మృత్యుపంజా
బాణసంచా...
ఆరని జ్వాలలు.. వరుస విషాదాలు
వేట్లపాలెం బాణసంచా కేంద్రంలో ఎగసిపడుతున్న మంటలు, దట్టమైన పొగలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ/సామర్లకోట/పిఠాపురం: సామర్లకోట మండలం వేట్లపాలెంలోని సూర్యశ్రీ ఫైర్‌వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం సంభవించిన భారీ విస్పోటంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఉలికిపాటుకు గురైంది. ప్రజలను తీవ్ర విషాదంలో నింపింది. ఈ దుర్ఘటనలో 20 నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయా యి. మరో 11 మంది క్షతగాత్రులై ఆస్పత్రుల్లో ప్రాణాపాయంలో కొట్టుమిట్టాడుతున్నారు. మృతులందరూ రోజు కూలిపై ఆధారపడి కుటుంబాలను నెట్టుకొస్తున్న వారే కావడం విషాదం. ఈ సంఘటన రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్ద విస్ఫోటం కావడమే కాకుండా.. మృతుల సంఖ్య రెండు పదులకు చేరుకోవడంతో అందరినీ కలచివేస్తోంది.
బాధిత కుటుంబాల ఆవేదన
బాణసంచా పేలుడులో 20 మంది నిరుపేదలైన కూలీలు మృతి చెందడంతో వేట్లపాలెం, గూడపర్తి, పెద్దాపురం, సామర్లకోట, మేడపాడు తదితర గ్రామాల్లో విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా కాలిన గాయాలతో కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వారి పరిస్థితిపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గత ఏడాది అక్టోబర్ 8న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రాయవరంలో జరిగిన సంఘటనలో 10 మంది మృత్యువాత పడ్డారు. నాటి దుర్ఘటనకు శ్రీగణపతి గ్రాండ్ ఫైర్‌వర్క్స్ యాజమాన్యం సరైన ముందస్తు భద్రతా చర్యలు తీసుకోకపోవడమే కారణమని తేల్చారు. ఆ దుర్ఘటనకు కొనసాగింపా అన్నట్టుగా.. ఇప్పుడు వేట్లపాలెంలో పెను విషాదం చోటు చేసుకుంది.
బతుకులు బుగ్గి
బాణసంచా తయారీ కేంద్రాలు ప్రజల గుండెలపై కుంపటిగా మారాయి. ఈ కేంద్రాల్లో పని చేస్తున్న నిరుపేదల బతుకులు బుగ్గిపాలవుతున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గడచిన రెండేళ్ల కాలంలో జరిగిన రెండు విషాదకర సంఘటనలు జిల్లా ప్రజలను కలచివేశాయి. రెక్కాడితే గాని డొక్కాడని దినసరి కూలీలే ఈ ప్రమాదాలకు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రమాదం సంభవించినప్పుడు అధికారులు హడావుడి చేసి, ఆనక చేతులు దులుపేసుకోవడమే కొంప ముంచుతోందనే వాదన వినిపిస్తోంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం, నిబంధనలు కఠినతరం చేయగలిగితే ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కావడానికి ఆస్కారం ఉండేది కాదంటున్నారు.
నిబంధనలు కఠినతరం చేయాలి
నిబంధనలు కఠినతరం చేయడం, నిరంతరం పర్యవేక్షించడం ద్వారానే బాణసంచా తయారీ కేంద్రాల్లో ప్రమాదాల నివారించడం సాధ్యమవుతుంది. పెను ప్రమాదం జరిగిన ఒకటి రెండు రోజులు అగ్నిమాపక అధికారులు హడావుడి చేయడం.. ఆనక గాలికొదిలేయడం పరిపాటి. జనం కూడా ఆ రెండు రోజులూ గుర్తుంచుకుని జాగ్రత్త పడి ఆనక మరచిపోతున్నారు. తాజాగా జరిగిన వేట్లపాలెం సంఘటనలోనూ ఇలానే జరుగుతుందని స్థానికులు అనుమానిస్తున్నారు.
అప్పుడే కళ్లు తెరచి ఉంటే..
సాంకేతిక అంశాల ఆధారంగా ఇటువంటి దుర్ఘటనల కు కారణాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి న ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఐదు నెలల క్రితం రాయవరంలో బాణసంచా దుర్ఘటన జరిగినప్పుడే కళ్లు తెరచి ఉంటే ఇప్పుడు వేట్లపాలెం ప్రమాదం చోటుచేసుకునేదే కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డ’ సామెత చందంగా క్షతగాత్రుల పరామర్శకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. సంఘటన జరిగినప్పుడు చేస్తున్న హడావుడి ఆ తరువాత వీసమెత్తు కూడా కనిపించడం లేదు. క్షేత్ర స్థాయిలో లోపాలను గుర్తించి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
మృతదేహాలను తరలిస్తున్న
అగ్నిమాపక సిబ్బంది
మృతదేహాలను ఒకచోటకు చేరుస్తున్న స్థానికులు, ఫైర్ సిబ్బంది
చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు
వారి పరిస్థితి విషమం
కాకినాడ క్రైం: సామర్లకోట మండలం వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన తొమ్మిది మంది క్షతగాత్రులను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. సప్పా సత్య వెంకటలక్ష్మి (వేట్లపాలెం దుర్గానగర్), చిటికెల లక్ష్మి (కొత్తపేట రామాలయం వీధి), కాలేటి శ్రీను, దర్శిపర్తి రాజు, వేమగిరి లోవరాజు, వేమగిరి దావీదు, దర్శిపాటి లోవరాజు, పల్లపాటి వీర శ్రీను (సామర్లకోట కుమ్మరి వీధి), మోర్తా శ్రీను (పెద్దాపురం) క్షతగాత్రుల్లో ఉన్నారు. శరీరాలు నూరు శాతం కాలిపోవడంతో వీరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. వీరిని అత్యవసర విభాగంలోని ఎంఎల్‌సీ, ట్రామా కేర్ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. గుండెలవిసేలా క్షతగాత్రుల కుటుంబీకులు రోదించిన తీరు ఆస్పత్రిలోని వారిని కలచివేసింది. క్షతగాత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి, వారికందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆయన వెంట మంత్రులు కందుల దుర్గేష్, హోం మంత్రి వంగలపూడి అనిత, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్‌బాబు, ఎంఎల్‌ఏలు నానాజీ, వెంకటేశ్వరరావు తదితరులున్నారు.
అప్పటికప్పుడు ముస్తాబు
వేట్లపాలెం బాణసంచా ప్రమాద బాధితులకు చికిత్స అందిస్తున్న కాకినాడ జీజీహెచ్‌లో వైద్య సేవల తీరు అస్తవ్యస్తంగా ఉంటోందనడానికి శనివారం నాటి పరిస్థితే ప్రత్యక్ష ఉదాహరణ. ఊహించని ఘటన కావడంతో ఆసుపత్రి అధికారులు ఒక్కసారిగా కంగారు పడ్డారు. ఏం చేయాలో తోచని గందరగోళంలో ఉక్కిరిబిక్కిరి అ య్యారు. మీడియా తాకిడి, నాయకుల హడావుడి మొదలవడంతో ఎంఎల్‌సీ వార్డును అప్పటికప్పుడు ముస్తాబు చేసేశారు. పచ్చటి డిస్పోజబుల్ బెడ్‌షీట్లు పరిచేసి సిబ్బంది, యాప్రాన్లు, యూనిఫాంఽ ధరించి వైద్యులు హడావుడి పడ్డారు. తిరగని ఫ్యాన్లను తిప్పేందుకు, వెలగని లైట్లు వెలిగేంచేందుకు ఎలక్ట్రీషియన్ల తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ఎంఎల్‌సీ వార్డు సహా ఎమర్జెన్సీ ఆరు బయట అప్పటికప్పుడు పది లైట్లు బిగించారు.
