ప్రముఖ పండగలు
ఈ నెల 13 న నాగుల చవితి, 16న మొదటి కార్తిక సోమవారం, 21న క్షీరాబ్ది ద్వాదశి, 23న రెండో కార్తిక సోమవారం, 24న కార్తిక పౌర్ణమి, 30న మూడో సోమవారం, డిసెంబర్ 7న నాలుగో సోమవారం (మాస శివరాత్రి) పర్వదినాలు ఈ మాసంలో రానున్నాయి.
ఫ పవిత్ర కార్తిక మాసం ప్రారంభం
ఫ ఉమ్మడి జిల్లాలో ఆధ్యాత్మిక సందడి
ఫ ఆలయాల్లో పూర్తయిన ఏర్పాట్లు
కొత్తపేట: పవిత్ర కార్తిక మాసం మంగళవారం నుంచి ప్రారంభమైన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఏడాదిలో ఈ మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. శివకేశవులిద్దరికీ ప్రీతికరమైనది కావడంతో ఆలయాల్లో సందడి ఏర్పడింది. సోమవారం మధ్యాహ్నం అనంతరం పాడ్యమి తిథి ప్రవేశంతో శివాలయాల్లో రాత్రి ఆకాశ దీపాలు వెలిగించారు. మంగళవారం నుంచి కార్తీక స్నానాలు ప్రారంభమయ్యాయి. ఈ విధంగా మొదలైన కార్తిక మాసం డిసెంబర్ 8వ తేదీ మంగళవారంతో ముగియనుంది.
ఆలయాల్లో సందడి
ఈ మాసంలో శైవ క్షేత్రాలతో పాటు విష్ణాలయాలను భక్తులు దర్శించుకుంటారు. ప్రధానంగా పంచారామాలైన అమరారామం (పల్నాడు జిల్లా అమరావతి)లో కొలువైన అమరేశ్వరుడు, సోమారామం (పశ్చిమగోదావరి జిల్లా భీమవరం గునిపూడి)లో సోమేశ్వరుడు, క్షీరారామం (పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు)లో రామలింగేశ్వరుడు, ద్రాక్షారామం (డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా)లో భీమేశ్వరుడు, కుమార భీమారామం (కాకినాడ జిల్లా సామర్లకోట)లో భీమేశ్వరుడు ఆలయాలను భక్తులు దర్శిస్తారు. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం మందపల్లి ఉమా మందేశ్వరస్వామి క్షేత్రం, పలివెల ఉమా కొప్పేశ్వర క్షేత్రం, ఐ.పోలవరం మండలం మురమళ్ల భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి, అయినవిల్లి ముక్తేశ్వరం క్షణముక్తేశ్వరస్వామి, రాజోలు మండలం కడలి కపోతేశ్వరస్వామి, కుండలేశ్వరం కుండలేశ్వరస్వామి, కోటిపల్లి కోటిలింగేశ్వరస్వామి, పిఠాపురం పాదగయ కుక్కుటేశ్వరస్వామి తదితర ఆలయాలకు పోటెత్తుతారు.
ఆ రోజుల్లో రాత్రి ఒంటి గంట నుంచే వ్రతాలు
కార్తిక మాసంలో శని, ఆది, సోమవారాలతో పాటు, దశమి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, కార్తిక పౌర్ణమి తదితర 17 పర్వదినాల్లో స్వామివారి సన్నిధికి భారీ సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున వారి సౌకర్యార్థం తెల్లవారుజామున ఒంటి గంట నుంచే స్వామివారి వ్రతాలు ప్రారంభించనున్నారు. తెల్లవారుజామున రెండు గంటల నుంచి స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. నవంబర్ 21న కార్తిక శుద్ద ద్వాదశి (క్షీరాబ్ది ద్వాదశి) సందర్భంగా రాత్రి 6.30 నుంచి సత్యదేవుని తెప్పోత్సవాన్ని పంపా సరోవరంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 24న కార్తిక పౌర్ణమి సందర్భంగా సత్యదేవుని గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం 1.30కి ప్రారంభమై సాయంత్రం 6.30 గంటలకు గిరి ప్రదక్షిణ ముగుస్తుంది. భక్తుల రద్దీని తట్టుకునేందుకు వీలుగా కార్తికమాసంలో అన్నదానానికి బదులు భక్తులకు సర్క్యులర్ మండపం వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు పులిహోర, దద్దోజనం పంపిణీ చేస్తారు. చిన్నారులకు పాలు, బిస్కెట్లు కూడా అందిస్తారు. అన్నదాన పథకంలో సెక్యూరిటీ సిబ్బందికి, కళాకారులకు, ప్రత్యేక విధుల్లో పాల్గొనేవారికి మాత్రమే భోజన సౌకర్యం ఉంటుందని తెలిపారు. కార్తికమాసం ఏర్పాట్లపై దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ నల్లం సూర్యచక్రధరరావు వివిధ శాఖల సిబ్బందితో సోమవారం సమీక్షించారు.


