రత్నగిరికి పోటెత్తిన భక్తులు
అన్నవరం: నూతన ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా రత్నగిరికి గురువారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సత్యదేవుని ఆలయానికి భక్తుల రాక కొనసాగింది. ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలన్నీ భక్తులతో నిండిపోయాయి. ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, శ్రీకృష్ణ భగవానుడిని పూజించారు. రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. సుమారు 25 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించారు. సత్యదేవుని వ్రతాలు 1,800 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి శుక్రవారం ఉదయం 9 గంటలకు చండీహోమం నిర్వహించనున్నారు. రూ.750 టికెట్టుతో భక్తులు ఈ హోమంలో పాల్గొనవచ్చు.


