మహిళ గొంతు కోసి..
ఆపై హత్యకు యత్నించిన నిందితుడు
కాకినాడ క్రైం: కాకినాడలో ఓ మహిళపై హత్యాయత్నం జరిగింది.. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక సూర్యనారాయణపురం పొట్టి శ్రీరాములు విగ్రహం సెంటర్‌లో నివాసం ఉంటున్న ఆకుల అన్నపూర్ణ (32) ఇంట్లోనే బ్యూటీపార్లర్ నడుపుతూ జీవనం కొనసాగిస్తుంది. తన భర్త సతీష్‌తో నాలుగేళ్ల కిందట విడిపోయి ఎనిమిదేళ్ల కుమారుడు లోకేష్‌తో కలసి ఉంటుంది. కొన్నాళ్ల క్రితం ఆమె సోదరుడు వీరసాయి స్నేహితుడు అయిన ముచ్చినపల్లి మణికంఠతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం నేపథ్యంలో అన్నపూర్ణకు పలు పనుల్లో సహాయం చేస్తూ ఉండేవాడు. వారిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు కొనసాగి, అన్నపూర్ణ మణికంఠకు డబ్బులు ఇచ్చింది. హోటల్‌లో పనిచేస్తూ సంపాదన అంతంత మాత్రంగా ఉన్న మణికంఠ ఆమెకు సకాలంలో డబ్బులు ఇవ్వలేకపోయాడు. దీంతో తరచూ వీరివురి మధ్య గొడవలు జరుగుతుండేవి. శనివారం సాయంత్రం మణికంఠ ఎప్పటిలాగే అన్నపూర్ణ ఇంటికి వెళ్లాడు. అన్నపూర్ణ తాను ఈఎంఐలు కట్టాల్సి ఉందని, నువ్వు డబ్బులు ఇవ్వకపోతే తనకు చావే శరణ్యమని అంది. దీంతో కోపోద్రిక్తుడైన మణికంఠ నువ్వు చావడం ఎందుకు, నేనే చంపుతానంటూ ఇంట్లో ఉన్న చాకు తీసుకొని అన్నపూర్ణ పీకకోశాడు. తప్పించుకునేందుకు యత్నించిన ఆమె చేయి, పొట్టపై తీవ్రంగా పొడిచాడు. ఇంట్లో నుంచి అతికష్టం మీద బయటకు వచ్చి రక్తపు మడుగులో ఉన్న క్షతగాత్రురాలు ఆరుబయట కూర్చొని తనను రక్షించాలంటూ దారిన పోయే వారిని అర్థించింది. స్థానికులు గమనించి ఇంటి తలుపులు తెరిచి చూడగా ఇంట్లో మణికంఠ తన మెడ కోసుకొని ఆత్మహత్యకు యత్నించడాన్ని గమనించారు. వీరిద్దరినీ స్థానికులు కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. మణికంఠకు స్వల్ప గాయాలవ్వగా ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. అన్నపూర్ణ పరిస్థితి విషమంగా ఉందని ఆమె మెడను బలంగా కోయడం వల్ల అన్నవాహిక పూర్తిగా తెగిపోయిందని వైద్యులు తెలిపారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఆదివారం రాత్రి హైదరాబాద్‌కు తరలించారు. కాకినాడ త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేయగా, ఘటనా స్థలాన్ని సీఐ సత్యనారాయణ పరిశీలించారు.
మహిళ గొంతు కోసి..


