అరటి.. అధరహో
లారీపై అరటి గెలలను ఎగుమతి చేస్తున్న కూలీలు
● దండిగా పెరిగిన అరటి ధర
● గతంలో 10 టన్నులు రూ.60 వేల
నుంచి రూ.90 వేలు
● నేడు రూ.1.70 లక్షలకు చేరిక
● ఇతర రాష్ట్రాల్లో తగ్గిన ఉత్పత్తి
● మన అరటికి ఒక్కసారిగా డిమాండు
● ఫలితంగా దాదాపు రెట్టింపైన రేటు
పెరవలి: ప్రభుత్వం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా.. మార్కెట్ పరిస్థితులు అనుకూలించడంతో అరటి ధరల ఒక్కసారిగా భారీగా పెరిగాయి. దీంతో, నష్టాల ఊబి నుంచి బయట పడే పరిస్థితులు నెలకొంటున్నాయని అరటి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది మోంథా తదితర తుపాన్ల ధాటికి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో అరటి తోటలకు భారీగా నష్టం వాటిల్లింది. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం నుంచి నయాపైసా పరిహారం అందలేదు. అదే సమయంలో మరోవైపు మార్కెట్లో ధరల గణనీయంగా పతనమవడంతో అరటి రైతులు విలవిలలాడిపోయారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అరటి ధరలు పతనమైనప్పుడు.. రైతుల నుంచి అరటిని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి, దేశంలోని ఇతర ప్రాంతాల్లోని మార్కెట్లకు ముఖ్యంగా ఢిల్లీ వంటి చోట్లకు ప్రత్యేక రైళ్లలో ఎగుమతులు చేశారు. తద్వారా రైతులను ఆదుకున్నారు. చంద్రబాబు సర్కారు హయాంలో ధరలు పడిపోయినప్పటికీ ఆదుకున్న దాఖలాలే లేవు. ఫలితంగా రైతులు ఏడాది కాలంగా తీవ్ర నష్టాలు చవి చూశారు.
ఇతర రాష్ట్రాల డిమాండుతో..
ఇటువంటి పరిస్థితుల్లో కొన్నాళ్లుగా దేశంలోని ఇతర రాష్ట్రాల్లో అరటి దిగుబడి గణనీయంగా పడిపోయింది. ముఖ్యంగా తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ తదితర రాష్ట్రాల్లో తుపాన్ల ప్రభావంతో అరటి తోటలు దెబ్బ తిని, దిగుబడి లేకుండా పోయింది. ఇది కాస్తా మన రైతులకు కలసి వచ్చి, నెల రోజులుగా ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం జిల్లా నుంచి ఆయా రాష్ట్రాలకు ప్రతి రోజూ 60 లారీల వరకూ అరటి ఎగుమతులు జరుగుతున్నాయి. ఫలితంగా డిమాండ్ రావటంతో అరటి ధరలు ఒక్కసారిగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో, అరటి రైతుకు కాస్త ఊరట లభించింది. జిల్లాలో అన్ని రకాలు కలిపి 7,500 హెక్టార్లలో సుమారు 8 వేల మంది రైతులు అరటి సాగు చేస్తున్నారు. ముఖ్యంగా పెరవలి, నిడదవోలు, ఉండ్రాజవరం, నల్లజర్ల, చాగల్లు, కొవ్వూరు, దేవరపల్లి, గోపాలపురం, తాళ్లపూడి, సీతానగరం, రాజానగరం, అనపర్తి మండలాల్లో అరటి సాగు అధికంగా ఉంది. ప్రస్తుతం 4 వేల హెక్టార్లలో తోటల నుంచి దిగుబడి వస్తోంది. కానీ, ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు పెరగటంతో గెల ఏమాత్రం పక్వానికి వచ్చినా రైతులు వెంటనే వాటిని కోసి, మార్కెట్‌కు తరలిస్తున్నారు.
ధరలు పెరిగాయిలా..
