఒక్క అభివృద్ధి పనీ చేపట్టలేకపోయారు. గతంలో వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా ఎంపీటీసీలకు ప్రాముఖ్యం ఇస్తు గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పనులు సాగడం లేదు. కేవలం 85 శాతం మంది వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలుగా ఉన్నారనే నిధులు, అభివృద్ధిని అడ్డుకున్నారని పలువురు విమర్శిస్తున్నారు.
బిల్లులు పెడుతున్నా మంజూరు చేయరు
ప్రభుత్వం ఎంపీటీసీ సభ్యులను చిన్నచూపు చూడడంలో ఆంతర్యమేమిటో తెలియడం లేదు. తమకు రావలసిన వేతనాలు చెల్లించడానికి ఇంత ప్రాధేయపడాలా? వేతనాల బిల్లులు పెడుతున్నా మంజూరు చేయకపోవడం దౌర్భాగ్యం. రెండు సార్లు బడ్జెట్ సమావేశం జరిగినా అందులోను కేటాయించలేదు. ఎంపీటీసీలపై నిర్లక్ష్యంగా వ్యహరించడం కూటమి ప్రభుత్వానికి మంచిది కాదు.
– దొమ్మేటి వెంకటేశ్వరరావు, ఎంపీపీ, మాచవరం


