అసంఘటిత కార్మికులకు జీవితాంతం పెన్షన్
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): అసంఘటిత రంగ కార్మికులు, చిన్న వ్యాపారులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత, స్థిర ఆదాయం, కుటుంబ రక్షణ, గౌరవప్రదమైన జీవితం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రెండు జాతీయ పెన్షన్ పథకాలను అమలు చేస్తోందని కార్మిక శాఖ జిల్లా ఉప కమిషనర్ బీఎస్‌ఎం వలీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్, ప్రధాన్ మంత్రి లఘు వ్యాపారి మాన్‌ధన్ అనే ఈ రెండు పథకాల కింద అర్హులైన వారికి 60 సంవత్సరాలు నిండిన తర్వాత జీవితాంతం ప్రతి నెలా రూ.3 వేల ప్రభుత్వ హామీతో కూడిన పెన్షన్ అందిస్తారన్నారు. అసంఘటిత రంగ కార్మికులు, వీధి వ్యాపారులు, రిక్షా, భవన నిర్మాణ, వ్యవసాయ, బీడీ, ఇటుక బట్టీ, హ్యాండ్లూమ్, గృహ కార్మికులు, చేతివృత్తిదారులు తదితర అసంఘటిత రంగంలోని వారు ఈ పథకానికి అర్హులని వివరించారు. 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు, నెలవారీ ఆదాయం రూ.15 వేల లోపు ఉండాలన్నారు. వయస్సును బట్టి నెలకు రూ.55 నుంచి రూ.200 వరకూ లబ్ధిదారు చెల్లించే చందాకు సమానంగా కేంద్ర ప్రభుత్వం కూడా చెల్లిస్తుందన్నారు. లబ్ధిదారు మరణించిన పక్షంలో భార్య లేదా భర్తకు నెలకు రూ.1,500 కుటుంబ పెన్షన్ అందిస్తారని తెలిపారు. భార్యాభర్తలిద్దరూ అర్హులైతే నెలకు రూ.6 వేల ద్వంద్వ పెన్షన్ పొందే అవకాశం ఉందన్నారు. చిన్న దుకాణదారులు, చిల్లర వ్యాపారులు, హోటల్ యజమానులు, మిల్లుల యజమానులు, వర్క్‌షాప్ యజమానులు, కమిషన్ ఏజెంట్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, స్వయం ఉపాధిదారులు ఈ పథకానికి అర్హులన్నారు. 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు, వార్షిక టర్నోవర్ రూ.1.5 కోట్లలోపు ఉండాలన్నారు. ఆదాయపు పన్ను చెల్లించని వారు దీనికి అర్హులని తెలిపారు. ఈ పథకంలో కూడా నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు మాత్రమే చందా చెల్లించాల్సి ఉంటుందని, సమాన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుందని పేర్కొన్నారు. అర్హులైన వారు సమీపంలోని కార్మిక శాఖ కార్యాలయం, మీ–సేవా కేంద్రంలో ఆధార్ ఆధారితంగా సులభంగా నమోదు చేసుకోవచ్చని వలీ తెలిపారు.


