పట్టంకట్టే రోజు రానే వచ్చింది.. అభివృద్ధిని చూసి ఓటేసే ఎన్నిక దగ్గర పడింది. గతమెంతో ఘనం అన్నట్టు వైఎస్సార్ సీపీ హయాంలో జరిగిన అభివృద్ధే నేటికీ పదిలం అయ్యింది. రెండున్నరేళ్లు ఎటువంటి అభివృద్ధి చేయని కూటమి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగలనుంది. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల వేళ ఈ చర్చ అందరి నోటా సాగుతోంది.
అమలాపురం టౌన్: రెండున్నరేళ్ల కూటమి పాలనలో చేసిందేమిటంటే చెప్పుకోలేని విధంగా ఉంది. ఎన్నికల వేళ ఆ మూడు పార్టీల అభ్యర్థులకు ఇది చెంపపెట్టులా మారింది. జిల్లాలో అమలాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీలు, ముమ్మిడివరం నగర పంచాయతీల్లో ప్రధాన సమస్యలు ఉన్నా, రెండున్నరేళ్లు చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే మున్సిపాలిటీల్లో అసలైన అభివృద్ధి జరిగింది. గతమెంతో ఘనం అన్నట్లు జనం ఆ ఫలాలు అందుకున్నారు. అందుకే జగనన్న పాలనను కొనియాడుతున్నారు. ఇప్పుడు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మాత్రం అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల వేళ అమలాపురం మున్సిపాలిటీలో మాస్టర్ ప్లాన్ అమలు అంటూ రానున్న కాలంలో పట్టణాన్ని జిల్లాలోనే ప్రథమంగా నిలుపుతామని హామీలు ఇచ్చేస్తున్నారు. అమలాపురం, రామచంద్రపురం, ముమ్మిడివరంలో డంపింగ్ యార్డ్ల సమస్యలు ప్రధానంగా ఉన్నాయి.
కన్నెత్తి చూడని కూటమి నేతలు
అమలాపురం పట్టణంలో ప్రధానంగా తాగునీటి సమస్య ఉంది. ప్రస్తుతం మున్సిపాలిటీ ప్రజలకు రోజుకు 53 లక్షల లీటర్ల నీరు సరఫరా చేస్తోంది. ఇంకా 40 లక్షల లీటర్లు అవసరం ఉన్నా, ఇవ్వలేకపోతున్నామని ఇంజినీర్లే చెబుతున్నారు. రోజుకు 40 లక్షల లీటర్ల నీటి లోటుతో మున్సిపాలిటీ దాదాపు 15 శివార్లకు రోజూ ట్యాంకర్లతో తాగునీటిని సరఫరా చేస్తోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి మంత్రి పినిపే విశ్వరూప్ పట్టణానికి రూ.20 కోట్లతో తాగునీటి ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మూడు వాటర్ ట్యాంక్‌లకు గాను గాంధీనగర్‌లో ట్యాంక్ నిర్మాణం పూర్తయ్యింది. ఇంతలో ప్రభుత్వం మారాక ఆ ప్రాజెక్ట్ పనులను నిలిపివేశారు. దీని ఫలితమే పట్టణంలో తాగునీటి తీవ్ర సమస్యకు ప్రధాన కారణం. ఇప్పుడు రూ.30 కోట్లతో కొత్త తాగునీటి ప్రాజెక్ట్‌ను తెస్తున్నామని కూటమి ప్రభుత్వం ప్రజాప్రతినిధి చెబుతున్నారు. పట్టణంలో మున్సిపాలిటీకి ప్రస్తుతం ఉన్న డంపింగ్ యార్డ్‌కు స్థలం సరిపోక కొత్త డంపింగ్ యార్డ్‌కు స్థల సేకరణ ఈ ప్రభుత్వంలో జరగడం లేదు.
సాంకేతిక సమస్యకు పరిష్కారమేది?:
రామచంద్రపురం మున్సిపాలిటీలో గతంలో పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు తాగునీటి ప్రాజెక్ట్ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ వల్ల ప్రజలకు తాగునీరు సమృద్ధిగా అందుతున్నా కూటమి ప్రభుత్వంలో ఆ ప్రాజెక్ట్‌కు సాంకేతిక లోపాలను సరిచేయలేకపోతున్నారు. ఫలితంగా తాగునీటి సరఫరాలో కొంత అవరోధం ఎదురవుతోంది. అలాగే డంపింగ్ యార్డ్ సమస్య ఉంది. ఈ యార్డ్‌కు స్థల సేకరణ చేయడంలో కూటమి నేతలు విఫలమవుతున్నారు.
నత్తనడకన తాగునీటి ప్రాజెక్ట్ పనులు
ముమ్మిడివరం నగర పంచాయతీ ప్రజలకు పూర్తి తాగునీరు అందించేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే రూ.110 కోట్లతో తాగునీటి ప్రాజెక్ట్ పనులకు శ్రీకారం చుట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ ప్రాజెక్ట్‌కు మరో రూ.30 కోట్లు కలిపి మొత్తం రూ.140 కోట్లతో పనులు మొదలు పెట్టింది. అయితే ఆ పనులు నత్తనడకన నడుస్తున్నాయి. ట్యాంక్‌ల పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ అమలైతే ముమ్మిడివరానికి నేరుగా పైపులైన్ల ద్వారా ధవళేశ్వరం నుంచి తాగునీరు సరఫరా అవుతుంది. అలాగే ఈ నగర పంచాయతీకి డంపింగ్ యార్డ్ సమస్య రోజురోజుకూ జటిలమవుతోంది.
ముమ్మిడివరంలో రోడ్డు పక్కనే చెత్త డంపింగ్
అమలాపురం శివారు ప్రాంతానికి ట్యాంకర్ ద్వారా తాగునీటి సరఫరా
ఫ నాడు కళకళ.. నేడు బోర్లా
ఫ వైఎస్సార్ సీపీ హయాంలోనే
అసలైన అభివృద్ధి
ఫ రెండున్నరేళ్లు మున్సిపాలిటీలను
పట్టించుకోని కూటమి సర్కారు
ఫ ఎన్నికల వేళ మోసగించేందుకు ప్రగతి మాట


