మనస్తాపంతో గోదావరిలో దూకేసిన తల్లి
ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు
తాళ్లపూడి: కుమార్తె కాపురం సరిగ్గా లేదనే మనస్తాపంతో ఓ తల్లి గోదావరిలో దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడగా ఆమె ఆచూకీ కోసం గాలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. దేవరపల్లి మండలం దుద్దుకూరుకు చెందిన ఈగల ధనలక్ష్మి (40), ఆమె కుమార్తె, మనుమరాలితో కలసి రాజమహేంద్రవరం వైపు నుంచి కొవ్వూరు వైపు ఆటోలో వస్తూ శుక్రవారం రాత్రి కొవ్వూరులోని రోడ్డు కం రైల్ బ్రిడ్జిపై దిగారు. ముందు ధనలక్ష్మి గోదావరిలోకి దూకేసింది. ఇంతలో ధనలక్ష్మి కుమార్తె భూసాల విజయకుమారి, ఏడాదిన్నర కుమార్తె లక్ష్మీప్రసన్నతో దూకుతుండగా అటుగా వెళుతున్న వారు రక్షించారు. ఆమె ఆచూకీ కోసం శనివారం ఉదయం నుంచి పట్టణ పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇంకా ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు.
అసలేం జరిగిందంటే..
భూసాల విజయ కుమారికి 2020లో మండపేటకు చెందిన లారీ డ్రైవర్ వినయ్‌కుమార్‌తో వివాహం జరిగింది. వారికి నాలుగేళ్ల కుమారుడు మోక్షిత్, ఏడాదిన్న కుమార్తె లక్ష్మీప్రసన్న ఉన్నారు. భర్త వినయ్‌కుమార్ భార్యను అనుమానిస్తూ చాలా రోజుల నుంచి వేధించడంతో శుక్రవారం ఉదయం గొడవ జరిగింది. అత్త ధనలకి్‌ష్మ్‌ని మండపేట పిలిపించుకుని నీ కూతురిని తీసుకుపో అని చెప్పడంతో ఆమె భూసాల విజయకుమారి, లక్ష్మీప్రసన్నలను మండపేట నుంచి రాజమహేంద్రవరం వచ్చారు. కొంతసేపు అక్కడే ఉండి మాట్లాడుకున్నారు. నీ భర్త నిన్ను ఎలాగైనా చంపేస్తాడని, అతని చేతిలో చచ్చేది ఏంటని అందరూ కలసి చచ్చిపోదామని ముగ్గురు ఆటోలో కొవ్వూరు వైపు వస్తూ బ్రిడ్జిపై దిగారు. ముందు అనుకున్న ప్రకారం తల్లి ఈగల ధనలక్ష్మి గోదావరిలో దూకేసింది. అటుగా వెళుతున్న వాహనదారులు ఇది గమనించి విజయకుమారితో పాటు లక్ష్మీప్రసన్నను కాపాడారు. 112కు ఫోన్ సమాచారంతో కొవ్వూరు పట్టణ పోలీసులు అక్కడకు వచ్చారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ సీఐ విశ్వం తెలిపారు.
మనస్తాపంతో గోదావరిలో దూకేసిన తల్లి


