పంట కాలువలో పడి వృద్ధుడి మృతి
పి.గన్నవరం: ప్రధాన పంట కాలువలో ప్లాస్టిక్ బాటిళ్లు ఏరుకుంటూ ప్రమాదవశాత్తూ నీట మునిగి ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటన జి.పెదపూడిలో జరిగింది. ఎస్సై బి.శివకృష్ణ కథనం ప్రకారం.. అదే గ్రామానికి చెందిన కాండ్రేగుల రామకృష్ణ (61) ఇంటింటికీ తిరిగి పాత ఇనుము కొనుగోలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం జి.పెదపూడి వంతెన వద్ద అడ్డుపడిన ప్లాస్టిక్ బాటిళ్లను తీసుకుంటూ ప్రమాదవశాత్తూ కాలు జారి పంట కాలువలో మునిగిపోయాడు. సాయంత్రానికి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించగా, పంట కాలువ వద్ద అతడి సైకిల్ కనిపించింది. దీంతో కాలువలో పడిపోయినట్టు నిర్ధారించుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై ఆధ్వర్యంలో కాలువలో గాలించగా ఆదివారం రామకృష్ణ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు సుబ్రహ్మణ్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వివరించారు.


