సాక్షి, అమలాపురం: అర్నబ్ తుపాను తీరం దాటి మూడు రోజులు గడుస్తున్నా కోనసీమను అంధకారం వీడటం లేదు. పెనుగాలుల ధాటికి వేలాదిగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కరెంటు తీగలు తెగిపడ్డాయి. ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బ తిన్నాయి. ఫలితంగా జిల్లావ్యాప్తంగా విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది. జిల్లావ్యాప్తంగా 8 వేలకు పైగా విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయన్నది అంచనా. మొత్తం 36 సబ్‌స్టేషన్లు దెబ్బతిన్నాయి. పెద్ద మొత్తంలో విద్యుత్ తీగలు తెగిపడటం, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బ తినడంతో సరఫరా పునరుద్ధరణ సంక్లిష్టంగా మారింది. ఫలితంగా మంగళవారం రాత్రి 7 గంటలకు నిలిచిపోయిన విద్యుత్ సరఫరా శుక్రవారం రాత్రి 7 గంటలైనా పూర్తి స్థాయిలో పునరుద్ధరణ కాలేదు. 72 గంటలు గడిచినా జిల్లాలో సుమారు 10 శాతం ప్రాంతాలకే విద్యుత్ వెలుగులు అందాయి. మిగిలిన 90 శాతం ప్రాంతాలు ఇంకా చీకట్లోనే మగ్గుతున్నాయి. ఒకవైపు ఇళ్లల్లో దీపం వెలిగించుకునే పరిస్థితి లేక.. మరోవైపు గుక్కెడు తాగునీరు దొరక్క ప్రజలు అల్లాడుతున్నారు.
ప్రకటనలకే పరిమితం
పట్టణాల్లో గురువారం రాత్రికి, గ్రామీణ ప్రాంతాల్లో శుక్రవారం లేదా శనివారం రాత్రికల్లా విద్యుత్ సరఫరా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని మంత్రులు, ఎమ్మెల్యేలు గొప్పగా ప్రకటించారు. జిల్లాకు చెందిన ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం అమలాపురంలో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి ఇదే విషయాన్ని వెల్లడించారు. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం పునరుద్ధరణ పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొన్ని ప్రాంతాలకే..
అమలాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీలు, ముమ్మిడివరం నగర పంచాయతీలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే సరఫరా పునరుద్ధరించారు. మండల కేంద్రాల్లో కూడా అతి కొద్ది ప్రాంతాలకే విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. ప్రధానంగా 33/11 కేవీ వ్యవస్థ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సరఫరాను పునరుద్ధరించగలిగారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. విద్యుత్ స్తంభాలు, తీగలు, ట్రాన్స్‌ఫార్మర్ల నష్టాన్ని ముందుగానే అంచనా వేసి, పట్టణాలు, గ్రామాలకు విడివిడిగా ప్రణాళిక రూపొందించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ ప్రభుత్వ, అధికార యంత్రాంగం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాగునీటికి తిప్పలు
విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఇళ్లల్లో మోటార్లు పని చేయడం లేదు. ఫలితంగా తాగునీటి సరఫరా నిలిచిపోయి, జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శివారు ప్రాంతాలకు తాగునీరు పంపిణీ చేయడంలో ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ వరుసగా రెండో రోజూ విఫలమైంది. పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలోనూ పలు ప్రాంతాలకు నీరు అందక ప్రజలు బిందెలతో నీటి కోసం తిరుగుతున్నారు. ఇళ్లపై ఉన్న ట్యాంకుల్లో నీరు ఖాళీ కావడంతో ఇంట్లో కనీస అవసరాలకు, రోజూవారీ వాడకం నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను అధిగమించేందుకు కొంత మంది తాత్కాలికంగా అద్దెకు జనరేటర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. కొంత మంది ఆటోపై జనరేటర్ ఏర్పాటు చేసుకుని, అవసరమైన వారి ఇళ్లకు వెళ్లి ఆ సదుపాయం కల్పిస్తున్నారు. ఇదే అదనుగా కొందరు వ్యాపారులు గంటకు రూ.1,000 వరకూ వసూలు చేస్తున్నారు. మరోవైపు కొంత మంది ఇన్వర్టర్లను సైతం జనరేటర్‌పై చార్జింగ్ చేసుకునేందుకు ప్రయత్ని స్తున్నారు. దీని పూర్తి చార్జింగ్‌కు కూడా వ్యాపారులు రూ.600 నుంచి రూ.1,000 వరకూ వసూలు చేస్తున్నారు. చివరకు మొబైల్ ఫోన్ల చార్జింగ్‌కు సైతం పలువురు దుకాణాల ముందు బారులు తీరుతున్నారు.
