రొయ్యల మేత ధర పెంపు దారుణం | - | Sakshi
Sakshi News home page

రొయ్యల మేత ధర పెంపు దారుణం

Oct 18 2026 12:30 AM | Updated on Oct 18 2026 12:30 AM

● ఆక్వా రైతులపై అదనపు భారం

● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు మధు

బోట్‌క్లబ్‌(కాకినాడసిటీ): రాష్ట్రంలో రొయ్యల మేత (ఫీడ్‌) కంపెనీలు మరోసారి ధరలను పెంచి, ఆక్వా రైతులపై తీవ్ర ఆర్థిక భారం మోపడం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తాటిపాక మధు అన్నారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వెనామీ రొయ్యల ఫీడ్‌పై టన్నుకు ఎమ్మార్పీ ప్రకారం రూ.9,350, టైగర్‌ రొయ్యల ఫీడ్‌పై రూ.12,870 చొప్పున ధర పెంచడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. తాజా పెంపుతో వెనామీ ఫీడ్‌ ధర టన్ను సుమారు రూ.1.23 లక్షలకు, టైగర్‌ ఫీడ్‌ ధర సుమారు రూ.1.39 లక్షలకు చేరిందన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో టన్నుకు రూ.4 వేలు, జూన్‌లో రూ.12 వేల చొప్పున ఫీడ్‌ ధరలను కంపెనీలు పెంచాయని, తాజాగా మరోసారి ధరలు పెంచడంతో ఎనిమిది నెలల వ్యవధిలోనే రైతులపై అదనపు భారం గణనీయంగా పెరిగిందన్నారు. ఒక వైపు పెట్టుబడులు పెరుగుతుండగా, మరో వైపు మార్కెట్‌లో రొయ్యలకు ఆశించిన ధర లభించక పోవడంతో ఆక్వా రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజుల కాలంలో కోనసీమ జిల్లాలో ఒకరు, కృష్ణా జిల్లా మరో ఆక్వా రైతు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఆక్వా కల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చట్టం స్ఫూర్తికి విరుద్ధంగా, రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఫీడ్‌ కంపెనీలు ఏక పక్షంగా ధరలు పెంచడం అన్యాయమని విమర్శించారు. ధరల పెంపును నియంత్రించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించడం వల్లే కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement