సాక్షి, అమలాపురం: మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెర పడింది. పోలింగ్‌కు సమయం సమీపిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో అమలాపురంలో అర్నబ్ తుపాను దెబ్బకు తలెత్తిన విద్యుత్ సమస్య అధికార కూటమికి కొత్త తలనొప్పిగా మారింది. పట్టణంలో విద్యుత్ సరఫరా ఇంకా గాడిన పడకపోవడంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ పరిస్థితి కూటమికి కరెంట్ షాక్ కొట్టేలా ఉందని ఆ పార్టీలకు చెందిన కొందరు నేతలే విశ్లేషిస్తూండటం గమనార్హం. జిల్లాకు చెందిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ నివాసం అమలాపురం పట్టణం నడిబొడ్డునే ఉంది. ఆయన ఇంటి ముందే తెగిన విద్యుత్ తీగలు ఇంకా వేలాడుతూ ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పట్టణంలోని ఇతర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా ఎప్పుడు పునరుద్ధరిస్తారో తెలియని పరిస్థితి. శుక్రవారం రాత్రికి కూడా కరెంటు సరఫరా కాకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది కాస్త తమ పుట్టి ముంచుతుందని కూటమి పార్టీ చైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
● అనుమానితులపై గ్రామస్తుల దాడి!
● ఇద్దరికి తీవ్రగాయాలు
● మత్స్యకార గ్రామంలో ఉద్రిక్తత!
తాళ్లరేవు: కోరంగి పంచాయతీ పెదబొడ్డు వెంకటాయపాలేనికి చెందిన సంగాడి కామేష్ (24) అనే యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందడం ఆ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కోరంగి పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. కామేష్, అతని స్నేహితులు పాలెపు సతీష్, పినపోతు కేశవతో పాటు మరో బాలుడు కలిసి 3 నెలల క్రితం ఓ ఇంట్లో 8 కాసులకు పైగా బంగారాన్ని దొంగిలించారు. వీరిపై మరికొన్ని కేసులు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొంత బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి జైలుకు వెళ్లిన నిందితులు ఇటీవల బెయిల్‌పై వచ్చారు. వారి మధ్య పంపకా ల విషయంలో వివాదం నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కామేష్ ఈ నెల 28వ తేదీ నుంచి కనిపించకుండా పోయాడు. అతడి మృత దేహం సీతారామపురం ఇసుక ర్యాంపు సమీపాన ఆత్రేయ గోదావరిలో శుక్రవారం లభ్యమైంది. కామేష్ మృతికి సతీష్, కేశవలే కారణమై ఉంటా రని భావించిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు.. వారిపై మూకుమ్మడి దాడి చేశారు. ఈ దాడిలో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువకులనూ కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాకినాడ రూరల్ సీఐ చైతన్యకృష్ణ నేతృత్వంలో ముగ్గురు సీఐలు, ఐదుగురు ఎస్సైలు హుటాహుటిన అక్కడకు చేరుకుని, భారీగా బలగాలను మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. కామేష్‌ది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. యువకులను గ్రామస్తులు కొట్టడంపై సీఐ చైతన్యకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం జరిగినా పోలీసులకు సమాచారం ఇవ్వాలి తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తగదని హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించి సమగ్ర దర్యాప్తు చేపడతామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
మున్సిపల్ ఎన్నికల నాడు
వేతనంతో కూడిన సెలవు
కాకినాడ లీగల్: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరిగే ఆదివారం నాడు కార్మిక శాఖ వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫై చేసిన ప్రాంతాల్లోని దుకాణాలు, సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు ఈ సెలవు వర్తిస్తుందని కార్మిక శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీని ఆధారంగా కాకినాడ ఉప కార్మిక కమిషనర్ ఎన్.బుల్లిరాణి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్మికులు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి వీలుగా ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని సంస్థలు, షాపుల యాజమాన్యాలు వేతనంతో కూడిన సెలవు తప్పనిసరిగా ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వుల అమలును కార్మిక శాఖ అధికారులు పర్యవేక్షిస్తారని తెలిపారు.


