కత్తులు దూస్తున్నారు | - | Sakshi
Sakshi News home page

కత్తులు దూస్తున్నారు

Oct 16 2026 12:06 AM | Updated on Oct 16 2026 12:06 AM

సాక్షి, అమలాపురం: స్థానిక సంస్థల ఎన్నికల వేళ జిల్లాలో అధికార కూటమిలోని పార్టీల నేతల నడుమ అంతర్గత రాజకీయ పోరు జోరుగా సాగుతోంది. ఎన్నికల్లో గెలుపు సంగతి తర్వాత.. అసలు చైర్మన్‌ అభ్యర్థిత్వం ఎవరికి దక్కుతుందనే అంశంపై గురువారం రాత్రి వరకూ ఉత్కంఠ కొనసాగింది. ఒకవైపు టీడీపీ, జనసేన మధ్య పదవుల పంపకం పంచాయితీ.. మరోవైపు సొంత పార్టీల్లోనే నేతల మధ్య ఆధిపత్య పోరు.. వెరసి ఆశావహులకు ఈ వ్యవహారం కత్తి మీద సాములా మారింది. అమరావతి స్థాయిలో సీట్ల సర్దుబాటు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ స్థానిక నేతలను వెంటాడింది. పొత్తు రాజకీయాల్లో తమకు అవకాశం దక్కుతుందో లేదో తెలియని పరిస్థితిలో కొందరు తమ రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. సీటు సాధించేందుకు మిత్రపక్షం మీద.. సొంత పార్టీలోని సహచరుల మీద సైతం కత్తులు దూస్తున్నారు.

అమలాపురంలో బహిరంగ పోరు

జిల్లా కేంద్రమైన అమలాపురం మున్సిపాలిటీలో చైర్మన్‌ పీఠం కోసం కూటమి పార్టీల మధ్య పోరు గరంగరంగా సాగుతోంది. ఈ పదవి తమకంటే తమకే దక్కాలంటూ టీడీపీ, జనసేన నేతలు పావులు కదిపాయి. జనసేన నుంచి నల్లా శ్రీధర్‌, యాళ్ల సతీష్‌ చైర్మన్‌ పదవిని ఆశిస్తూ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. నిన్నటి వరకూ స్నేహితులుగా ఉన్న వీరు ఒక్కసారిగా ప్రత్యర్థులుగా మారారు. జనసేన పెద్దలను పట్టుకుని ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. మరోవైపు టీడీపీ నుంచి మెట్ల సత్య పేరు ప్రముఖంగా వినిపించింది. మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ చిక్కాల గణేష్‌ సైతం రేసులో ఉన్నట్లు ప్రచారం జరిగింది. తండ్రి మెట్ల రమణబాబుకు నామినేటెడ్‌ పదవి ఇవ్వనందున అతని కుమారుడైన సత్యకు చైర్మన్‌గా అవకాశం ఇవ్వాలని టీడీపీలోని ఒక వర్గం పట్టుబట్టింది. వీరి ఆధిపత్యానికి సవాల్‌ విసురుతూ టీడీపీ జిల్లా కార్యదర్శి గంధం పళ్లంరాజు వర్గం గణేష్‌కు మద్దతుగా నిలిచింది. ప్రత్యర్థి పార్టీతో పోరాడాల్సిన నేతలు ఈ పరిస్థితుల్లో ముందుగా సొంత పార్టీ నేతలతోనే తలపడాల్సి వచ్చింది. చివరకు అమలాపురాన్ని జనసేనకు కేటాయించడంతో టీడీపీ నేతల ఉత్సాహంపై నీళ్లు జల్లినట్లయ్యింది.

