● జిల్లాలో ఏటా తగ్గిపోతున్న
బాలికల జననాలు
● లింగ నిష్పత్తిలో అసమతుల్యత
● జిల్లాలో 180 స్కానింగ్ కేంద్రాలు
● వాటిపై ఉన్నతాధికారుల
పర్యవేక్షణ కరువు
● తగ్గుతున్న జననాలు
సాక్షి, రాజమహేంద్రవరం: ఒకవైపేమో సృష్టికి మూలం సీ్త్ర అంటూ ఉపన్యాసాలు.. మరోవైపు ఆ సృష్టికి మూలమైన చిన్నారి కన్ను తెరచి లోకాన్ని చూడక ముందే ఆమె ఉనికిని తుంచేస్తున్న దుస్థితి జిల్లాలో నెలకొంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం జిల్లావ్యాప్తంగా బాలురతో పోలిస్తే బాలికల నిష్పత్తి పడిపోతోంది. ఇది కేవలం సంఖ్యల తేడాగా కాకుండా లింగ నిష్పత్తిలో సమతుల్యత కూలిపోతోందనడానికి స్పష్టమైన హెచ్చరికగా భావించాలి. మరోవైపు ఏటా జననాలతో పాటు, బాలురతో పోలిస్తే బాలికల సంఖ్యలో కూడా తగ్గుదల కనిపిస్తోంది.
స్కానింగ్ కేంద్రాలపై పర్యవేక్షణ శూన్యం
‘మా అమ్మాయికి ఇద్దరు ఆడపిల్లలు. ఈసారి మగ పిల్లాడే పుట్టాలి’ అంటూ కుటుంబంలో ఒత్తిడి.. ‘ఆడపిల్ల పుడితే కట్నాలు ఇచ్చుకోలేం’ అనే పాత కాలపు భయాలు ఆధునిక కాలంలోనూ మన సమాజాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. స్కానింగ్ రిపోర్టులో ‘పాప’ అని తెలియగానే ఆ ప్రాణానికి గర్భాలయంలోనే సమాధి కట్టే ఆలోచనా విధానం మానవత్వానికే మచ్చగా నిలుస్తోంది. మరోవైపు బాలికల జననాలు పడిపోవడం వెనుక స్కానింగ్ కేంద్రాల పాత్ర కూడా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. రాజమహేంద్రవరం నగరంతో పాటు జిల్లావ్యాప్తంగా మొత్తం 180 స్కానింగ్ కేంద్రాలున్నాయి. గర్భంలో పెరుగుతున్నది బాబో, పాపో అనే విషయాన్ని చెప్పడం చట్ట ప్రకారం నేరం. కానీ, కాసులకు కక్కుర్తి పడిన కొన్ని స్కానింగ్ కేంద్రాలు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ.. సైగలు, కోడ్ భాషలతో ఆ గుట్టు రట్టు చేసేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. గర్భాలయంలో పెరుగుతున్నది ఆడపిల్ల అని తెలిస్తే.. ఇంకా పూర్తిగా రూపు దిద్దుకోని ఆ ప్రాణాన్ని కొంత మంది కుటుంబ ప్రాధాన్యాలు, ఆర్థిక, ఆరోగ్య పరిస్థితలు వంటి వివిధ కారణాలతో కడుపులోనే చిదిమేస్తున్నారు. అందువల్లనే బాలికల జననాలు ఏటా తగ్గిపోతున్నాయని తెలుస్తోంది. సంబంధిత ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో దీనికి సంబంధించిన ఆధారాలు వెలుగు చూడటం లేదు. ఉన్నతాధికారులు ప్రత్యేక నిఘా పెట్టి, కొరడా ఝుళిపిస్తే దీనికి అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. అలాగే, ఆడపిల్ల భారం కాదు.. భవిష్యత్తుకు, రేపటి తరానికి ఆధారం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించేలా అవగాహన పెంచడం ఎంతో అవసరం.
లింగ నిర్ధారణ తీవ్ర నేరం
గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చేయడం తీవ్ర నేరం. పాప అయినా బాబు అయినా ఒక్కటేననే విషయంపై, లింగ నిర్ధారణ పరీక్షలు నేరమనే అంశంపై ఐసీడీఎస్, వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందితో కలసి క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. స్కానింగ్ కేంద్రాలపై నిఘా పెట్టి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ పి.కోమల, జిల్లా వైద్య,
ఆరోగ్య శాఖ అధికారి
జిల్లాలో మూడేళ్లుగా లింగ నిష్పత్తిలో తేడా ఇలా..
సంవత్సరం జననాలు బాలురు బాలికలు తేడా
2024–25 19,524 10,085 9,439 646
2025–26 17,652 9,044 8,608 436
ఈ ఏడాది మే వరకూ 2,572 1,346 1,226 120


