జాతీయ స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్‌లో ప్రతిభ
అమలాపురం టౌన్: మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్‌లో ఈ నెల 13, 14, 15 తేదీల్లో జరిగిన 45వ ఇండియా మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్‌లో అమలాపురానికి చెందిన నలుగురు మాస్టర్స్ క్రీడాకారులు రాష్ట్రం తరఫున పాల్గొని ప్రతిభ చాటారు. 60 ప్లస్ వయసులో గాదిరాజు గంగరాజు 5కే నడకలో రజత పతకం, 800 మీటర్ల పరుగులో కాంస్య, 4 x400 రిలే పరుగులో రజత పతకాలను కై వసం చేసుకున్నారు. అలాగే 55 ప్లస్‌లో కొప్పిశెట్టి వెంకట్రావు 5కే పరుగులో కాంస్య, మొల్లేటి వీర వెంకట సత్యనారాయణ 4 x400 రిలే పరుగులో రజత, 100 మీటర్ల హర్డిల్స్‌లో కాంస్య పతకాన్ని, 30 ప్లస్‌లో రెడ్డి నరేంద్రకుమార్ (అమలాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ కుమారుడు) 5కే పరుగులో కాంస్య, 1500 మీటర్ల పరుగులో రజత పతకాలను సాధించారు. ఈ మాస్టర్స్ అథ్లెటిక్స్ అమలాపురంలోని కుడుపూడి గోపాలకృష్ణ గోఖలే ఐపీఎస్ మెమోరియల్ జిమ్‌లో క్రీడాకారులు. జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన ఈ క్రీడాకారులు అంతర్జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్‌కు ఎంపికయ్యారు. వీరు వచ్చే మార్చిలో థాయ్‌లాండ్‌లో జరిగే వరల్డ్ చాంపియన్ షిప్‌లో దేశం తరఫున ఆడనున్నారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో మాస్టర్స్ క్రీడాకారులు గంగరాజు, వెంకట్రావు, వీర వెంకట సత్యనారాయణ, నరేంద్రకుమార్‌లను ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, జిమ్ క్రీడాకారులు, వాకర్స్ సత్కరించారు. వీరు వరల్డ్ చాంపియన్ షిప్ పోటీల్లో కూడా విజేతలు కావాలని ఎమ్మెల్సీ ఆకాంక్షించారు. ఫిజికల్ డైరెక్టర్ ఎ.ఉమామహేశ్వరరావు, జాతీయ క్రీడాకారుడు ఎన్.అప్పలరాజు, జిమ్ క్రీడాకారులు, వాకర్స్ క్లబ్ ప్రతినిధులు కుడుపూడి త్రినాథ్, చప్పిడి శోభన్‌బాబు, కట్టా చిన్న, దొంగ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


