భోజనానికి పాట్లు | - | Sakshi
Sakshi News home page

భోజనానికి పాట్లు

Feb 21 2026 7:30 AM | Updated on Feb 21 2026 7:30 AM

భోజనా

భోజనానికి పాట్లు

ఆత్రేయపురం: మది నిండా భక్తిని నింపుకొని.. ఎక్కడెక్కడి నుంచో చేరుకుని.. కాలినడకన ఆ స్వామిని దర్శించుకుని.. చివరిగా ఆ స్వామివారి ప్రసాదం కోసం క్యూలో నిలుచుని.. ఎండ మండుతున్న వేళ షెడ్లలో ప్రసాదాన్ని పిల్లాపాపలతో స్వీకరించేందుకు భక్తులకు అవస్థలు తప్పడం లేదు. ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధి చెందిన, ఆదాయ పరంగా ముందున్న కోనసీమ తిరుమల, ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వరుని దేవస్థానం వద్ద పరిస్థితి ఇది. ఏడు వారాల స్వామిగా పేరొందిన ఆ వేంకటేశ్వరుని దర్శనానికి వారంలో అన్ని రోజులూ భక్తులు వస్తుంటారు. ఇక శనివారం వచ్చిందంటే, ఇసుకేస్తే రాలనంత మందితో రద్దీ నెలకొంటుంది. ప్రధానంగా ఉభయ తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా తదితర ప్రాంతాల నుంచి శనివారం ఇక్కడకు లక్షల్లో భక్తులు వస్తుంటారు. క్యూలో నిలబడి గంటల తరబడి వేచి ఉండి ఎంతో భక్తితో స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం అన్న ప్రసాదం కోసం మళ్లీ క్యూలో ఉండి తాత్కాలిక షెడ్డులో భోజనం చేయడం భక్తులకు ఇబ్బందిగా మారింది.

ఉడికిపోతున్న భక్తులు

కుటుంబ సమేతంగా వస్తున్న భక్తులు కిక్కిరిసిన లైనులో అన్న ప్రసాద స్థలం వద్దకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. ఒకపక్క కాలికి చెప్పులు లేకుండా, మరోపక్క షెడ్డు నీడన ఉక్కబోతలో ఆ ప్రసాదం స్వీకరించే సమయంలో పలువురు నానా అగచాట్లూ పడుతున్నారు. కనీసం పిల్లలు, వృద్ధులు కూర్చునేందుకు ఎలాంటి ఏర్పాట్లు ఉండడం లేదు. అన్న ప్రసాదం వేడిగా వడ్డించడం మహత్తర కార్యం, అయితే చేతిలో వేడిగా ప్రసాదం, మరోపక్క కాలి కింద వేడి, షెడ్డులో పైనుంచి వేడితో భక్తులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయినా ఒకపక్క ఉక్కబోత, మరోపక్క నిల్చుని ప్రసాదం కోసం తపన పడుతున్న వారెందరో. ప్రతి శనివారం సుమారు 30 వేల మందికి పైగా అన్న ప్రసాదం స్వీకరిస్తున్నారు. మిగిలిన రోజుల్లో 10 వేలకు పైగా ఉంటారని అంచనా. వీరికి అన్నప్రసాదం పెట్టేందుకు కనీస సౌకర్యాలు లేకపోవడం శోచనీయం. అయినవిల్లి విఘ్నేశ్వరుని సన్నిధి, అప్పనపల్లి బాలబాలాజీ స్వామివారి దేవస్థానంలో అన్న ప్రసాద వితరణకు టేబుల్స్‌ ఏర్పాటు చేసి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు.

వకుళమాత భవనం పూర్తయ్యేనా!

వాడపల్లి వెంకన్న ఆలయంలో తొలినాళ్లలో అన్నదాన పథకాన్ని రూ.200 నిధితో ప్రారంభించారు. అది కాస్త ఇప్పుడు రూ.కోట్లకు చేరింది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో భక్తుల ఇబ్బందులు గమనించి 2023లో అన్నదాన భవన (వకుళమాత భవనం) నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సుమారు రెండెకరాల విస్తీర్ణంలో సుమారు రూ.6.25 కోట్లతో పనులు ప్రారంభించారు. అక్కడ ఒకేసారి సుమారు 50 వేల మంది భక్తులు కూర్చుని ప్రసాదం స్వీకరించేలా కార్యాచరణ చేశారు. ఈ భవనం నిర్మాణానికి ఇప్పటికే దాతలు రూ.15కోట్లకు పైగా విరాళాలు సమర్పించారు. ఇంకా అందిస్తున్నారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఈ భవన పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిధులు వెల్లువలా వస్తున్నా, పనులు మాత్రం వేగం పుంజుకోవడం లేదు. దీనివల్ల భక్తులకు అవస్థలు తప్పడం లేదు. పనులు సకాలంలో జరగక దాతల ఆశయమూ నెరవేరడం లేదు. తాత్కాలిక షెడ్డులోనే ప్రతి శనివారం సుమారు 30 వేల మందికి పైగా భక్తులు భోజనాలు చేయడానికి నానా యాతన పడుతున్నారు.

ఫ వాడపల్లిలో అన్నప్రసాదం

స్వీకరించాలంటే అవస్థలే

ఫ ఆదాయం ఘనం..

వసతుల కల్పనలో విఫలం

ఫ శనివారం పరిస్థితి మరీ దయనీయం

పనుల వేగవంతానికి కృషి

వాడపల్లి దేవస్థానంలో వకుళమాత అన్నదాన భవనం నిర్మాణ పనులు వేగవంతం చేయడానికి ఇంజినీరింగ్‌ శాఖ అధికారులతో కృషి చేస్తున్నాం. ఆ పనులు పూర్తిగా ఇంజినీరింగ్‌ విభాగం చూసుకుంటోంది. భక్తుల అన్నదానానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం.

– నల్లం సూర్యచక్రధరరావు, ఈఓ, దేవదాయ శాఖ ఉప కమిషనర్‌

ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం

అన్న ప్రసాదం స్వీకరించేందుకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. కింద మట్టి ఉండడంతో బురదగా మారుతోంది. పిల్లలతో వచ్చి నిలుచుని భోజనం చేయడం కష్టంగా ఉంటోంది. ఎక్కడెక్కడి నుంచో లక్షల్లో భక్తులు వస్తున్నా కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడం శోచనీయం. బయట భోజనాలు చేద్దామంటే హోటళ్లు ఉండడం లేదు.

– ఎన్‌.వెంకటేశ్వరరావు, రాజమహేంద్రవరం

భోజనానికి పాట్లు1
1/4

భోజనానికి పాట్లు

భోజనానికి పాట్లు2
2/4

భోజనానికి పాట్లు

భోజనానికి పాట్లు3
3/4

భోజనానికి పాట్లు

భోజనానికి పాట్లు4
4/4

భోజనానికి పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement