సంగీతం కోర్సులకు మే నెలలో వార్షిక పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

సంగీతం కోర్సులకు మే నెలలో వార్షిక పరీక్షలు

Jan 31 2026 6:45 AM | Updated on Jan 31 2026 6:45 AM

సంగీత

సంగీతం కోర్సులకు మే నెలలో వార్షిక పరీక్షలు

రాజమహేంద్రవరం రూరల్‌: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యాన సంగీతం కోర్సులకు మే 21, 22 తేదీల్లో వార్షిక పరీక్షలు జరుగుతాయని వైస్‌ చాన్సలర్‌ ఆచార్య మునిరత్నం నాయుడు వెల్లడించారు. జూలైలో ఫలితాలు వెల్లడిస్తామన్నారు. కళాశాలల్లో చదివే రెగ్యులర్‌ విద్యార్థులు రూ.1,000, ప్రైవేటు విద్యార్థులు రూ.3 వేల చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఫిబ్రవరి 2 నుంచి 28వ తేదీ వరకూ ఎలాంటి అపరాధ రుసుం లేకుండా, మార్చి 1 నుంచి 10వ తేదీ వరకూ రూ.200 అపరాధ రుసుంతో ఫీజు చెల్లించవచ్చని వివరించారు. ఏపీ సంగీత శాఖ ఆధీనంలోని రాజమహేంద్రవరం, విజయనగరం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు ప్రభుత్వ సంగీత కళాశాలలను రాజమహేంద్రవరంలోని తెలుగు యూనివర్సిటీ పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. తమ ఆధీనంలోని కూచిపూడితో కలిపితే యూనివర్సిటీ ఆధీనంలోకి ఏడు కళాశాలలు వచ్చినట్లవుతుందన్నారు. టీటీడీ ఆధీనంలోని కళాశాల కూడా తెలుగు విశ్వవిద్యాలయం పరిధిలోకి వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందని మునిరత్నం నాయుడు వెల్లడించారు.

రెవెన్యూ సేవల్లో

సంతృప్తి పెంచాలి

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): రెవెన్యూ సేవల్లో ప్రజలు సంతృప్తిని పెంచడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ మేఘస్వరూప్‌ అన్నారు. కలెక్టరేట్‌ నుంచి వెబినార్‌ ద్వారా ఆర్‌ఓఆర్‌, రీ సర్వే, పీజీఆర్‌ఎస్‌పై అధికారులతో శుక్రవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రెవెన్యూ సంబంధిత అంశాల్లో దరఖాస్తుదారులకు సహేతుకమైన, సమయోచిత పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. ముఖ్యంగా మ్యుటేషన్‌ దరఖాస్తులను నిర్దేశిత కాలపరిమితిలో పరిష్కరించాలన్నారు. పీజీఆర్‌ఎస్‌ అర్జీల పరిష్కారంలో సంబంధిత అధికారులు వ్యక్తిగత బాధ్యత వహించాలని సూచించారు. రీ సర్వే సహాయ సంచాలకుడు బి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, జిల్లాలోని 10 మండలాల్లోని 10 వేల ఎకరాల్లో రీ సర్వే జరుగుతోందని తెలిపారు. ప్రతి బృందం రోజుకు 25 ఎకరాలు రీ సర్వే చేయాలన్నది లక్ష్యమన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి టి.సీతారామమూర్తి, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కె.భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎకై ్సజ్‌ ఎస్సైగా శ్రీకాంత్‌ ఎంపిక

ప్రకాశం నగర్‌ (రాజమహేంద్రవరం): రంజీ ట్రోఫీ క్రికెటర్‌గా ఆంధ్రప్రదేశ్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన కొరిపల్లి శ్రీకాంత్‌ ఏపీ గ్రూప్‌–2 పరీక్షల్లో ప్రతిభ చూపి, ప్రొహిబిషన్‌, ఎకై ్సజ్‌ ఎస్సైగా ఎంపికయ్యారు. స్థానిక ఉల్లితోటకు చెందిన ఆయన హైదరాబాద్‌లో బీటెక్‌ (సివిల్‌), చైన్నె ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో ఎంబీఏ (మార్కెటింగ్‌ – ఫైనాన్స్‌) పూర్తి చేశారు. రంజీ ట్రోఫీ, విజయ్‌ హజారే ట్రోఫీ, సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీల్లో ఆడారు. రాష్ట్ర స్థాయి జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు. 2018లో క్రికెట్‌కు పూర్తి స్థాయి విరామం ఇచ్చి, పోటీ పరీక్షలపై దృష్టి సారించారు. సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌ ఒకసారి, ఏపీ గ్రూప్‌–1 మెయిన్స్‌ రెండుసార్లు, తెలంగాణ గ్రూప్‌–1 మెయిన్స్‌ ఒకసారి ఉత్తీర్ణులయ్యారు. ప్రస్తుతం ఎకై ్సజ్‌ ఎస్సైగా ఎంపికయ్యారు.

విష సర్పాల కలకలం

ప్రత్తిపాడు: స్థానిక కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ ఎదుట వీధిలోని ఖాళీ స్థలంలో రెండు పాములు కలకలం రేపాయి. ముత్యాల రాంబాబుకు చెందిన స్థలం ఇరవై ఏళ్లుగా ఖాళీగా ఉండడంతో పిచ్చి మొక్కలు పెరిగి విష సర్పాలకు ఆవాసంగా మారింది. తొలుత 15 అడుగుల రక్తపింజరి మొక్కల నడుమ తిరుగాడుతూ కనిపించింది. తరువాత మరో చిన్న పాము రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. దీంతో స్థానికులే జేసీబీతో ఖాళీ స్థలంలో మొక్కలు తొలగించి చిన్న పామును చంపేశారు. పెద్దపాము సమీప పొలాల్లోకి వెళ్లిపోయింది.

సంగీతం కోర్సులకు మే నెలలో వార్షిక పరీక్షలు 1
1/2

సంగీతం కోర్సులకు మే నెలలో వార్షిక పరీక్షలు

సంగీతం కోర్సులకు మే నెలలో వార్షిక పరీక్షలు 2
2/2

సంగీతం కోర్సులకు మే నెలలో వార్షిక పరీక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement