కాలువలోకి దూసుకెళ్లిన వ్యాన్
అంబాజీపేట: కె.పెదపూడి మలుపు వద్ద ఆదివారం తెల్లవారు జామున ఓ వ్యాన్ పంట కాలువలోకి దూసుకెళ్లింది. రాజమహేంద్రవరం నుంచి అమలాపురం వెళుతున్న ఈ వ్యాన్ అదుపుతప్పి నేరుగా పంట కాలువలోకి వెళ్లిపోయిందని స్థానికులు తెలిపారు. ఈ వ్యాన్‌లో డ్రైవర్ తప్ప ఎవరూ లేకపోవడం, అతను కూడా స్వల్ప గాయాలతో బయట పడడంతో పెను ప్రమాదం తప్పింది. వ్యాన్‌ను క్రేన్ సాయంతో బయటకు తీశారు. దీనిపై పోలీసులు ఎటువంటి కేసు నమోదు చేయలేదు.
నేటి నుంచి జాతీయ స్థాయి ప్రో–కార్ట్ రేసింగ్
గండేపల్లి: సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీలో సోమవారం నుంచి జాతీయ స్థాయి ప్రో–కార్ట్ రేసింగ్ సీజన్–6 (ఎండ్యూరెన్స్ చాంపియన్ షిప్–2026) పోటీలు నిర్వహించనున్నట్టు ప్రో చాన్సిలర్ ఎన్.సతీష్‌రెడ్డి తెలిపారు. నాలుగు రోజుల పాటు జరుగనున్న ఈ కార్యక్రమానికి తగిన ఏర్పాట్లు చేశామన్నారు. వెహికల్ డిజైన్, పిక్–అప్, బ్రేక్, లోడ్, స్పీడ్ తదితర విభాగాలు పరీక్షించి విజేతలను పాయింట్ల ప్రకారం ఎంపిక చేస్తామని అన్నారు. విజేతలను జ్ఞాపిక, ప్రశంసాపత్రం, నగదు పురస్కారాలతో సత్కరిస్తామన్నారు.
అమలాపురంలో జ్యూస్ షాపు దగ్ధం
అమలాపురం టౌన్: స్థానిక హైస్కూల్ సెంటర్‌లోని శ్రీనివాస లస్సీ అండ్ ఫ్రూట్స్, జ్యూస్ షాపు శనివారం అర్ధరాత్రి సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైంది. అమలాపురం అగ్నిమాపక దళ సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలను ఆర్పారు. అప్పటికే షాపులోని ఫ్రిజ్‌లు, ఇతర సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. మట్టపర్తి శ్రీనివాస్‌కి చెందిన ఈ షాపు ప్రమాదంలో కాలిపోయింది. ప్రమాదంలో రూ.2.50 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు అగ్నిమాపక దళాధికారి ఎం.రాజా తెలిపారు.


