అగ్ని ప్రమాదంలో తాటాకిల్లు దగ్ధం
● నిరాశ్రయులైన
నాలుగు కుటుంబాల వారు
● మాజీ మంత్రి దాడిశెట్టి రాజా సాయం
తుని రూరల్: తాళ్లూరు గ్రామంలో విద్యుత్ షార్టు సర్క్యూట్‌తో చెలరేగిన మంటలకు వాసాగారము (పొడవాటి తాటాకిల్లు) దగ్ధమైంది. అందులో నివాసం ఉంటున్న నాలుగు కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. గురువారం నూతన సంవత్సరం సందడిలో ఉండగా ఆగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం తెలియడంతో తుని నుంచి అగ్నిమాపక వాహనంతో వచ్చిన సిబ్బంది ఇతర ఇళ్లకు వ్యాప్తి చెందకుండా మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో షేక్ మహబూబ్ నిషా, షేక్ అమ్మాజీ, షేక్ సిలార్ బీబీ, షేక్ రంజాన్‌బీబీ కుటుంబాలకు చెందిన రేషన్‌కార్డులు, ఆధార్ కార్డులు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్‌కార్డులు, దుస్తులు, గృహోపకరణలతో పాటు కొంత నగదు కాలిబూడిదయ్యాయి. రూ.రెండు లక్షలు ఆస్థి నష్టం జరినట్టు అంచనా వేశామని అగ్నిమాపక అధికారి కె.రాముడు తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం చేస్తామని తహసీల్దార్ ప్రసాద్ తెలిపారు.
దాడిశెట్టి రాజా సాయం
బాధిత కుటుంబాలకు మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా సాయం అందించారు. దాడిశెట్టి రాజా రాజధానిలో ఉండడంతో వైఎస్సార్ సీపీ నాయకులు నాగం దొరబాబు, దుంగల నాగేశ్వరరావు, కీర్తి బాలకృష్ణతో బాఽధిత కుటుంబాలకు దుస్తులు, నగదు అందజేశారు. గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.


