‘కళ’కలం కనుమరుగు
● పల్లెల్లో తగ్గిన సంక్రాంతి సందడి
● రానురానూ చిక్కిపోతున్న కళారూపాలు
ప్రత్తిపాడు: సంక్రాంతి వచ్చిదంటే చాలు గ్రామాలు ఒకప్పుడు ధాన్యరాశులతో పాటు వివిధ రకాల కళారూపాలతో సందడిగా ఉండేవి. ధనుర్మాసం రాకతో డూడూ బసవన్నలు, బుడబుక్కల వారు, గంటా సాహెబ్, పిట్టలదొర, హరిదాసు.. ఇలా పలు రకాల మనవైన సాంస్కృతిక కళారూపాల్ని ఊరిలో ప్రదర్శించి... తృణమో పణమో తీసుకుని సంతోషంగా జీవించేవారు. కానీ నేటి హైటెక్ యుగంలో ఆధునిక వినోదాల తాకిడికి ఈ కళారూపాలు చిక్కి శల్యమైపోయాయి. కళాపోషకులు కనుమరుగయ్యారు. కళాకారులు తెరమరుగయ్యారు.
● మెడలో దండ, చేతిలో చిడతలు, తంబూరాతో శ్రీమహావిష్ణువును స్తుతిస్తూ ‘హరిలో రంగ హరి... హరిలో రంగ హరి’ అంటూ ఇల్లిల్లూ తిరుగుతూ ఈ నెల రోజులూ పల్లెల్లో వీధివీధినా హరిదాసులు సందడి చేసేవారు.
● కోసిన కోత కొయ్యకుండా వసపిట్టలా వాగుతూ, బడాయి కబుర్లు చెబుతూ ఆబాల గోపాలాన్నీ పిట్టల దొరలు ఆనంద పరచేవారు.
● గవ్వలతో కుట్టిన గొంగడి టోపీ ధరించి, ఒంటికి గొంగడి వస్త్రాన్ని కప్పుకొని, పిల్లనగ్రోవి వాయిస్తూ భిక్షమెత్తుకునే గొరవయ్యలు ఇంటింటికీ వచ్చేవారు.
● కనకదుర్గమ్మ పెట్టెతో, కొరడా ఝళిపిస్తూ, ఒంటిని కొరడాతో బాదుకుంటూ, వీధి మధ్యలో డోలు వాయిస్తూ పోతరాజులు సందడి చేసేవారు.
● రంగురంగుల పట్టు వస్త్రాలతో కాళ్ల నుంచి కొమ్ముల వరకూ బసవన్నలను అందంగా అలంకరించి గుడ్డి బూరలు, కోణంగి బుడ్డాళ్లతో సహా... ఇంటింటికీ వచ్చి ‘అయ్యవారికి దండం పెట్టూ....’ అంటూ తమకు చిల్లర పైసలూ, ఎద్దుకు బుట్టెడు వడ్లూ అడుగుతూ...గంగిరెద్దుల వారు పండగకే కళ తెచ్చేవారు.
● పాత గొడుగు వేసుకుని.. బుస్కోటు తొడుక్కుని.. బుడబుడక్ మంటూ డమరుకం వాయిస్తూ...‘అంబ పలుకు జగదాంబ పలుకు’ అంటూ ఇంటింటా భవిష్యవాణిని వినిపించేవారు బుడబుక్కల స్వాములు.
● ఎత్తైన చెట్టు కొమ్మ మీద కూచుని.. కనిపించిన మేర దృశ్యాలను తనదైన వ్యంగ్య ధోరణిలో కొమ్మదాసరిలు ప్రత్యక్ష వ్యాఖ్యానం చెప్పేవారు.
● నీళ్లు నింపిన కడవ మూతిలో కత్తి గుచ్చి, దాన్ని ఓ కావిడికి కట్టి ఊరంతా ఊరేగించి కనికట్టుతో మాసాబత్తినవాళ్లు అందర్నీ ఆకట్టుకునే వారు.
● ఇంటింటికీ తిరిగి సకల కులాల వారికీ తాతముత్తాతల నుంచి గోత్రాల వరకూ... పాటల రూపంలో వంశమూలాన్నీ పిచ్చికుంట్లవారు వివరించేవారు.
● రోజుకో వేషం వేసుకుని, హాస్యం, భయంతో సహా సకల రసాలనూ పలికిస్తూ.. ఆఖరి రోజు శక్తి వేషంతో ఊరంతటికీ వినోదం అందించేవారు పగటి భాగవతులు.
● తలపై పెద్ద కిరీటం, చేతిలో గంట, నుదిటిపై విబూది పట్టీలు, మెడలో శంఖంతో వచ్చి గంట నిండా ధాన్యం పెట్టమంటూ జంగం దేవర శుభోదయం పలికేవారు.
● తలపై పక్షి ఈకలు, పంచెకట్టు, పెద్ద బెల్టు, చేతిలో చిన్న చేతికర్ర, మెడలో పూసల దండలతో గిరిజన యాసతో జరిగింది చెబుతాం... జరగబోయేది చెబుతాం... అంటూ గడపలో తిష్ట వేసేవాడు కోయ దొర.
● చిన్న సంచికట్టుతో, విబూతి నామాలతో గడపలో తిష్టవేసి కనికట్టు, హస్తలాఘవం వంటి విద్యలతో అందర్నీ అచ్చెరువందించేవారు విప్ర వినోదులు.
● భుజాన కావిడి, కావిడి బద్ద పొడుగునా గొట్టంతో వచ్చి, గొట్టం విప్పితే ఏయే తప్పులకు నరకంలో ఏయే శిక్షలు విధిస్తారు కళ్లకు కట్టిచెప్పి జనం ఇచ్చే సంభావనలు కాశీ బ్రాహ్మణుడు స్వీకరించే వాడు.
● నెమలి ఈకలు తలకు కట్టుకుని, గంభీరమైన వేషధారణతో పాట పాడుతూ... కంచు గంట కానీ, శిబ్బెని మోగిస్తూ, శివయ్యను స్మరించే చెంచు దొరలు.
● ఎలుగు బంటిని తెచ్చేవారు... కోతులను ఆడించేవారు... కాటికాపర్లు... ఇలా అనేకానేక వృత్తుల వారు సంక్రాంతి పండగ సందర్బంగా ప్రతీ పల్లెలోనూ సందడి చేసేవారు. ఇవన్నీ ఒకప్పుడు. ప్రస్తుత హైటెక్ యుగంలో పల్లెజీవి పట్టణ వాతావరణానికి అలవాటు పడ్డాక... ఆ ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు కనుమరుగైపోతున్నాయి. మన తర్వాతి తరం వారికి ఈ కళారూపాలన్నీ పుస్తకాలలో బొమ్మల రూపంలో కనిపిస్తాయేమో!
‘కళ’కలం కనుమరుగు
‘కళ’కలం కనుమరుగు
‘కళ’కలం కనుమరుగు


