న్యూ ఇయర్ వేడుకల్లో ఘర్షణ
కోరుకొండ: మండలంలోని కోటికేశవరంలో గురువారం తెల్లవారుజామున న్యూ ఇయర్ వేడుకల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీనిలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురికి గాయాలయ్యాయి. కోరుకొండ ఎస్సై శ్రీనివాసు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బుధవారం రాత్రి న్యూ ఇయర్ వేడుకలను కోటి కేశవరం వాసులు, స్థానికేతరులు నిర్వహించుకున్నారు. గురువారం తెల్లవారుజాము 3 గంటలకు జగ్గంపేట మండలం రాజపూడి గ్రామానికి తిరిగి వెళ్తున్న సందర్భంగా కారు వేగంగా నడపడంతో స్థానిక ఎస్సీ సామాజికవర్గం వారు ప్రశ్నించడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మాటామాటా పెరిగి ఘర్షణ జరిగింది. అదే కారులో దళిత యువకులు మోరారి అఖిల్, నల్లమిల్లి నవీన్‌లను బలవంతంగా ఎక్కించుకుని తీసుకెళ్లారు. దీంతో ఒక్కసారిగా గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది. ఆ పార్టీలో పాల్గొని తిరిగి వెళ్తున్న మరికొంతమందిని స్థానిక దళితులు ఆపేశారు. కిడ్నాపయిన వారిని వెనక్కి రప్పించమని డిమాండ్ చేస్తూ వారిని నిర్బంధించారు. నిర్బంధంలో ఉన్నవారు ఫోన్ చేయడంతో అఖిల్, నవీన్‌ను వెనక్కి తీసుకువచ్చారు. కానీ అప్పటికే తీవ్రంగా కొట్టడంతో వారిద్దరికీ గాయాలయ్యాయి. అంతకుముందు స్థానిక ఎస్సీపేట వద్ద జరిగిన కొట్లాటలో అవతలి వర్గానికి చెందిన గోపాలకృష్ణ తలకు బలమైన గాయమయినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై అందిన ఫిర్యాదు ఆధారంగా అట్రాసిటీ, కొట్లాట కేసులు నమోదు చేసినట్టు, ఇరువర్గాలకు చెందిన ఆరుగురిని నిందితులుగా గుర్తించినట్టు తెలిపారు. వీరిని త్వరలో అరెస్టు చేస్తామన్నారు. డీఎస్పీ వై. శ్రీకాంత్ దర్యాప్తు అధికారిగా ఉన్నట్టు తెలిపారు.
కోరుకొండ పోలీసు స్టేషన్ వద్ద ధర్నా
నిందితులను తక్షణం అరెస్టు చేయాలని దళితులు గురువారం రాత్రి కోరుకొండ పోలీసుస్టేషన్ వద్ద ధర్నా చేశారు. దాడికి పాల్పడి, కులంపేరుతో దూషించి, ఇద్దరు యువకులను కిడ్నాప్ చేసిన ఘటనలో ఎస్సీలకు న్యాయం చేయాలని కోటికేశవరం వాసులు పోలీసులను కోరారు. కోటికేశవరం సర్పంచ్ ముడే సిందూదివ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో దాడికి పాల్పడిన వారిని బేషరతుగా అరెస్టు చేయాలని, బాధితులకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ దాడిలో ఒక సామాజిక వర్గానికి చెందిన యువకులు, స్థానికేతరులు ఎస్సీమాల సామాజిక వర్గానికి చెందిన మోరారి అఖిల్, నల్లమిల్లి నవీన్‌లను కొట్టడంతో రాజమహేంద్రవరం జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. దీనిలో అఖిల్‌కు చేయి విరిగిందని, నవీన్ తలకు గాయాలయినట్టు పోలీసులకు తెలిపారు.
దళిత నాయకుల పరామర్శ
రాజమహేంద్రవరం జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను గురువారం దళిత నాయకులు పరామర్శించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. గుమ్ములూరు సర్పంచ్ నక్కా రాంబాబు మాట్లాడుతూ దళితులకు రక్షణ లేకపోవడం దురదృష్టకరమన్నారు. దళితులను కులంపేరిట దుర్భాషలాడుతూ, దాడికి పాల్పడటమే కాకుండా, కిడ్నాప్ చేయడం కుల దురంహకారమే అన్నారు. దాడిని తీవ్రంగా ఖండించారు. నిందితులను అరెస్టు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. దళిత నాయకులు పిట్టా కృష్ణ, దారా రాంబాబు, రాయుడు యేసు, కందికట్ల జయకర్, గొల్లపల్లి ప్రవీణ్ పాల్గొన్నారు.
గాయపడిన
ఎస్సీ యువకులు
రాజమహేంద్రవరం జీజీహెచ్‌లో
బాధితులతో మాట్లాడుతున్న దళిత నాయకులు
ఎస్సీ యువకుల
కిడ్నాప్, ముగ్గురికి గాయాలు
కోరుకొండ పోలీసు స్టేషన్ వద్ద
దళితుల ధర్నా
న్యూ ఇయర్ వేడుకల్లో ఘర్షణ


