నూరేళ్లూ చల్లగా ఉండాలని..
ఫ చల్లని వివాహ వేదికలకు క్రేజ్
ఫ ఏసీ కల్యాణ మండపాలకే ప్రాధాన్యం
ఫ ఖర్చుకు వెనుకాడని పెళ్లి బృందాలు
రాయవరం: ఆకాశమంత పందిరి.. భూదేవంత అరుగు.. ఒకప్పుడు గోదావరి జిల్లాల్లో పెళ్లిళ్లంటే ఇలానే మాట్లాడే వారు. ఫలానా వారి తోటలో కొబ్బరాకులు, పూలంటూ పురమాయించేవారు. ఇంటి వద్దే చలువ పందిళ్లు, మండపాల ఏర్పాటుతో ఐదు రోజుల పాటు చేసే పెళ్లిని పది కాలాల పాటు చెప్పుకొనేవారు. మళ్లీ ఇప్పుడు ఆ రోజులను గుర్తు చేస్తూనే.. హంగూ ఆర్భాటాలు, అంగరంగ వైభోగాలతో దక్షిణాది సంప్రదాయానికి ఉత్తరాది మెరుగులు అద్ది, ఖర్చుకు వెనుకాడకుండా జరిపిస్తున్నారు. ముఖ్యంగా ఏ శుభకార్యం చేయాలన్నా ముందుగా ఏసీ కల్యాణ మండపాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.
జాబితా తయారీలో వధూవరులు
పెళ్లి ఎక్కడ చేసుకోవాలి? ఏ మండపంలో చేయాలి.. మెనూ ఏంటనేది వధూవరులే ఓ పెద్ద జాబితా తయారు చేసుకుంటున్నారు. జీవితకాలం గుర్తుండి పోయేలా వివాహాన్ని చేసుకోవాలని ఆశించే వధూవరులు పెళ్లికి వచ్చే స్నేహితులు, కుటుంబ సభ్యుల రాకను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక ఏసీ కల్యాణ మండపంలోనే చేసుకోవాలని భావిస్తున్నారు. వాటి అద్దె, లంచ్, డిన్నర్, అలంకరణకు కనీసం రూ.10 నుంచి రూ.15 లక్షల వరకు చేస్తున్నారని రాయవరం గ్రామానికి కల్యాణ మండపం నిర్వాహకుడొకరు చెప్పారు.
ముందుగానే బుకింగ్
వివాహం నిశ్చయమైన వెంటనే ముందుగా పెళ్లి ఎక్కడ చేయాలనే దానిపై అధికంగా చర్చించుకుంటున్నారు. ఆలయాల వద్ద కాకుంటే కల్యాణ మండపాలకే ప్రాధాన్యం ఇస్తూ.. వెంటనే మండపాల బుకింగ్ చేస్తున్నారు. రెండు, మూడు నెలల ముందుగా మండపం బుక్ చేసుకోకుంటే దొరకని పరిస్థితి ఉంది. విదేశాల్లో ఉండే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అద్దె రెట్టింపు ఇస్తామని ఫోన్లు చేసి అడుగుతున్నారని మండపాల నిర్వాహకులు చెబుతున్నారు.
పల్లెల్లో సైతం..
వాతావరణంలో వస్తున్న మార్పులు.. ఇప్పుడు కాకుంటే ఎప్పుడంటూ వివాహ వేడుకలకు ఇస్తున్న ప్రాధాన్యం నేపథ్యంలో పల్లెల్లో సైతం కల్యాణ మండపాల నిర్మాణాలు చేపడుతున్నారు. కొందరు కొత్త భవనాలను నిర్మిస్తుంటే.. మరికొందరు పాత భవనాలను కల్యాణ మండపాలుగా మార్చేస్తున్నారు. ఏ చిన్న శుభ కార్యం చేయాలనుకున్నా.. సమావేశాలు నిర్వహించాలనుకున్నా.. ఏసీ కల్యాణ మండపాలకే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. వివాహ ఆహ్వాన పత్రికల్లో సైతం ఏసీ కల్యాణ మండపం అనే విషయాన్ని స్పష్టంగా పేర్కొంటున్నారు.
వచ్చిన బంధువులు, స్నేహితులు అధిక సమయం ఉండాలంటే ఏసీ కల్యాణ మండపాలే ఉండాలని తల్లిదండ్రులు భావిస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు ఉన్న కల్యాణ మండపాల్ని ఏసీ కల్యాణ మండపాలుగా మార్చేస్తున్నారు.
ఆర్భాటానికే ప్రాధాన్యం
ఓ కల్యాణ మండపంలో ఓ వ్యాపారి తన కుమారుడికి ఇటీవల పెళ్లి జరిపించారు. సుమారు 10 రకాల స్వీట్లు, నాలుగైదు రకాల స్పెషల్ రైస్, ఆకుపై 20 రకాల కూరలు (పొడులు, పచ్చళ్లతో కలిపి) ఉండాలని చెప్పారు. 2 వేల మందికి ఆర్డర్ ఇచ్చారు. ప్లేటు రూ.500 అయ్యిందని కల్యాణ మండపం నిర్వాహకుడు చెప్పారు. ఒక్క భోజనాలకే ఖర్చు రూ.10 లక్షలు అయ్యిందని చెప్పుకొనే విధంగా చేస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో పెద్ద, చిన్న కలిపి 200 వరకూ కల్యాణ మండపాలున్నాయి. అతి పెద్ద ఏసీ మండపమైతే అద్దె రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలు ఉంటోంది. భోజనాలకు మెనూను బట్టి ఆకుపై వేసిన రకాలను బట్టి రూ.300 నుంచి 450 వరకూ పడుతుంది. ఇక కల్యాణ మండపంలో పచ్చిపూల మండపం ఏర్పాటుకు బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ తదితర నగరాల నుంచి నుంచి తీసుకొచ్చిన పూలకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ ఖర్చు చేస్తున్నారు. విద్యుద్దీపాలంకరణకు మరో రూ.లక్షన్నర వరకూ పెడుతున్నారు. ఇవి కాకుండా బాజాభజంత్రీలకు ఖర్చులు అదనం.