తెర మీద మంత్రి తండ్రి

రామచంద్రపురం మున్సిపాలిటీలోనూ చైర్మన్‌ పదవి వ్యవహారం టీడీపీలో రాజకీయ వేడిని పెంచుతోంది. ఇక్కడ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ తండ్రి సత్యం పేరు తెర పైకి రావడం చర్చనీయాంశంగా మారింది. స్థానికేతరుడైన సుభాష్‌ అమలాపురం నుంచి వెళ్లి రామచంద్రపురలలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ సమయంలో జనసేన నుంచి పదవులు ఆశించిన వారితో పాటు ముఖ్యంగా టీడీపీలో ఉంటూ మున్సిపల్‌ చైర్మన్‌ పీఠం మీద కన్ను వేసిన వారిలో మేడిశెట్టి శేషారావు ఉన్నారు. ఇప్పుడు మంత్రి తండ్రి సత్య పేరు తెర పైకి రావడంతో శేషారావు గొంతులో పచ్చి వెలగపండు పడినట్లయ్యింది. ఎమ్మెల్యే పదవిని పరాయివారికి కట్టబెట్టినట్టే.. ఇప్పుడు మున్సిపల్‌ చైర్మన్‌ పదవిని కూడా బయటి వారికి ఇస్తారనే ప్రచారాన్ని స్థానిక టీడీపీ క్యాడర్‌ జీర్ణించుకోలేకపోతోంది. ఈ సీటును టీడీపీకే కేటాయించినప్పటికీ ఆ చాన్స్‌ ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది.

ముమ్మిడివరంలోనూ అదే గొడవ

ముమ్మిడివరం నగర పంచాయతీలోనూ చైర్మన్‌ పీఠంపై ఆశలు పెట్టుకున్న నేతల మధ్య పోటీ నెలకొంది. ఇక్కడ చైర్‌పర్సన్‌ పదవి రిజర్వేషన్‌ బీసీ మహిళకు కేటాయించారు. దీంతో, జనసేనకు చైర్‌పర్సన్‌ పదవికి అభ్యర్థి లేరని, తమకే అవకాశం దక్కుతుందని టీడీపీ నాయకులు జోరుగా ప్రచారం సాగించారు. దీనిపై జనసేన నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోటీలో తమను కనీసంగా కూడా పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక్కడి నుంచి టీడీపీ జిల్లా అధ్యక్షుడు కట్టా సత్తిబాబు గుత్తుల సాయి ముఖ్య అనుచరుడు, ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడి భార్య అనంతలక్ష్మిని చైర్‌పర్సన్‌ను చేయాలని ఆ పార్టీ భావించింది. ఈ నేపథ్యంలో అటు జనసేన నుంచి కానీ, ఇటు టీడీపీ నుంచి కానీ మరో అభ్యర్థి రాకుండా తీవ్ర ప్రయత్నాలు చేయడంపై రెండు పార్టీల క్యాడర్‌లోనూ అసంతృప్తి వ్యక్తమైంది. చివరకు ఈ సీటును జనసేనకు కేటాయిస్తూ ప్రకటించడంతో టీడీపీ ఆశలు నీరుగారిపోయాయి.

అర్ధరాత్రి పొత్తుపొడుపు

మున్సిపల్‌ చైర్మన్‌ పదవుల కోసం జిల్లాలోని కూటమి నేతలు కుమ్ములాడుకుంటూండగా.. గురువారం అర్ధరాత్రి ‘పొత్తు’ పొడిచినట్లు ప్రకటన వెలువడింది. ఈ మేరకు జిల్లాలో రెండు స్థానాలను జనసేన ఎగరేసుకుపోగా.. టీడీపీ రామచంద్రపురంతో సరిపెట్టుకుంది. జిల్లా కేంద్రమైన అమలాపురంతో పాటు ముమ్మిడివరం నగర పంచాయతీ చైర్మన్‌ స్థానాలను జనసేనకు కేటాయించారు.

అమలా‘పురం’లో సైకిల్‌ వర్సెస్‌ గ్లాసు

చైర్మన్‌ పీఠం కోసం

సొంత పార్టీల్లోనూ పోరు

ఒకరిపై మరొకరు పైచేయి

సాధించేందుకు ఎత్తులు

రామచంద్రపురం,

ముమ్మిడివరంలోనూ ఇదే పరిస్థితి

రామచంద్రపురంలో

తెర పైకి మంత్రి తండ్రి సత్యం

చివరకు అమలాపురం, ముమ్మిడివరం జనసేనకు, రామచంద్రపురం టీడీపీకి కేటాయిస్తూ రాత్రి ప్రకటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement