పీజీఆర్‌ఎస్‌కు 313 అర్జీలు | - | Sakshi
Sakshi News home page

పీజీఆర్‌ఎస్‌కు 313 అర్జీలు

Mar 3 2026 8:12 AM | Updated on Mar 3 2026 8:12 AM

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమంలో ప్రజలు 313 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్‌ కీర్తి చేకూరి తదితరులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వచ్చిన ప్రతి అర్జీని సమగ్రంగా పరిశీలించి నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అర్జీలు సమర్పించేందుకు 1100 టోల్‌ ఫ్రీ నంబర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. రెవెన్యూ క్లినిక్‌లో 143, మిగిలినవి వివిధ శాఖలకు చెందినవి అర్జీలు వచ్చాయని తెలిపారు.

పోలీస్‌ పీజీఆర్‌ఎస్‌కు

31 ఫిర్యాదులు

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమానికి 31 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి పోలీసు అధికారులు అర్జీలు స్వీకరించి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే నేరుగా సంబంధిత స్టేషన్‌ పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, ఫిర్యాదీల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు.

14న జాతీయ లోక్‌ అదాలత్‌

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఈ నెల 14న జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్‌ గంధం సునీత తెలిపారు. లోక్‌ అదాలత్‌ నేపథ్యంలో అధిక సంఖ్యలో కేసులను పరిష్కరించి, బాధితులకు తగిన పరిహారం అందించే దిశగా జిల్లా కోర్టులో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న వివిధ సంస్థల సివిల్‌, కాంపౌండబుల్‌ క్రిమినల్‌ కేసులను గుర్తించి, ఆ జాబితాను జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు అందజేయాలని సూచించారు. రాజీ పడదగిన ఇతర కేసులను గుర్తించి, వాటిని త్వరగా పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్‌.శ్రీలక్ష్మి పాల్గొన్నారు.

నేడు సత్యదేవుని

ఆలయం మూసివేత

అన్నవరం: చంద్రగ్రహణం కారణంగా అన్నవరం వీర వేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయాన్ని మంగళవారం ఉదయం 10 గంటలకు మూసివేయనున్నారు. స్వామివారి దర్శనానికి భక్తులను ఉదయం 10 గంటల వరకూ మాత్రమే అనుమతిస్తారు. మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 6.47 గంటల వరకూ ఏర్పడనున్న చంద్రగ్రహణం కారణంగా సత్యదేవుని వ్రతాలను ఉదయం 9.30 గంటల వరకూ మాత్రమే నిర్వహిస్తారు. వ్రతాలు, ఆయుష్య హోమం, నిత్యకల్యాణం, కేశఖండన టిక్కెట్లు ఉదయం 7 గంటల వరకూ మాత్రమే విక్రయిస్తారు. అలాగే, స్వామివారి ప్రసాదాలు ఉదయం 9.30 గంటల వరకూ మాత్రమే విక్రయిస్తారు. పౌర్ణమి సందర్భంగా వనదుర్గ అమ్మవారికి ప్రత్యంగిర హోమం, సత్యదేవుని జన్మ నక్షత్రం మఖ సందర్భంగా నిర్వహించే ఆయుష్య హోమం, స్వామివారి నిత్య కల్యాణం ఉదయం 9 గంటలకు బదులు ఉదయం 7 గంటలకూ ప్రారంభించి, 9.30 గంటల్లోపు పూర్తి చేస్తారు. గ్రహణానంతరం స్వామివారి ఆలయం, వ్రతమండపాలు, ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేసి బుధవారం తెల్లవారుజాము నుంచి యథావిదిగా స్వామివారి దర్శనా లు, వ్రతాలు, పూజలు, కల్యాణం, ఆయుష్య హోమం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.

నేడే చంద్ర గ్రహణం

వీరేశ్వరస్వామి ఆలయం మూసివేత

ఐ.పోలవరం: ఫాల్గుణ శుక్ల పౌర్ణమి మంగళవారం చంద్ర గ్రహణం సందర్భంగా రాత్రి జరిగే భక్తుల కల్యాణాలు రద్దు చేసినట్లు మురమళ్ల వీరేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్‌ దాట్ల రామకృష్ణంరాజు, అసిస్టెంట్‌ కమిషనర్‌, ఈఓ వి.సత్యనారాయణ సోమవారం తెలిపారు. దేవస్థానం అనుసరించే పంచాంగం ప్రకారం ఆలయ అర్చకులు, పురోహితుల సూచనల మేరకు ఉదయం జరగాల్సిన అభిషేకాలు, దర్శనాలు, చండీ హోమం తదితర పూజలు జరిపించి ఉదయం 11.30 గంటలకు ఆలయ ద్వారాలు మూసివేస్తామన్నారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచి యథావిధిగా దర్శనాలు, అభిషేకాలు ఉంటాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement