దివ్య క్షేత్రం.. చరిత్ర ఘనం
ఆలయ ప్రత్యేకత ఇది
సాధారణ విష్ణాలయాల మాదిరిగా కాకుండా ఈ రాజగోపాల స్వామివారి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. దేశంలో 108 దివ్య వైష్ణవ ప్రదేశాలున్నాయని వేద పండితులు చెబుతుంటారు. అందులో మన రాష్ట్రంలోని తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని దివ్యక్షేత్రంతో పాటు దేశంలో ద్వారక కల్యాణరాముడు అనేక క్షేత్రాల్లో విష్ణుమూర్తి వివిధ రూపాల్లో కొలువై ఉన్నాడు. ఆయా ఆలయాల్లో స్వామివారి ప్రతిమలను కొత్తకోటలోని రాజగోపాలస్వామి ఆలయ ప్రతిష్ఠ సమయంలో నెలకొల్పారు. ఆలయంలోని రాజగోపాల స్వామివారు 109వ క్షేత్రంగా ప్రతిష్ఠించబడ్డారు. గోదావరికి ఆనుకుని ఉండటం, విజయనగరం రాజుల హయాంలో ప్రస్తుతం ఉన్నచోట ఆలయాన్ని నిర్మించడంతో కొత్తకోట గ్రామం వెలసిందని గ్రామస్తులు చెబుతున్నారు. అప్పటి నుంచి కొత్తకోట రాజగోపాలస్వామిగా ఆలయం ప్రసిద్ధికెక్కింది. ఆలయంలోని రుక్మిణీ సత్యభామా సమేత రాజగోపాల స్వామివారి సన్నిధిలో 108 దివ్యక్షేత్ర ప్రతిమల గురించి ఆలయ గోడలపై ఆయా దివ్యక్షేత్రాలు దేశంలో ఎక్కడ ఉన్నాయో వివరించారు.
ఫ 108 స్వామివార్ల ప్రతిమలతో ప్రసిద్ధి
ఫ చరిత్రకెక్కిన కొత్తకోట రాజగోపాలస్వామి ఆలయం
ఫ ధనుర్మాసంలో ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు
రామచంద్రపురం: ఒడిశాలోని పూరి జగన్నాథుడు.. అహోబిలంలోని నరసింహస్వామి.. గోకులంలోని నవమోహనకృషు్‌ుణ్డ.. మహాబలిపురంలోని తిరుశయనత్తుతైవర్.. తిరు అయోధ్యలోని శ్రీరామచంద్రమూర్తి.. ఇలా 108 దివ్య క్షేత్రాల్లో కొలువైన విష్ణుమూర్తి రూపాలను ఒకేచోట కొలువు తీర్చితే భక్తులకు మహదానందమే. అందుకే రామచంద్రపురం నియోజకవర్గం కె.గంగవరం మండలం కొత్తకోటలో కొలువైన రుక్మిణీ సత్యభామా సమేత రాజగోపాలస్వామి ఆలయానికి ప్రత్యేకత సంతరించుకుంది. విజయనగర సామ్రాజ్యం పరిపాలనలో రామచంద్రపురానికి చెందిన శ్రీరాజా కాకర్లపూడి రాజవంశీయులు ఈ ఆలయాన్ని నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు.
చరిత్ర తెలుసుకుందాం రండి
గోదావరి తీరాన్ని, ప్రస్తుతం ఉన్న కోట రాజవైరిని ఆనుకుని 1,420లో శ్రీరాజా కాకర్లపూడి రామచంద్రరాజు బహుద్దూర్ కోటను నిర్మించారు. ప్రస్తుతం ఆ ప్రాంతం గోదావరిలో కలసిపోయింది. బొబ్బిలిపై యుద్ధం అనంతరం విజయనగరం మహారాజు ఆనందరాజు ఈస్టిండియా కంపెనీతో ఒడిశాలోని పారాదీప్ ఓడరేవులో ఒప్పందం చేసుకున్నారు. ఈ ప్రకారం తీర ప్రాంతాన్ని కంపెనీకి, ఎస్టేట్‌లను విజయనగరం రాజులకు ఇచ్చేందుకు అంగీకరించారు. కాగా ఎస్టేట్‌లను ఆక్రమించే ప్రయత్నం అప్పట్లో ఈస్టిండియా కంపెనీ చేసింది. ఇందులో భాగంగా పెద్దాపురంలో జరిగిన యుద్ధంలో రామచంద్రపురం రాజు రామచంద్రరాజు బహుద్దూర్ కుమారులు నీలాద్రిరాజు, జగన్నాథరాజు మరణించారు. యుద్ధంలో తన సోదరులు వీరమణం పొందడంతో కోటిపల్లి ఎస్టేట్‌కు రాజా కాకర్లపూడి నరసరాజు రాజయ్యారు. అయితే తన తోబుట్టువులు చనిపోవటంతో నరసరాజు వైరాగ్యంతో దైవభక్తిలోకి వెళ్లిపోయారు. ఓ గురువు సాయంతో మంత్రోపదేశం పొందారు. ఈ నేపథ్యంలో గోదావరికి అతి సమీపంలోని రాజకోటకు దగ్గరలో (ప్రస్తుతం కొత్తకోట గ్రామం) రాజగోపాలస్వామివారి ఆలయాన్ని నిర్మించారు. అనంతరం దేశంలోని వైష్ణవాలయాలను సందర్శించి, అక్కడి నుంచి 108 దేవతామూర్తుల ప్రతిమలను తీసుకొచ్చి ప్రతిష్ఠించిన నరసరాజు ఆలయం వద్దే తనువు చాలించారని ప్రతీతి.
సంతానం కలుగుతుందని..
సంతాన రాజగోపాలస్వామిగా పేరొందిన ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఏటా ధనుర్మాసంలో స్వామివారి దివ్య ప్రతిమలకు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అలనాడు రాజులు ఈ ఆలయాన్ని నిర్మించి ఎటువంటి లోటు రాకుండా ఉండేందుకు సుమారు వందెకరాల భూమిని విరాళంగా రాసినట్లు పూర్వీకులు చెబుతుంటారు. రామచంద్రపురం శ్రీరాజా కాకర్లపూడి వంశీయులు ఏటా ఈ ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ధనుర్మాసంలో ఈ స్వామివారిని దర్శించుకుంటే దేశంలోని వైష్ణాలయాలను దర్శించుకున్నట్లేనని భక్తుల నమ్మకం. మకర సంక్రాంతిని పురస్కరించుకుని స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి కల్యాణం జరిపిస్తారు.
దివ్య క్షేత్రం.. చరిత్ర ఘనం
దివ్య క్షేత్రం.. చరిత్ర ఘనం


