రక్తపింజర్ల సంచారంతో ఆందోళన
అంబాజీపేట: ఇంటి ఆవరణలో తిరుగుతూ రెండు రక్తపింజర్లు స్థానికులను భయాందోళనలకు గురి చేశాయి. అంబాజీపేట శ్రీనివాసనగర్ శ్రీ విజయబేతాళ స్వామి ఆలయం వెనుక ఉన్న పప్పుల శ్రీకాంత్ ఇంటి ఆవరణలో ఉదయం నుంచి రెండు రక్తపింజర్లు తిరుగుతూ స్థానికులను ఆందోళనకు గురిచేశాయి. దాంతో భీమనపల్లికి చెందిన స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించారు. ఇంటి ఆవరణలో కలిసి ఉన్న మగ, ఆడ రక్త పింజర్లను చాకచక్యంగా పట్టుకుని డబ్బాలో బంధించారు. ఈ పాములను జన సంచారం లేని అరణ్యంలో వదిలిపెట్టారు. రోడ్ల నిర్మాణానికి ఎర్ర కంకర వస్తుందని అందులో ఈ రక్త పింజర్లు వస్తున్నాయని స్థానికులు అంటున్నారు.
ఊడిమూడిలో ఘర్షణ
● ఇద్దరికి గాయాలు
● 10 మందిపై కేసు నమోదు
పి.గన్నవరం: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మండలంలోని ఊడిమూడి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక వర్గానికి చెందిన ఇద్దరికి గాయాలు అయ్యాయి. దీంతో మరొక వర్గానికి చెందిన 10 మందిపై కేసు నమోదు చేసినట్టు పి.గన్నవరం ఎస్సై బి.శివకృష్ణ చెప్పారు. ఆయన విలేకరులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... ఊడిమూడి గ్రామంలో ఒక వర్గానికి చెందిన కొంతమంది యువకులు న్యూ ఇయర్ కేకును కట్ చేసి, బైకులపై తమ ఇళ్లకు తిరిగి వెళ్తూ.. రామాలయం వద్ద కూర్చొన్న మరొక వర్గం యువకులతో వాగ్వాదానికి దిగారు. దీంతో మాటామాటా పెరిగి వారి మధ్య ఘర్షణ జరిగింది. రామాలయం వద్ద కూర్చున్న ఒక వర్గంపై మరో వర్గం దాడి చేసినట్టు ఎస్సై చెప్పారు. అక్కడ కూర్చొన్న ఒక యువకునిపై చాకుతోను, మరో యువకుడిపై సీసాతో దాడి చేసి గాయపరిచారని చెప్పారు. గాయపడిన ఒకరిని రాజమహేంద్రవరంలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నాడని, మరో యువకుడు స్థానిక సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నాడని వివరించారు. దాడికి పాల్పడిన 10 మందిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శివకృష్ణ చెప్పారు.


