అమలాపురం టౌన్: పోలీసు అమర వీరుల వారోత్సవాల్లో భాగంగా అమలాపురంలోని జిల్లా ఆర్మ్డ్ రిజర్వుడ్ (ఏఆర్) ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో పలు విద్యా సంస్థల విద్యార్థులకు సోమవారం నిర్వహించిన ఓపెన్ హౌస్‌ను ఎస్పీ రాహుల్ మీనా ప్రారంభించారు. పలు రకాల ఆయుధాలు, అత్యాధునిక ఆయుధాలు, వెపన్స్, షార్ట్, లాంగ్ రేంజ్ వెపన్స్ ప్రదర్శించి, అవగాహన కల్పించారు. ఎస్పీ మీనా, ఏఎస్పీ మహేంద్ర మత్తే, పోలీసు అధికారులు, సిబ్బంది విద్యార్థులకు ఒక్కో ఆయుధం చూపించి దాని పని విధానాన్ని వివరించారు. గుంపులను చెదరగొట్టేందుకు వినియోగించే స్మోక్ గన్స్, డ్రోన్ కెమెరాల పని తీరును తెలిపారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఫోర్సెనిక్ పరికరాలు, ట్రాఫిక్ పోలీసుల పరికరాలు, హ్యాండ్ హోల్డ్ మెటల్ డిటెక్టర్, డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్, రక్షణ హెల్మెట్లు, లాఠీలు, రైట్ గేర్ పరికరాలు, వజ్ర వాహనం, మహిళా పోలీస్ స్టేషన్ ప్రత్యేక దర్యాప్తు వాహనం వంటివి ప్రదర్శించారు. డాగ్ స్క్వాడ్ విన్యాసాలను ప్రత్యక్షంగా చూపించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అమలాపురం, ఏఆర్ డీఎస్పీలు టీఎస్ఆర్కే ప్రసాద్, జీయూకేఎల్వీ సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.


