ప్రజలకు కలెక్టర్‌ వినాయక చవితి శుభాకాంక్షలు | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు కలెక్టర్‌ వినాయక చవితి శుభాకాంక్షలు

Sep 14 2026 12:20 AM | Updated on Sep 14 2026 12:20 AM

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): వినాయక చవితి సందర్భంగా కలెక్టర్‌ కీర్తి చేకూరి జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించి, జ్ఞానం, శుభం, సంతోషాలను ప్రసాదించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని కోరారు. పీఓపీ, రసాయన పదార్ధాలతో కాకుండా మట్టి వినాయకుని ప్రతిమతో పూజలు చేసుకోవాలని, పందిళ్ల వద్ద డీజే శబ్దాలతో ప్రశాంతతను పాడు చేయవద్దని ఆమె సూచించారు. అలాగే బాణసంచాపై నిషేధం ఉన్నందు వల్ల దానిని వినియోగించవద్దని ఆమె పేర్కొన్నారు.

నేడు పీజీఆర్‌ఎస్‌ రద్దు

వినాయక చవితి సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌ రద్దు చేసినట్టు కలెక్టర్‌ కీర్తి తెలిపారు. అత్యవసర ప్రజా ఫిర్యాదులు, వినతులను 1100 టోల్‌ఫ్రీ నంబర్‌ ద్వారా నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు.

ఎస్పీ శుభాకాంక్షలు

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా ప్రజలు, పోలీసు అధికారులు, సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు ఎస్పీ డి.నరసింహకిశోర్‌ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, పర్యావరణానికి అనుకూలమైన మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని జిల్లా ప్రజలకు సూచించారు. జిల్లాలో వినాయక చవితి వేడుకలు, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించుకోవాలన్నారు.

పుష్పలతకు ఉత్తమ పురస్కారం

హిందీ భాషాభివృద్ధికి విశేష సేవలు

రంగంపేట: హిందీ భాషాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న మల్లేడ పుష్పలతకు హిందీ బెస్ట్‌ టీచర్‌ పురస్కారం లభించినట్టు జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం వి.పార్ధసారథి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ హిందీ భాషా దినోత్సవం సందర్భంగా కాకినాడకు చెందిన సాహిత్య, సాంస్కృతిక, కళా రంగాల ప్రోత్సాహక వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పుష్పలతకు ఈ పురస్కారం అందజేసారని తెలిపారు. వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు దాడి చంద్రశేఖరరావు, కేడీవీబీ ప్రసాద్‌, గౌరవాధ్యక్షుడు గదుల సాయిబాబు తదితరుల చేతుల మీదుగా ఆమెకు పురస్కారాన్ని అందజేసి అభినందించినట్టు చెప్పారు. అలాగే హిందీ భాషపై నిర్వహించిన క్విజ్‌లోనూ ఆమె ద్వితీయ స్థానం సాధించినట్టు తెలిపారు. హిందీ స్కూల్‌ అసిస్టెంట్‌గా ఆరేళ్లుగా వివిధ పాఠశాలల్లో ఆమె సేవలందించారని ఆయన అన్నారు. ఆయనతో పాటు, సహోపాధ్యాయులు, విద్యార్థులు ఆమెను అభినందించారు.

భూరి విరాళం..

దాతకు సత్కారం

నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటీ): రెడ్‌క్రాస్‌ వాత్సల్య వృద్ధాశ్రమం నిర్మాణంలో ఉన్న రెడ్‌క్రాస్‌ క్యాన్సర్‌ బ్లాక్‌, రంగరాయ వైద్య కళాశాల డిజిటల్‌ మూల్యాంకన భవన నిర్మాణాలకు, వివిధ సంస్థల ద్వారా జిల్లాలోని విద్యార్థుల ఉపకార వేతనాలకు రూ.1.50 కోట్ల నిధులు విరాళంగా అందించిన కరుటూరి చక్రవర్తిని కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్‌ ఆదివారం అభినందించారు. దాత చక్రవర్తి కాకినాడ వాసి కాగా, అమెరికాలో స్థిరపడ్డారు. భవన నిర్మాణాలకు నిధులు సమకూర్చిన తరువాత మొదటిసారి కాకినాడకు విచ్చేసిన ఆయన రెడ్‌క్రాస్‌ జిల్లా, రాష్ట్ర చైర్మన్‌ వైడీ రామారావుతో కలసి కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఆయన్ని సత్కరించి, భవిష్యత్తులో జిల్లా అభివృద్ధికి మద్దతు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement