మెగా స్టంట్‌ | - | Sakshi
Sakshi News home page

మెగా స్టంట్‌

Jul 24 2026 12:22 AM | Updated on Jul 24 2026 12:22 AM

పాఠశాలల్లో నేడు మెగా పీటీఎం 4.0

సర్కారు గొప్పలు చెప్పడమే లక్ష్యం

సమస్యలు యథాతథం

వాటిని పట్టించుకోని ప్రభుత్వం

కపిలేశ్వరపురం: ప్రభుత్వం మరో ‘మెగా’ స్టంట్‌కు తెర తీసింది. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం మెగా పేరెంట్స్‌ – టీచర్స్‌ మీటింగ్‌ 4.0 నిర్వహించనుంది. విద్యార్థులు హాజరు, ప్రగతి తదితర అంశాలను తల్లిదండ్రులకు వివరించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. దీంతోపాటు తల్లిదండ్రులకు ముగ్గులు, లెమన్‌ అండ్‌ స్పూన్‌, మ్యూజికల్‌ చైర్స్‌, టగ్‌ ఆఫ్‌ వార్‌ వంటి పోటీలు నిర్వహించాలి. అయితే, అసలు సమస్యలను వదిలేసి, ప్రభుత్వం దీనిని రాజకీయ ప్రచార వేదికగా ఉపయోగించుకుంటోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా తల్లికి వందనం పథకం లక్ష్యాన్ని వివరిస్తూ విద్యార్థులతో నృత్య ప్రదర్శన చేయించాలంటూ తొలుత ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో వెనక్కు తగ్గి, ఈ అంశాన్ని తొలగించింది. అయినప్పటికీ, ఈ పథకంపై తల్లిదండ్రులకు వివరంగా చెప్పాలని, ప్రభుత్వం గొప్పగా పని చేస్తున్నట్లు వారితో చెప్పించాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. గత ఏడాది జూలై 10న కూడా ఇదే తరహాలో పీటీఎం 2.0 పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉండగా వివిధ విద్యార్థి సంఘాలు శుక్రవారం పాఠశాలల దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. సరిగ్గా ఇదే రోజున మెగా పీటీఎం నిర్వహించడంపై విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. పాఠశాల మూసేయాలంటూ ఎవరైనా వస్తే తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయాలని ప్రధానోపాధ్యాయులకు విద్యా శాఖ అధికారులు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు.

ఉపాధ్యాయులకు తలనొప్పి

మెగా పీటీఎంకు సంబంధించిన ప్రతి అంశాన్నీ ఆన్‌లైన్‌లో పొందుపరచాలన్న ప్రభుత్వ నిబంధన ఉపాధ్యాయులకు తలనొప్పిగా మారింది. తల్లిదండ్రుల మొబైల్‌ ఫోన్లలో లీప్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేయించాలని, అలా చేయలేని ఉపాధ్యాయులు సంజాయిషీ ఇవ్వాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. సుమారు 30 శాతం మంది తల్లిదండ్రులకు స్మార్ట్‌ ఫోన్లు లేని పరిస్థితిలో ఈ యాప్‌ను ఏవిధంగా ఇన్‌స్టాల్‌ చేయగలమని ఉపాధ్యాయులు వాపోతున్నారు. విద్యార్థి రోజువారీ హాజరు, ప్రగతి, మార్కులు, పీటీఎం సమావేశ వీడియోలు, ఫొటోలను లీప్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలన్న నిబంధన వారికి ఇబ్బందికరంగా మారింది. కార్యక్రమం ఫొటో నాణ్యత లేకపోతే మరో ఫొటోను సిద్ధంగా ఉంచుకోవాలంటూ ఇచ్చిన ఆదేశం పాలకుల ప్రచార యావకు అద్దం పడుతోందని పలువురు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ ఒత్తిడి విద్యా శాఖ, సమగ్ర శిక్షా అధికారులు ఉపాధ్యాయులపై చేస్తున్న ఒత్తిళ్ళతో మానసిక క్షోభకు గురవుతున్నారన్న వాదన ఉంది.

అరకొరగా నిధులు

మెగా పీటీఎం నిర్వహణకు ప్రభుత్వం అరకొరగానే నిధులు విదిల్చిందని ఉపాధ్యాయులు వాపోతున్నా రు. 30 లోపు విద్యార్థులున్న పాఠశాలకు రూ.900, 31 నుంచి 100 మంది ఉంటే రూ.2,250, 101 నుంచి 250 మందికి రూ.4,500, 251 నుంచి వెయ్యి మంది విద్యార్థులుంటే రూ.6,700 చొప్పున సమగ్ర శిక్షా నుంచి పాఠశాలల ఖాతాలకు జమ చేసినట్లు చెబుతున్నారు. ఈ నిధులతో కార్యక్రమం నిర్వ హణతో పాటు వచ్చిన విద్యార్థులకు, తల్లిదండ్రులు, అతిథులందరికీ మధ్యాహ్న భోజన పథకంలో భోజనం పెట్టాలని ప్రభుత్వం పేర్కొంది. దీనికి అనుగుణంగా బియ్యం, గుడ్లు తదితర సరకుల ఇండెంట్‌ పెంచాలని సూచించింది. ఈ స్వల్ప మొత్తంతో కార్యక్రమం నిర్వహణ, టెంట్‌, మైక్‌, అలంకరణ, స్వాగత ఫ్లెక్సీల ఏర్పాటుతో పాటు అంత మందికి స్నాక్స్‌, భోజనాలు పెట్టడం, పోటీలు నిర్వహించడం ఏవిధంగా సాధ్యమని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా కొన్నిచోట్ల ఈ నిధులు ఇంకా పూర్తి స్థాయిలో జమ కాలేదని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. ఇచ్చిన నిధులు చాలకపోతే దాతల నుంచి విరాళాలు సేకరించాలంటూ ప్రభుత్వం ఓ ఉచిత సలహా కూడా ఇచ్చిందని అంటున్నారు. దాతలు ముందుకొచ్చే పరిస్థితి లేదని, దీంతో, ప్రతి సమావేశానికీ తమ జేబుల్లో నుంచి తీసి ఖర్చు చేయాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. మరోవైపు మెగా పీటీఎం భోజనాలతో తమపై కూడా భారం పడుతుందని మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు వాపోతున్నారు.

నాడు – నేడు పనులు పూర్తి చేయాలి

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నాడు – నేడు పథకంలో నిలిపివేసిన పాఠశాల భవనా ల అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలి. బడ్జెట్‌లో విద్యకు నిధులు పెంచాలి. కీలకమైన ఈ అంశాలను గాలికొదిలేసి మెగా పీటీఎం 4.0 పేరుతో ప్రచార కార్యక్రమం చేయడం సరికాదు.

– సిద్ధూ, పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకుడు, రాయవరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement