సాక్షి, అమలాపురం: మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు తెర పడింది. జిల్లావ్యాప్తంగా అమలాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీలతో పాటు ముమ్మిడివరం నగర పంచాయతీలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 5 గంటల సమయానికి క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అనుమతి ఇస్తారు. ఓట్ల లెక్కింపు మంగళవారం చేపడతారు. ఓవైపు అర్నబ్ తుపాను సహాయక చర్యల్లో నిమగ్నమవుతూనే, మరోవైపు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రచారంలో వైఎస్సార్ సీపీ జోరు
అంగబలం, అర్థబలం, అధికార బలం ఉన్నా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కూటమి వెనుకబడింది. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వైఎస్సార్ సీపీ మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ప్రచారంలో దూసుకుపోయింది. ఆ పార్టీ చైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థులు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, నియోజకవర్గ కో ఆర్డినేటర్లు సమన్వయంతో అడుగులు వేస్తూ ఓటర్లను నేరుగా కలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు గుర్తు చేస్తూనే.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటికి పెట్టిన కోతలను వివరించారు. ఈ ఎన్నికల్లో సీలింగ్ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి, తమకు పట్టం కడితే ఆయా పట్టణాల అభివృద్ధికి చేపట్టబోయే కార్యక్రమాలపై హామీలిచ్చారు. మరోవైపు కూటమిలో ఆధిపత్య పోరు, సీట్ల పంపకాల్లో అసంతృప్తి, నాయకుల మధ్య సమన్వయ లోపం ప్రచారంలో కొట్టొచ్చినట్లు కనిపించాయి. చివరి రోజైన శుక్రవారం నాడు ప్రధాన పార్టీల నేతలు ప్రచారాన్ని హోరెత్తించారు.
రామచంద్రపురంలో ముందస్తు వ్యూహం
ముందస్తు వ్యూహంతో వైఎస్సార్ సీపీ రామచంద్రపురం మున్సిపాలిటీలో కూటమికి సవాల్ విసిరింది. ఎన్నికల ఊసే లేని సమయంలో రెండు నెలల ముందుగానే రాజ్యసభ మాజీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్‌లు గడప గడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రమం చేపట్టారు. తాము స్వయంగా పాల్గొనడమే కాకుండా పార్టీ శ్రేణులను ఇంటింటికీ పంపించి, ప్రజలతో మమేకమయ్యారు. దీంతో, కార్యకర్తల్లో నూతనోత్సాహం కనిపించింది. బోస్, సూర్యప్రకాష్‌లు ప్రజలను నేరుగా కలిసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నిత్యం అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు.
ఇక్కడ వైఎస్సార్ సీపీ చైర్మన్ అభ్యర్థి చింతపల్లి నాగేశ్వరరావు స్థానికుడు కావడం మరో అనుకూల అంశంగా మారింది. గతంలో రెండుసార్లు మున్సిపల్ కౌన్సిలర్‌గా, వైస్ చైర్మన్‌గా పట్టణానికి సేవలందించిన అనుభవం ఆయనకుంది. మున్సిపల్ సమస్యలపై సమగ్ర అవగాహన, అభివృద్ధిపై స్పష్టమైన లక్ష్యం, అందరితో సఖ్యతగా ఉండటం ప్రచారంలో ఆయనకు కలసివచ్చాయి. మరోవైపు టీడీపీ చైర్మన్ అభ్యర్థి మేడిశెట్టి శేషారావు వ్యాపారాల రీత్యా కాకినాడలో ఉంటారనే ప్రచారం స్థానికంగా చర్చనీయాంశమైంది. ప్రజలకు అందుబాటులో ఉండటంలో ఆయనకు ప్రతికూలత ఉందన్న అభిప్రాయం వ్యక్తమైంది. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రచారంపై పెద్దగా దృష్టి పెట్టకపోవడం కూటమికి మరో అవరోధంగా మారింది.
అంగ, అర్థ, అధికార బలాలున్నా
వెనుకంజలో కూటమి
ప్రతిపక్షంలోనూ సమన్వయంతో
సాగిన వైఎస్సార్ సీపీ ప్రచారం
అమలాపురం, రామచంద్రపురంలో వైఎస్సార్ సీపీ వ్యూహాత్మక అడుగులు
ముమ్మిడివరంలో కూటమి పార్టీల
మధ్య ఆధిపత్య పోరు
ముమ్మిడివరంలో పొత్తుల చిచ్చు
ముమ్మిడివరం నగర పంచాయతీలో కూటమి పొత్తుల వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశమైంది. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించడాన్ని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజుతో పాటు టీడీపీ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. తమ పార్టీ నుంచి పోటీ చేసేందుకు తగిన అభ్యర్థులే లేకపోవడంతో టీడీపీకి చెందిన గుబ్బల గంగాభవానీని జనసేన తరఫున బరిలోకి దింపి, పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. మొత్తం 26 వార్డులకు గాను జనసేనకు కేవలం మూడు కౌన్సిలర్ స్థానాలే కేటాయించడం ఆ పార్టీలో అసంతృప్తికి కారణమైంది. తమ పార్టీ అభ్యర్థులు గెలిచినా టీడీపీ ముద్ర పడుతుందన్న భావనతో జనసేనలోని కీలక నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో అంతగా ఉత్సాహం చూపలేదనే చర్చ సాగింది. ఈ విభేదాలు కూటమి ప్రచారాన్ని దెబ్బ తీశాయి.
మరోవైపు వైఎస్సార్ సీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి సానబోయిన సునీలాదేవి, కౌన్సిలర్ అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పొన్నాడ వెంకట సతీష్ కుమార్, సీఈసీ సభ్యుడు పితాని బాలకృష్ణ, పార్టీ క్యాడర్ సమన్వయంతో ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లారు. వార్డుల్లో ఓటర్లను నేరుగా కలుసుకుని మద్దతు కోరడం సరళాదేవికి కలసివచ్చే అంశంగా మారింది.


