నిడదవోలు: క్రెడిట్ కార్డు పేరుతో మహిళ బ్యాంకు ఖాతాలోని రూ.40 వేలను ఓ యువకుడు కాజేశాడు. ఉండ్రాజవరం మండలం కాల్దారి గ్రామంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. నిడదవోలులోని బసివిరెడ్డిపేటకు చెందిన గెడ్డం నవీన్ వంశీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేలివెన్ను శాఖలో ఓ ఏజెన్సీ ద్వారా క్రెడిట్ కార్డు రిప్రజెంటేటివ్‌గా పనిచేసేవాడు. అయితే అతడి ప్రవర్తన నచ్చక ఉద్యోగంలోంచి తీసేశారు. ఉండ్రాజవరం మండలంలోని ఖాతాదారులతో పరిచయాలు ఉండటంతో అతడు ఆదివారం కాల్దారి గ్రామంలో ఆశ కార్యకర్త దోయ్యాల సంధ్యారాణి ఇంటికి వెళ్లాడు. ఆమెకు వేలివెన్ను ఎస్బీఐలో బ్యాంకు ఖాతా ఉంది. బ్యాంకు నిబంధనల మేరకు తప్పనిసరిగా క్రెడిట్ కార్డు తీసుకోవాలని, ఎస్బీఐ యోనో యాప్ ద్వారా ఆ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పాడు. దీంతో సంధ్యారాణి తన మొబైల్లో యోనో యాప్ ఓపెన్ చేసి వంశీకి ఇచ్చింది. ఫోన్‌కు ఇంటర్నెట్ సిగ్నల్ సరిగ్గా రావడం లేదంటూ బయటకు వచ్చిన వంశీ..ఆమె ఖాతాలోని రూ.40 వేలు తన ఖాతాకు ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్లిపోయాడు. కొంతసేపటికి ఈ విషయం గమనించిన సంధ్యారాణి వెంటనే ఫోన్లో తన బంధువులకు సమాచారం ఇవ్వగా, కాల్దారిలోని పెట్రోల్ బంక్ వద్ద వంశీని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఎస్సై రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