మార్కెట్లో అరటి ధరలు గత ఏడాది జూన్ నుంచి పతనమవుతూ వచ్చాయి. నిన్న మొన్నటి వరకూ 10 టన్నుల లారీ కర్పూర రకం అరటికి రూ.60 వేల నుంచి రూ.90 వేల వరకూ మాత్రమే ధర పలికేది. అటువంటిది ఇప్పుడు డిమాండ్ పెరగడంతో ఆ ధర ఏకంగా రూ.1.70 లక్షలకు పెరిగింది. దీంతో, రైతులు గత నష్టాలు పూడ్చుకునే పరిస్థితి వచ్చిందని రైతులు ఆనందిస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ వ్యాపారులు తోటల వైపు తొంగి చూసేవారే కాదు. అటువంటిది ఇప్పుడు డిమాండు పెరగడంతో వారు నేరుగా తోటల వద్దకు వచ్చి, రైతులకు అడ్వాన్సులు ఇచ్చి మరీ కొనుగోలు చేస్తున్నారు. చక్కెరకేళీ గెల రూ.300, ఎర్ర చక్కెరకేళీ గెల రూ.500కు కొనుగోలు చేస్తున్నారు. సైకిల్ లోడ్ (6 గెలలు) కర్పూర రకం అయితే నాణ్యతను బట్టి రూ.1,500 నుంచి రూ.1,800, చక్కెరకేళీ రూ.2 వేల నుంచి రూ.2,400, ఎర్ర చక్కెరకేళీ రూ.2,500 నుంచి రూ.3 వేల వరకూ పలుకుతున్నాయి.
కూలీలకు ఖుషీ
జిల్లాలో అరటి తోటలను నమ్ముకుని కూలీలు, వెదురు వేసేవారు, గెలలకు ఆకులు చుట్టేవారు, గెలలు కోసే కూలీలు, వ్యాపారులు సుమారు 30 వేల మంది ఉన్నారు. గతంలో ధరలు లేక వీరందరూ సరైన ఉపాధి లభించక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ధరలు పెరగటంతో రోజుకు రూ.500 నుంచి రూ.1,500 వరకూ వస్తోందని కూలీలు చెబుతున్నారు.
లారీలో అరటి గెలల ఎగుమతి
నష్టాలు పూడ్చుకోగలమని ఆశ
ఏడాది కాలంగా అరటి ధరలు పతనమవడంతో తీవ్ర నష్టాలు ఎదుర్కొన్నాం. ఇప్పుడు మార్కెట్లో ధర పెరగడంతో గత నష్టాలు పూడ్చుకునే పరిస్థితి ఏర్పడింది. తుపాను సమయంలో ప్రభుత్వం ఎటువంటి సహాయమూ చేయలేదు.
– యాతం మల్లికార్జునరావు,
అరటి రైతు, అన్నవరప్పాడు
అడ్వాన్సులు ఇచ్చి మరీ..
నిన్న మొన్నటి వరకూ తోటలు కొనేవారే లేరు. అటువంటిది నేడు వ్యాపారులే నేరుగా తోటల వద్దకు వచ్చి అడ్వాన్సులు ఇచ్చి మరీ కొనుగోలు చేస్తున్నారు. నిన్నటి వరకూ కర్పూర రకం గెల రూ.60కి కొన్నవారు నేడు రూ.150కి కొనుగోలు చేస్తున్నారు.
– కాపకా పాపారావు, అరటి రైతు, కాకరపర్రు
గత నెల నుంచి
పెరుగుదల
గత డిసెంబర్ నుంచి అరటి ధరలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ధరలు బాగానే ఉన్నాయి. వ్యాపారులు తోటలు కొనుగోలు చేస్తున్నారు.
– సంఖు ప్రభాకరరావు,
అరటి రైతు, మల్లేశ్వరం
అరటి.. అధరహో
అరటి.. అధరహో
అరటి.. అధరహో
అరటి.. అధరహో
అరటి.. అధరహో
అరటి.. అధరహో