న్యాయం చేయాలి
సామర్లకోట: వేట్లపాలెం బాణసంచా పేలుడు మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా డిమాండ్ చేశారు. వేట్లపాలెంలో పేలుడు జరిగిన బాణసంచా తయారీ కేంద్రాన్ని ఆయన శనివారం పరిశీలించారు. పెద్ద సంఖ్యలో కార్మికులతో పని చేయిస్తూంటే.. ఎంత పెద్ద మొత్తంలో బాణసంచా తయారు చేస్తున్నారో గుర్తించాల్సిన బాధ్యత అధికారులపై లేదా అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రమాద స్థలాన్ని పరిశీలించి, ఆయనకు వివరాలు తెలియజేస్తామని చెప్పారు. ఈ మేరకు జగన్ రెండు రోజుల్లో వేట్లపాలెంలో పర్యటించి, మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శిస్తారని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు, ఎంపీపీ బొబ్బరాడ సత్తిబాబు, మున్సిపల్ వైస్ చైర్మన్లు ఉబా జాన్‌మోజెస్, నెక్కంటి సాయిప్రసాద్, పార్టీ నాయకులు బంగారు కృష్ణ, నిడదవోలు సురేష్ చౌదరి, వల్లూరి భద్రరావు తదితరులు పాల్గొన్నారు.
● గతేడాది రాయవరంలో
బాణసంచా పేలుడు
● ఇప్పుడు వేట్లపాలెంలో మరోసారి
● వరుస ఘటనలతో భయాందోళన
రాయవరం: బాణసంచా కాల్చినప్పుడు విరబూసే వెలుగులు ఆకాశాన్ని కమ్ముకుంటాయి. కానీ అదే బాణసంచాను తయారు చేసే కార్మికుల కుటుంబాల్లో చీకట్లు అలముకుంటున్నాయి. పొట్టకూటి కోసం కూలికి వెళ్లిన కార్మికుల బతుకులు ముగిసిపోతున్నాయి. జువ్వల కాంతుల వెనుక అంధకార విషాదం దాగుంటోంది. ఉమ్మడి జిల్లాలో ఇటీవల వరసగా జరుగుతున్న ఈ ఘటనలు భయాందోళన కలిగిస్తున్నాయి. గతేడాది అక్టోబరు 8న రాయవరంలోని గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్‌లో జరిగిన దుర్ఘటనను మరువక ముందే ఫిబ్రవరి 28న సామర్లకోట మండలం వేట్లపాలెంలో సంభవించిన బాణసంచా పేలుడు భయాందోళనను కలిగించింది.
మానని గాయం
రాయవరంలో బాణసంచా తయారు చేస్తుండగా గతేడాది అక్టోబర్ 8వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో పేలుడు సంభవించింది. ఆ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే యజమాని వెలుగుబంట్ల సత్యనారాయణమూర్తితో సహా నలుగురు మృతి చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అదే రోజు ఇద్దరు చనిపోయారు. అనంతరం రోజుల వ్యవధిలో మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా.. మొత్తం 10 మంది మృతి చెందిన విషయం పాఠకులకు విదితమే. నాటి ఘటన తాలూకు గాయం ఇంకా మానక ముందే రాయవరం గ్రామానికి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేట్లపాలెంలో ఇటువంటి ఘటనే చోటు చేసుకోవడంతో బాణాసంచా తయారీ వెనుక ఉన్న భయంకర పరిస్థితిని మరోసారి గుర్తుకు చేసింది.
