పర్యావరణ అంచనాకు పక్షుల గణన
తాళ్లరేవు: పర్యావరణంలో నెలకొన్న పరిస్థితులను అంచనా వేసేందుకు పక్షుల గణన దోహదపడుతుందని, అందువల్లే ఏటా ఈ కార్యక్రమం చేపడుతున్నామని జిల్లా అటవీశాఖ అధికారి ఎన్.రామచంద్రరావు తెలిపారు. ఆదివారం కోరంగి బయోడైవర్సటీ సెంటర్‌లో ఫారెస్ట్ రేంజర్ ఎస్‌ఎస్‌ఆర్ వరప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన ఏషియన్ వాటర్ బర్డ్ సెన్సెస్ – 2026 వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. మడ అటవీ ప్రాంతంలో సంచరించే వివిధ రకాల పక్షులు, దూర ప్రాంతాల నుంచి వలస వచ్చే పక్షులను లెక్కించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. దీనికి సంబంధించి తమ సిబ్బందితో పాటు ఒక వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్, ఒక సైంటిస్ట్, ఒక స్టూడెంట్‌తో కలిపి నలుగురు సభ్యులతో కూడిన 12 బృందాలను సిద్ధం చేశామన్నారు. సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ప్రత్యేక కెమెరాలతో అభయారణ్యంలో గుర్తించిన 12 ప్రాంతాల్లో పక్షుల గణన చేపట్టనున్నట్లు తెలిపారు. బీఎన్‌హెచ్‌ఎస్ డిప్యూటీ డైరెక్టర్ పి.సత్య శెల్వం తదితరులు పక్షులను ఎలా గుర్తించాలి, గణన ఎలా చేపట్టాలన్న అంశాలను వివరించారు. పక్షుల గణన ప్రాముఖ్యతను ఐబీసీఎన్ స్టేట్ కోఆర్డినేటర్ మృత్యుంజయరావు తెలిపారు. ఈ అభయారణ్యంలో 11 ఏళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అమలాపురం ఫారెస్ట్ రేంజర్ జి.ఈశ్వరరావు, ఎఫ్‌ఎస్‌ఓలు, అటవీ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.


