● వైభవంగా వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు
● కన్నుల పండువగా హంస వాహన సేవ
ఆత్రేయపురం: కోనసీమ తిరుమలగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం.. బ్రహ్మోత్సవాల వేళ ఇల వైకుంఠంలా మారింది. ఉత్సవాల సందర్భంగా రెండో రోజైన శుక్రవారం స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. టీటీడీ వేద పండితుడు ఖండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు, ఆలయ కమిటీ సభ్యుడు, అర్చకుడు వాడపల్లి సుందర శేషావతారం పర్యవేక్షణలో అర్చకులు, వేద పండితులు ఆగమ శాస్త్రానుసారం ఉదయం విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, పంచామృత మండపారాధన, ప్రధాన హోమాలు నిర్వహించారు. శోభాయాత్రగా వెళ్లి గోదావరి నదీజల సంగ్రహణ స్నపనం చేశారు. లక్ష కుంకుమార్చన నిర్వహించారు. నీరాజన, మంత్రపుష్పాలు సమర్పించి, భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. సాయంత్రం స్వస్తివాచనం, ప్రధాన హోమాలు, మహాలక్ష్మీ మంత్ర పూర్వక మహాలక్ష్మి హోమం, దిగ్దేవతా బలిహరణ, పుణ్యాహవాచనం తదితర క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు సరస్వతీదేవి అలంకరణలో రాత్రి కన్నుల పండువగా హంస వాహన సేవ చేశారు. స్వామి, అమ్మవార్లను హంసవాహనంపై వేంచేయించి, మేళతాళాలు, బాణసంచా కాల్పుల నడుమ మాడవీధుల్లో ఊరేగించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని సుగంధభరిత పుష్పాలు, రంగురంగుల విద్యుద్దీప తోరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. బ్రహ్మోత్సవాల పూజా కార్యక్రమాల్లో దేవదాయ శాఖ ఉప కమిషనర్, ఆలయ ఈఓ నల్లం సూర్యచక్రధరరావు, చైర్మన్ ముదునూరి వెంకటరాజు దంపతులతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


