భీమేశ్వరాలయంలో మరో అపచారం
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
రామచంద్రపురం రూరల్: ద్రాక్షారామ భీమేశ్వరస్వామి ఆలయంలో పురాతన కపాలేశ్వరస్వామి శివలింగాన్ని ముక్కోటి ఏకాదశి నాడు ధ్వంసం చేస్తే.. అధికారులు, స్థానిక నాయకులు తొందరపాటులో మరో ఘోర అపచారానికి పాల్పడ్డారని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గత డిసెంబర్ 30వ తేదీ రాత్రి ఓ దుండగుడు కపాలేశ్వరస్వామి శివలింగాన్ని సుత్తితో ధ్వంసం చేశాడని పోలీసులు చెప్పారన్నారు. ఉదయం 6.30 గంటలకు స్థానిక అయ్యప్ప భక్తులు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి తీసుకురాగా.. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి సత్యం.. కూటమి నాయకులతో కలసి మధ్యాహ్నం వరకూ ఆలయం వద్దనే ఉండి.. ప్రభుత్వానికి, తమకు చెడ్డపేరు రాకూడదనే తొందరపాటులో శూన్య మాసం, మూఢమని చూడకుండా, పండితులతో చర్చించకుండా శివలింగాన్ని కంగారుగా ప్రతిష్ఠించారన్నారు. ఇది ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా జరిగిందనేది విస్తృతంగా ప్రచారమవుతోందన్నారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశం కావడంతో ఈ మొత్తం సంఘటనపై జ్యుడీషియల్ విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని విష్ణు డిమాండ్ చేశారు.