మరుభూమి
నాడు రాయవరంలో ప్రమాదం జరిగిన ఘటనా స్థలిని చూస్తే యుద్ధం తర్వాత మరుభూమిని తలపించింది. ఘటనా స్థలం అంతా బూడిదగా మారి అందులో మృతదేహాలు గుర్తు పట్టలేని స్థితికి చేరాయి. చేతికి ఉన్న గాజులు, కాళ్లకు ఉన్న మట్టెల ఆధారంగా మాత్రమే పురుషులు, సీ్త్రలుగా గుర్తించారంటే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఒంటిపై ఉన్న ఆభరణాలు, చేతికి ఉన్న ఉంగరాల ఆధారంగా యజమాని ఆచూకీ కనుగొన్నారు. అసలు ఇంత పెద్ద ఎత్తున బాణాసంచా తయారు చేస్తున్నప్పుడు ప్రతి రోజూ ఎవరెవరు పనిచేస్తున్నారన్న విషయాన్ని అధికారులు తెలుసుకోవాల్సిన అవసరాన్ని తెలియజేసింది. ప్రమాదం జరిగిన తర్వాత 7.30 గంటల వరకు పూర్తిగా మృతదేహాలను గుర్తించలేక పోయారు.
ప్రాణాలు తోడేస్తున్న మందుగుండు తయారీ కేంద్రాలు నాలుగు నెలల్లో రెండు భారీ విషాద సంఘటనలు పేదల బతుకులు బుగ్గిపాలవుతున్నా పట్టించుకోని సర్కారు కొరవడిన అధికారుల పర్యవేక్షణ గతేడాది రాయవరంలో 10 మంది మృత్యువాత ఇప్పుడు వేట్లపాలెంలో 20 మంది సజీవ దహనం
హృదయ విదారకంగా..
దీపావళి, దసరా, సంక్రాంతి వంటి పండగలతో పాటు పెళ్లిళ్లు, పుట్టినరోజు వేడుకలు, చివరకు శవయాత్రల్లో సైతం వేట్లపాలెం బాణసంచా కొనుగోలుకే మొగ్గు చూపే అభిమానులు తాజా విషాద సంఘటనతో హతాశులయ్యారు. ప్రమాదం సంభవించిన సమయంలో ఘటనా స్థలిలో పరిస్థితులపై సామాజిక మాధ్యమాల్లో వచ్చిన మృతుల ఫొటోలు, వీడియోలు హృదయ విదారకంగా ఉండటం చూసిన సామాన్యుల కళ్లు చెమ్మగిల్లాయి. పేలుడు ధాటికి మృతదేహాలు ఛిద్రమై తునాతునకలై తలో పక్కగా ఎగిరిపడ్డాయి. సంఘటన స్థలానికి చేరుకున్న మృతుల బంధువులు తమవారు బతికున్నారో చనిపోయారో తెలియక తమవారు బతికుండేలా చూడు దేవుడా అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ఒకపక్క అధికారులు, సిబ్బంది మృతదేహాల భాగాలను పోగు చేస్తూంటే.. అందులో తమ వారెవరైనా ఉన్నారా అంటూ వెతుక్కోవాల్సిన దయనీయ పరిస్థితి అక్కడ నెలకొంది. బాణసంచా తయారీ పనికి వెళ్లిన వారి బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని తమ వారి జాడ కోసం కాలువలు, చెట్లు, పుట్టలు, పొలాల్లో వెతుక్కుంటూ కనిపించారు. సంఘటన స్థలానికి దూరంగా ఉన్న కాలువల్లోనూ మృతదేహాల భాగాలు దొరకడంతో ఆ చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లోనూ అధికారులు గాలింపు చేపట్టారు.
