ఉసురు తీసిన షికారు
● అతి వేగమే అనర్థానికి కారణం
● న్యూ ఇయర్ వేడుకలకు అంతర్వేది
బీచ్‌కు వచ్చిన ముగ్గురు యువకులు
● ఒకరు మృతి, మరొకరు సురక్షితం
● బోరున విలపిస్తున్న సహచరులు
సఖినేటిపల్లి: న్యూ ఇయర్ వేడుకలు చేసుకుందామని ఉల్లాసంగా, ఉత్సాహంగా అంతర్వేదికి వచ్చిన ముగ్గురు స్నేహితులలో ఒకరు ఊహించని రీతిలో మృత్యువాత పడడం వారిలో తీవ్ర విషాదం నింపింది. అంతర్వేది బీచ్ వెంబడి వాహనంలో వారు చేపట్టిన షికారు తోటి స్నేహితుడి ప్రాణాన్ని బలిగొనడాన్ని జీర్ణించుకోలేక సహచరులు బోరున విలపిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి సాగర సంగమం వద్ద చోటు చేసుకున్న ఈ ఘటన గురువారం ఉదయం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే, బెంగళూరుకు చెందిన బొండాడ సూర్యకిరణ్, కాకినాడ జిల్లా ఇంద్రపాలెంకు చెందిన నిమ్మకాయల శ్రీధర్(35), వాకలపూడికి చెందిన నందమూరి వెంకట సాయినాథ్ గోపీకృష్ణ కలసి జీపులో కాకినాడ నుంచి బయలుదేరారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా అంతర్వేది బీచ్ వద్ద సేద తీరేందుకు ఒక రెస్టారెంట్‌కు చేరుకున్నారు. కొంత సమయం గడిపాక ముగ్గురు స్నేహితుల్లో సూర్యకిరణ్ గదిలోనే ఉండిపోయాడు. అర్ధరాత్రి దాటాక శ్రీధర్, గోపీకృష్ణ జీపులో బీచ్ తీరం వెంబడి డ్రైవ్ చేసుకుంటూ షికారుకు బయలుదేరారు. వారిద్దరూ హుషారుగా మాట్లాడుకుంటూ వెళుతూ జీపు వేగం పెంచడంతో పాటు లైట్‌హౌస్ సమీపానికి వెళ్లే సరికి సంగమం వద్దనున్న మలుపును పసిగట్టలేకపోవడంతో వాహనం అదుపు తప్పి సంగమం జలాల్లోకి సరాసరి దూసుకుపోయింది. ప్రమాదాన్ని గ్రహించిన గోపీకృష్ణ, కారు నుంచి దూకేయడంతో సురక్షితంగా బయటపడ్డాడు. డ్రైవింగ్ చేస్తున్న శ్రీధర్ మాత్రం జీపుతో సహా సాగర సంగమం జలాల్లోకి దూసుకుపోయాడు. బయటపడిన గోపీకృష్ణ స్థానిక యువకులు, జాలర్లకు ప్రమాదం గురించి చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్సై కె.దుర్గా శ్రీనివాసరావు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాద బాధితుడు గోపీకృష్ణను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గురువారం కొనసాగిన పోలీసుల గాలింపు చర్యల్లో సాగర సంగమం సమీపంలో జీపుతో సహా శ్రీధర్ మృతదేహం లభ్యమైంది. జీపును పొక్లెయినర్‌తో ఒడ్డుకు తెచ్చి, మృతదేహాన్ని తీసి అంబులెన్స్‌లో రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తోటి స్నేహితుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి ఎస్సై దర్యాప్తు చేపట్టారు.
ఉసురు తీసిన షికారు


