అంతర్ జిల్లాల దొంగ అరెస్ట్
నిడదవోలు: అంతర్ జిల్లాల దొంగను అరెస్టు చేసి, అతని నుంచి రూ.19.34 లక్షల విలువ చేసే 223 గ్రాముల బంగారు ఆభరణాలు, 250 గ్రాముల వెండి ప్లేట్, రూ.లక్షతో పాటు ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామని నిడదవోలు సీఐ పీవీజీ తిలక్ తెలిపారు. ఈ మేరకు శనివారం స్థానిక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఉండ్రాజవరం గ్రామ భోగవల్లివారి వీధిలో గత ఏడాది అక్టోబర్ 9న కరుటూరి వెంకటరత్నంకు చెందిన ఇంట్లో 223 గ్రాముల బంగారం, 250 గ్రాముల వెండి, రూ.3.50 లక్షల నగదు చోరీకి గురైంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా అల్లూరి జిల్లా అడ్డతీగల మండలం వీరభద్రపురం గ్రామ నివాసి అయిన చలపనశెట్టి సన్యాసిరావును అరెస్టు చేశారు. ఉండ్రాజవరంలో కేసుతో పాటు ఆత్రేయపురంలో రెండు, ప్రత్తిపాడు, గోకవరం పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం ఐదు కేసులు అతనిపై ఉన్నాయి. 2018 నుంచి పలుచోట్ల దొంగతనాలకు పాల్పడిన సన్యాసిరావుపై ఇప్పటి వరకూ 35 కేసులు నమోదైనట్లు సీఐ తెలిపారు. కొవ్వూరు డీఎస్పీ జి.దేవకుమార్ పర్యవేక్షణలో కేసును ఛేదించామన్నారు. ఉండ్రాజవరం ఎస్సై డి.రవికుమార్, జగన్మోహన్‌రావు, పోలీస్ సిబ్బంది వి.బుజ్జి, జ్యోతిబాబు, జి.సాంబయ్య, రెహమాన్, పి.కృష్ణాజీరావు, ఎన్‌వీ రామాంజనేయులును సీఐ తిలక్ అభినందించారు.
బైక్ ఢీకొని వ్యక్తి మృతి
తుని: స్థానిక డీమార్ట్ సమీపంలో బైక్ ఢీకొని వెలుగుల సత్తిబాబు (55) మృతి చెందాడు. శనివారం తుని పట్టణం సీతారాంపురానికి వెలుగుల సత్తిబాబు పని నిమిత్తం డీమార్ట్ సమీపంలో పాత ఇనుప సామగ్రి గోడౌన్‌కు వస్తుండగా ఓ బైక్ బ లంగా ఢీకొంది. తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి అతన్ని తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కును కోల్పోయామని భార్య, కుమారు డు కన్నీరు మున్నీరవుతున్నారు. పట్టణ పోలీసు లకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.