ఒక్కసారిగా పిడుగు పడినట్లు భారీ విస్ఫోటం.. పెద్ద ఎత్తున ఎగసిపడిన మంటలు.. వ్యాపించిన దట్టమైన పొగ.. ఘటనా స్థలం నుంచి ఐదు కిలోమీటర్ల మేర వినిపించిన భారీ శబ్దాలు.. తునాతునకలైన శ్రామికుల దేహాలు.. ఇవీ సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ పేలుడు సంభవించిన బాణసంచా తయారీ కేంద్రం వద్ద నెలకొన్న భయానక పరిస్థితులు. ఆనందోత్సవాలకు మరిన్ని కాంతుల్ని అద్దే ఆ నిరుపేద శ్రామికుల జీవితాలు క్షణాల్లో బూడిదకుప్పగా మారిపోయాయి. వేడుకల వేళ వెలుగులు విరజిమ్మే బాణసంచా తయారీయే వారి జీవితాల్లో చీకట్లు నింపేసింది. మృత్యుపంజా విసిరింది. వేయి నాల్కలు చాచిన అగ్నికీలల్లో కొందరు సజీవ దహనమైపోయారు. మరికొందరు కాలిన గాయాలతో ఆర్తనాదాలు చేస్తూ ప్రాణాలు విడిచారు. ఇంకొందరు ఆస్పత్రుల్లో కన్ను మూశారు.
చంద్రబాబు వైఫల్యం
చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యంతోనే ఉమ్మడి జిల్లాలోని బాణసంచా తయారీ కేంద్రాల్లో వరుసగా దుర్ఘటనలు జరుగుతున్నాయి. గతేడాది అక్టోబర్ 8న రాయవరంలోని గణపతి గ్రాండ్ ఫైర్‌వర్క్స్‌లో జరిగిన మందుగుండు సామగ్రి పేలుడు ఘటన నుంచి ప్రభుత్వం ఎలాంటి గుణపాఠాన్ని నేర్చుకోలేదు. ఆ ఘటనను తీవ్రంగా పరిగణించి తగిన చర్యలు తీసుకుని ఉంటే నేడు ఈ దుర్ఘటన పునరావృతం అయ్యేది కాదు. రాయవరం ఘటనపై వేసిన కమిషన్ దర్యాప్తు మాటలకే పరిమితం కావడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం.
– తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ
భద్రతను విస్మరించిన
ప్రభుత్వం
చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి అన్ని రంగాల్లో వైఫల్యం చెందారు. ఆయన వైఫల్యాలే ప్రజల పాలిట శాపాలుగా మారాయి. బాణసంచా తయారీలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, ఫైర్ అండ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించకుండా అనుమతులు ఇవ్వడంతో ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వేట్లపాలెం ఘటనకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాలి. ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి. ప్రజల భద్రతను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది.
– బొమ్మి ఇజ్రాయిల్, ఎమ్మెల్సీ
రూ.కోటి పరిహారం ప్రకటించాలి
బాణసంచా పేలుడులో అమాయక కూలీలు ప్రాణాలు కోల్పోవడం చాలా విచారకరం. ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలి. వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందించాలి. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడంతో పాటు భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి. బాణసంచా తయారీ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలు పెంచాలి. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
– చింతా అనురాధ, మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్
రూ.కోటి పరిహారం ఇవ్వాలి
వేట్లపాలెం బాణసంచా మృతులు ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున గాయపడిన వారికి రూ.50 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లించాలి. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలి. లేబర్ కోడ్‌ల పేరుతో అధికారుల తనిఖీలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కార్మిక చట్టాల్లో మార్పులు చేయడం వల్లనే బాణసంచా పరిశ్రమల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తరచుగా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈ ప్రమాదానికి కారణమైన యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఘటన జరిగిన తర్వాత స్పందించడం కంటే, ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలి.
– దువ్వా శేషుబాబ్జీ, చెక్కల రాజ్‌కుమార్, సీఐటీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు
మృత్యుపంజా
మృత్యుపంజా
మృత్యుపంజా
మృత్యుపంజా
మృత్యుపంజా
మృత్యుపంజా
మృత్యుపంజా
మృత్యుపంజా
మృత్యుపంజా
మృత్యుపంజా
మృత్యుపంజా
మృత్యుపంజా
మృత్యుపంజా