చురుకుగా విద్యుత్ పునరుద్ధరణ పనులు
తుపానుకు జిల్లాలో తీవ్రంగా దెబ్బ తిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ పనులు చురుకుగా చేపడుతున్నా మని ఏపీ ఈపీడీసీఎల్ ఎస్‌ఈ బి.రాజేశ్వరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అవసరమైన సిబ్బందిని, సామగ్రిని ముందుగానే సిద్ధం చేసుకున్నామని పేర్కొన్నారు.
కోనసీమ జిల్లాలో విద్యుత్ సరఫరా
పునరుద్ధరణ పనులు
కలెక్టరేట్ పక్కనే ఓ ప్రైవేట్ హాస్పిటల్ వద్ద
4 రోజులుగా రోడ్డు పైనే పడి ఉన్న ట్రాన్స్‌ఫార్మర్
రాజోలు: బి.సావరం గ్రామంలో ఆటోపై
జనరేటర్‌తో విద్యుత్ సరఫరా చేస్తున్నారిలా..
అంధకారంలోనే కోనసీమ
అర్నబ్ తుపాను దెబ్బకు
కుప్పకూలిన విద్యుత్ వ్యవస్థ
72 గంటలు గడచినా 10 శాతం
ప్రాంతాలకే సరఫరా పునరుద్ధరణ
కరెంటు లేక తాగునీటికి కటకట
ఇన్వర్టర్ చార్జింగ్‌కు రూ.600
నుంచి రూ.1,000 వసూలు
మళ్లీ వర్షం
సహాయ చర్యలకు,
పంటల రక్షణ పనులకు ఆటంకం
మళ్లీ వరుణుడి ప్రతాపం
ఇప్పటికే తుపాను నష్టంతో సతమతమవుతున్న కోనసీమపై వరుణుడు శుక్రవారం మరోసారి ప్రతాపం చూపాడు. మధ్యాహ్నం సుమారు రెండు గంటల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. ఆ తర్వాత కూడా అడపాదడపా జల్లులు పడుతూనే ఉన్నాయి. దీంతో, సహాయ, పునరావాస చర్యలకు ఆటంకం ఏర్పడింది. దెబ్బ తిన్న ఇళ్లను చక్కదిద్దుకునే పనుల్లో ఉన్నవారు వర్షం కారణంగా ఆ పనులను నిలిపివేయాల్సి వచ్చింది. మరోవైపు తుపాను ధాటికి నేలకొరిగిన వరి పంటను రక్షించుకునేందుకు రైతులు చేస్తున్న ప్రయత్నాలకూ ఈ వర్షం అడ్డంకిగా మారింది. ఒక్కో కూలీకి రోజుకు రూ.600 నుంచి రూ.800 వరకూ చెల్లిస్తూండగా.. ఈ పనులను మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది. పొలాల్లోకి మరింత నీరు చేరడంతో వరి పంట నష్టం మరింత పెరిగే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొబ్బరి తోటల్లో విరిగిపడిన చెట్లను తొలగించే పనులకు సైతం వర్షం ఆటంకంగా మారింది.


