ఖతార్‌పై ఇరాన్ దాడి
● గల్ఫ్ దేశాల్లో యుద్ధంతో
జిల్లా వాసుల్లో ఆందోళన
● ఉపాధి, ఉద్యోగాలకు వెళ్లిన
వందలాది మంది
● ఇంటర్నెట్‌పై ఆంక్షలతో మాటామంతీ కట్
● ఆందోళనలో కుటుంబ సభ్యులు
సాక్షి, అమలాపురం: సైరన్ మోతలు... దూసుకొస్తున్న క్షిపణులు... గంటకు ఒకసారి వినిపిస్తున్న భారీ పేలుళ్లు.. ఇళ్లు వీడి బయటకు రావద్దని గల్ఫ్ దేశాల్లో ప్రభుత్వ హెచ్చరికలతో అక్కడి వారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఉపాధి.. ఉన్నత ఉద్యోగాల కోసం స్వదేశాన్ని, సొంతవారిని వదులుకుని అరబ్ దేశాల బాట పట్టిన ఎంతోమంది కోనసీమ వాసుల పరిస్థితి ఇది. జరుగుతున్న యుద్ధంతో అక్కడ ఉండలేక భయకంపితులవుతున్నారు. మరోవైపు స్థానికంగా ఉన్నవారు గల్ఫ్, ఇజ్రాయిల్ దేశాల్లో ఉన్న తమ కుటుంబ సభ్యులు, బంధువుల క్షేమ సమాచారాల కోసం ఆందోళన చెందుతున్నారు.
‘‘ఎంకి పెళ్లి.. సుబ్బి చావుకు వచ్చినట్టుగా’’ ఉంది ఉపాధి కోసం అరబ్ దేశాలకు వెళ్లిన కోనసీమ వలసదారుల పరిస్థితి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్తంగా దాడి చేయడం, ఇందుకు ప్రతిగా ఇరాన్ దాడికి దిగింది. ఇజ్రాయిల్‌తో పాటు అమెరికన్ మిలటరీ బేస్ క్యాంప్‌లు ఉన్న ఖతార్, సౌదీ, కువైట్, యూఏఈపై క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఎప్పుడు ఏ క్షిపణి వచ్చి పడుతుందోనని.. ఏ బాంబు ఎక్కడ పేలుతుందోనని అనుక్షణం భయపడుతూ అక్కడ ఉన్నవారు కాలం వెళ్లదీస్తున్నారు. బంకర్లలో తలదాచుకుంటున్నారు.
జిల్లాలోని రాజోలు దీవిని మినీ గల్ఫ్‌గా అభివర్ణిస్తారు. ఈ దీవిలోని రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి, మామిడికుదురు మండలాల నుంచి వందలాది మంది గల్ఫ్ దేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్లారు. జిల్లా నుంచి అరబ్ దేశాలతో పాటు ఇజ్రాయిల్‌కు సుమారు 15 వేల మంది వరకూ వెళ్లారు. వీరిలో సగం మంది కేవలం రాజోలు దీవి నుంచి ఉంటారు. గడిచిన నాలుగైదు దశాబ్దాలుగా రాజోలు దీవి నుంచి అరబ్ దేశాలకు వెళ్తున్నారు. ఒక్కొక్క కుటుంబంలో రెండు మూడు తరాలకు చెందినవారు కూడా ఇక్కడ ఉపాధి కోసం వలస వెళ్లారంటే అతిశయోక్తి కాదు. ఆయా దేశాల్లో అన్‌స్కిల్డ్ పనులు చేసుకునేవారు 80 శాతం వరకూ ఉండగా, ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ చదువుకుని వృత్తి నైపుణ్యం ఉన్న పనిమంతులు కూడా ఉన్నారు. ఇక్కడి నుంచి వెళ్లేవారిలో ఎక్కువ మంది కువైట్, ఖతార్, సౌదీలలో ఉంటున్నారు. రాజోలు దీవి నుంచే కాకుండా ఉప్పలగుప్తం, అల్లవరం, కాట్రేనికోన, అమలాపురం, రామచంద్రపురం రూరల్ మండలాల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన వారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. జీరో క్రైమ్ రేటు, మంచి జీతాలు, ప్రశాంత జీవనం వల్ల చాలా మంది ఈ దేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు ఇరాన్ యుద్ధం పుణ్యమాని క్షిపణులు, బాంబుల మోతలతో ఆ ప్రాంతం అట్టుడుకుతోంది. నిన్నటి వరకూ నిశ్చింతంగా జీవనం సాగించిన వారి జీవితాల్లో యుద్ధం కల్లోలం రేపుతోంది.
సమాచారానికి బ్రేకులు
అక్కడున్న తమవారు ఎలా ఉన్నారో అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. యుద్ధం నేపథ్యంలో ఇంటర్నెట్, ఫోన్ల వినియోగంపై ఆంక్షలు పెడుతున్నారు. దీంతో స్థానికులకు అక్కడవారి క్షేమ సమాచారాలు పూర్తిగా తెలియడం లేదు. వీడియో కాల్స్‌కు దొరకడం లేదు. కనీసం ఫోన్లకు కూడా అందుబాటులో లేకపోవడంతో వారు భయపడుతున్నారు. యుద్ధం ముగిసిపోతోందనే ఆశతో గల్ఫ్‌లో నివాసముంటున్న వారే కాకుండా స్థానికులు కూడా కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు.


