చంద్రబాబు పాలనలో కల్తీ ప్రదేశ్‌గా మారిన రాష్ట్రం
సీటీఆర్‌ఐ: రాష్ట్రాన్ని కల్తీ ప్రదేశ్‌గా చంద్రబాబు ప్రభుత్వం మార్చుతోందని వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు రెవరెండ్ విజయ సారథి అన్నారు. ఆయన శనివారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎవరైనా బతకడం కోసం పాలు, నీరు తాగుతారన్నారు. కానీ రాష్ట్రంలో ఆ రెండూ ప్రాణాంతకం అవుతున్నాయన్నారు. అన్నీ కల్తీమయంగా మారుతున్నా రాష్ట్ర మంత్రులు క్రికెట్ ఆడుకుంటూ గడుపుతున్నారన్నారు. చంద్రబాబు పాలనలో డయేరియా, ఫుడ్ పాయిజన్ ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయన్నారు. రాష్ట్రంలో కుప్పకూలిన ప్రజారోగ్య వ్యవస్థకు ఆ ఘటనలు అద్దం పడుతున్నాయన్నారు. పరిపాలనపై చంద్రబాబు పూర్తిగా తన పట్టు కోల్పోగా, మిగిలిన వారంతా ప్రతిపక్షంపై బురద చల్లడం, నిత్యం అసత్య ప్రచారం చేయడంతో పాటు, రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే పనిలో నిమగ్నమయ్యారన్నారు.
నిందితుల ఇళ్లలో
ఏసీబీ అధికారుల సోదాలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఏసీబీ అధికారులు శనివారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. జనవరి 29, 30 తేదీల్లో కడియం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అఽధికారులు సోదాలు నిర్వహించి ఎస్‌ఆర్‌వో ఇప్పిలి లక్ష్మి, సీనియర్ అసిస్టెంట్ మనం వీర వెంకట కృష్ణ, ఆఫీస్ సబార్డినేట్ కొమ్మన వీరబాబులపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుల ఇళ్లపై దాడులు చేసి పలు ఆధారాలు, ఆభరణాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఆర్‌వో ఇప్పిలి లక్ష్మికి సంబంధించి కాకినాడలో ఫ్లాట్, జీ ప్లస్ వన్ భవనం డాక్యుమెంట్లు, 46 గ్రాముల బంగారం, రూ.10 లక్షలు విలువ చేసే గృహోపకరణాలు, వీరబాబు ఇంటిలో కొన్ని బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై దర్యాప్తు కొనసాగుతుందని, అవినీతిపై టోల్ ప్రీ నెంబర్ 1064 కు సమాచారం ఇవ్వాలని ఏసీబీ అధికారులు తెలిపారు.
కులాంతర వివాహమే హత్యకు కారణం
కపిలేశ్వరపురం (మండపేట): మండపేట మండలం ద్వారపూడి గ్రామ శివారు వేములపల్లిలో ఈ నెల 26 అర్ధరాత్రి జరిగిన పోలిపల్లి వీర వెంకట సూర్య ప్రకాశరావు హత్యకు ఆయన కులాంతర వివాహం చేసుకోవడమే ప్రధాన కారణంగా ప్రాథమిక విచారణలో తేలిందని రాజమహేంద్రవరం ఈస్ట్ డివిజన్ డీఎస్పీ బి.విద్య తెలిపారు. హత్య తాలూకు వివరాలను వివరాలను శనివారం మండపేట రూరల్ పోలీస్ స్టేషన్‌లో శనివారం ఆమె వెల్లడించారు. వేములపల్లికి చెందిన వస్త్ర వ్యాపారి సూర్యప్రకాశరావు, జెడ్.మేడపాడుకు చెందిన ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ అయినవిల్లి సంధ్య ఈ నెల 26న అన్నవరంలో ప్రేమ వివాహం చేసుకున్న విషయం విధితమే. కులాంతర వివాహం చేసుకోవడాన్ని సహించలేని సంధ్య సోదరులు అయినవిల్లి చంద్రపాల్, అయినవిల్లి గిరిబాబు ఒక పథకం ప్రకారమే వరుడు సూర్యప్రకాశరావును బండరాయితో కొట్టి హతమార్చారన్నారు. నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించినట్టు తెలిపారు. కేసు విచారణలో చొరవతో కృషి చేసిన సీఐ పి.దొరరాజు, ఎస్సై కిశోర్‌లను డీఎస్పీ విద్య అభినందించారు.
ఆన్‌లైన్‌లో
రవాణా శాఖ సేవలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాలోని వాహన వినియోగదారులందరికీ రవాణాశాఖ సేవలన్నీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని జిల్లా రవాణాధికారి ఆర్.సురేష్ తెలిపారు. ఆయన శనివారం మాట్లాడుతూ సారతిపరివాహన్ అనే వెబ్‌సైట్ ద్వారా డ్రైవింగ్ లైసెన్సులకు సంబంధించిన సేవలు, వాహనాల రిజిస్ట్రేషన్, టాక్స్, ఇతర సేవలు పొందవచ్చన్నారు. ప్రజలు నేరుగా ఆన్‌లైన్‌లో లేదా ప్రభుత్వం గుర్తింపు పొందిన మీ సేవ, ఈ సేవ, కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. రవాణాశాఖ సేవలకు ఎటువంటి దళారులను సంప్రదించొద్దని సూచించారు. కాగా.. జిల్లాలోని కొందరు వాహన డీలర్లు కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ల సందర్భంలో ప్రభుత్వం నిర్ణయించిన రుసుము కంటే ఎక్కువ వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. అటువంటి అక్రమ వసూళ్లపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాంటి పరిస్థితి ఏర్పడితే వాహనదారులు సంబంధిత రశీదులతో జిల్లా రవాణాధికారి మొబైల్ నెంబర్ 92816 07020ను సంప్రదించాలన్నారు.
చంద్రబాబు పాలనలో కల్తీ ప్రదేశ్‌గా మారిన రాష్ట్రం


