కాకినాడ రూరల్: ఆంధ్ర కాపు సద్భావన సంఘం తాత్కాలిక నూతన అధ్యక్షుడిగా ముమ్మడి సత్యనారాయణను ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక ఎన్‌ఎఫ్‌సీఎల్ రోడ్డులోని శుభం కాపు కల్యాణ మండపంలో ఈ ఎన్నిక నిర్వహించారు. సంఘ గౌరవాధ్యక్షుడు బసవ ప్రభాకరావు, చిట్నీడి శ్రీనివాస్, సలాది మూర్తి మాట్లాడుతూ కాపు సద్భావన సంఘం ఆంధ్ర సద్భావన సంఘంగా మారిందన్నారు. సత్యనారాయణ మాట్లాడుతూ సంఘం బలోపేతానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సభ్యులు రంగనాయకులు, రెడ్నం రాజా, కొప్పిశెట్టి శ్రీను, గంగిరెడ్డి మూర్తి, జంక్షణ బాబ్జీ, అడపా ప్రకాశరావు పాల్గొన్నారు.
సౌత్‌జోన్ అథ్లెటిక్స్‌లో
జిల్లా క్రీడాకారుల ప్రతిభ
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): పుదుచ్చేరిలో జరిగిన 37వ సౌత్‌జోన్ అథ్లెటిక్స్ పోటీలలో జిల్లా క్రీడాకారులు ప్రతిభను చాటారని జిల్లా అథ్లెటిక్స్ సంఘ అధ్యక్షుడు టీవీఎస్ రంగారావు ఆదివారం తెలిపారు. 400 మీటర్ల రిలేలో జిల్లా క్రీడాకారులు కాంస్య పతకం కై వసం చేసుకున్నారన్నారు. అలాగే తిరువనంతపురంలో జరిగిన 55వ కేవీఎస్ జాతీయస్థాయి పోటీలలో ఆర్.మోక్ష 100 మీటర్ల పరుగులో కాంస్య పతకం అందుకున్నట్టు తెలిపారు. వీరు అథ్లెటిక్స్ కోచ్ ప్రసాద్ రెడ్డి వద్ద శిక్షణ పొందుతున్నారన్నారు. విజేతలను, కోచ్‌ను అథ్లెటిక్స్ సంఘం సభ్యులు అభినందించారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ప్రత్తిపాడు: జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై ఎస్.లక్ష్మీకాంతం కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేట ప్రాంతానికి చెందిన కాకర్ల శేషగిరిరావు (75) స్థానిక ఎన్‌హెచ్‌పై మినర్వా స్కూల్ సమీపాన రోడ్డు దాటుతుండగా, గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో అతని శరీరం నుజ్జునుజ్జు కాగా, అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. మృతుడి బంధువు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై వివరించారు.
గుర్తు తెలియని మహిళ
మృతదేహం లభ్యం
సామర్లకోట: స్థానిక గోదావరి రైల్వే ఎల్‌సీ గేటు ఎదుట ఉన్న బ్రాహ్మణ రేవులో గుర్తు తెలియని మహిళ (50) మృతదేహాన్ని ఆదివారం స్థానికులు కనుగొన్నారు. సీఐ ఎ.కృష్ణభగవాన్ మాట్లాడుతూ వీఆర్వో మురళి ఫిర్యాదు మేరకు గోదావరి కాలువలో మృతదేహాన్ని బయటకు తీసి సమాచారం సేకరిస్తున్నట్లు తెలిపారు. మహిళ వద్ద ఎటువంటి ఆధారాలు లభించక పోవడంతో గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసినట్టు తెలిపారు. మహిళకు సంబంధించిన వారు సామర్లకోట పోలీసు స్టేషన్, 9440796568 నంబర్‌లో సంప్రదించాలన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చిత్రాడ వంతెన కింద ఉరి వేసుకుని..
పిఠాపురం రూరల్: పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిత్రాడ వంతెన కింద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై వి.మణికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. సుమారు 25 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి కరెంట్ పోల్‌కు ఉరివేసుకుని మృతి చెందిన స్థితిలో గుర్తించామన్నారు. మృతుడి కుడి చేతి పైభాగంలో ‘అమ్మ’ అనే తెలుగు అక్షరాలతో పచ్చబొట్టు ఉందని, ఎడమ చేతికి నలుపు రంగు బ్యాండ్ ధరించి, నలుపు రంగు నెక్ టీ–షర్ట్, సిమెంట్ రంగు షార్ట్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వద్ద ఎటువంటి గుర్తింపు పత్రాలు, ఇతర వివరాలు లభించలేదని, ఈ లక్షణాలతో ఉన్న వ్యక్తి ఎవరైనా తప్పిపోయినట్లు తెలిసినా, మృతుడిని గుర్తించినా ఎస్‌ఐని 9440796560, సీఐని 9440796523 నంబర్లలో సంప్రదించి సమాచారం అందించాలని కోరారు.


