రీచ్‌ల నిర్వాహకుల మధ్య ముదిరిన వివాదం | - | Sakshi
Sakshi News home page

రీచ్‌ల నిర్వాహకుల మధ్య ముదిరిన వివాదం

Jan 31 2026 6:45 AM | Updated on Jan 31 2026 6:45 AM

రీచ్‌ల నిర్వాహకుల మధ్య ముదిరిన వివాదం

రీచ్‌ల నిర్వాహకుల మధ్య ముదిరిన వివాదం

ర్యాంపులోకి లారీలు వెళ్లకుండా అడ్డగింపు

నిలిచిన ఇసుక ఎగుమతులు

పరస్పరం కేసులు

సీతానగరం: రీచ్‌ల నిర్వాహకుల మధ్య కొద్ది రోజులుగా జరుగుతున్న వివాదం ముదరడంతో ఇసుక ఎగుమతులు నిలిచిపోయాయి. దీనికి సంబంధించిన వివరాలివీ.. తాళ్లపూడి మండలం ప్రక్కిలంక రెవెన్యూ లంక భూముల్లో ఇసుక రీచ్‌లను ఐదుగురు దక్కించుకున్నారు. వీరి మధ్య బాటల్లో రాకపోకలపై వివాదం రాజుకుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 25న రీచ్‌లో బ్లాక్‌–4 నిర్వాహకుడైన వడ్డీ శ్రీనివాసరావు బాటకు అడ్డంగా గాడి తవ్వి, ఇసుక మేటలు అడ్డం పెట్టారు. దీంతో బ్లాక్‌–1 నిర్వాహకుడైన బర్ల బాబూరావు ర్యాంపులోకి లారీలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో, ర్యాంపులోకి లారీలు వెళ్లకుండా బాబూరావు తన కారును అడ్డంగా పెట్టారు. ఈ నేపథ్యంలో అదే రోజు రాత్రి తాను ఇంటికి వెళ్తూండగా.. రఘుదేవపురం పుంత సమీపంలోని శ్మశాన వాటిక వద్ద బండారు రమేష్‌ నాయుడు, బాబు చౌదరి, గోగినేని నితిన్‌ చౌదరి, వడ్డీ శ్రీనివాస చౌదరి, కాండ్రు విశ్వనాథ్‌ చౌదరి, చిట్టూరి రాము చౌదరి, చిట్టూరి సాయి చౌదరిలు కారు అడ్డంగా పెట్టి, తనను అసభ్య పదజాలంతో దూషించారని, మారణాయుధాలు పట్టుకుని చంపుతామంటూ బెది రించారని బాబూరావు ఈ నెల 28న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా అదే రోజు రాత్రి బ్లాక్‌–4 రీచ్‌ నిర్వాహకుడు వడ్డీ శ్రీనివాసరావు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 25వ తేదీ ఉదయం 11 గంటలకు లారీలు వెళ్లకుండా బాబూరావు కారు అడ్డంగా పెట్టారని, దానిని అడ్డం తీయాలని తనతో పాటు సత్యం బాలాజీ, గోగినేని నితిన్‌ చౌదరి, ఖండవల్లి శోభనబాబు వెళ్లి అడిగామన్నారు. దీంతో, కారు అడ్డం తీసేది లేదని, తనకు రాజకీయ పలుకుబడి ఉందని, తమ అంతు చూస్తానని, చంపుతానని బాబూరావు బెదిరించాడని వారు ఫిర్యాదు చేశారు. దీనిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇసుక కోసం ర్యాంపు వద్దకు చేరుకున్న లారీలు ఈ వివాదం నేపథ్యంలో పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. ఎస్సై డి.రామ్‌ కు మార్‌ ఆయా ర్యాంపుల నిర్వాహకులతో చర్చలు జరి పారు. ఇరు వర్గాల వారు సర్వే చేయించుకున్న అనంతరం బాటలు వేసుకోవాలని సూచించారు. దీంతో, లారీలు యథావిధిగా ర్యాంపులోకి తరలివెళ్లాయి. తాళ్ల పూడి తహసీల్దార్‌, సర్వేయర్‌, ఆర్‌ఐలు గురువారం సాయంత్రం భూములను పరిశీలించారు. సరిహద్దులు నిర్ధారించకుండానే వెను తిరిగారు. సర్వే పూర్తయ్యేంత వరకూ లారీలు వెళ్లకుండా పొక్లెయిన్‌ అడ్డంగా పెట్టి, బాబూరావు శుక్రవారం ఆ దారిని బంద్‌ చేశారు. దీంతో ఇసుక ఎగుమతులు నిలిచిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement