రామచంద్రపురం రూరల్: అధికార కూటమిలోని జనసేన, బీజేపీలకు చెందిన పలువురు గురువారం వైఎస్సార్ సీపీలో చేరారు. పట్టణంలోని 26వ వార్డులో మంచి పట్టు ఉన్న జనసేన నేత అంకం బుజ్జి, పోలిశెట్టి దుర్గారావు, పెంటపాటి దుర్గారావు, అంకం శ్రీనివాస్ తదితరులు 50 మంది కార్యకర్తలతో వైఎస్సార్ సీపీకి జైకొట్టారు. పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాశ్ ఆధ్వర్యాన వైఎస్సార్ సీపీలో చేరారు. అలాగే, బీజేపీ నాయకుడు కొప్పిశెట్టి శ్రీనివాస్ కూడా పార్టీలో చేరారు. వీరందరికీ మాజీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, సూర్యప్రకాశ్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సూర్యప్రకాశ్ మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు ఒక్క రోజు ముందే కూటమి పార్టీల నుంచి పలువురు వైఎస్సార్ సీపీలో చేరారని, పట్టణంలో పార్టీ విజయం సాధిస్తుందనడానికిది సూచనని అన్నారు. వీరి చేరికతో పార్టీ మరింత బలోపేతమైందన్నారు. అందరం సమన్వయంతో మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
దసరా ఊరేగింపులు ప్రశాంతంగా
నిర్వహించుకోవాలి
అమలాపురం టౌన్: దసరా ఉత్సవాల ఊరేగింపులు, చెడీ తాలింఖానా ప్రదర్శనలను ఏడు వీధుల ఉత్సవ కమిటీలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ సూచించారు. ఏడు వీధుల ఉత్సవ కమిటీల పెద్దలతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 21న సమయ పాలన పాటిస్తూ ఆయా వీధుల నుంచి ఊరేగింపులు బయలుదేరాలని సూచించారు. చెడీ తాలింఖానా ప్రదర్శనల్లో ఉపయోగించే ఆయుధాలపై చర్చించారు. ఊరేగింపుల రోజున ట్రాఫిక్ సమస్యపై దృష్టి పెట్టాలని, ఊరేగింపులకు రోడ్ల చెంతన ఉండే చెట్ల కొమ్మలతో ఇబ్బంది పడుతున్నామని పలు వీధుల పెద్దలు పోలీసుల దృష్టికి తీసుకుని వచ్చారు. ఊరేగింపుల నిర్వహణపై కలెక్టరేట్లో శనివారం కలెక్టర్ సమక్షంలో తుది సమీక్షా సమావేశం జరుగుతుందని డీఎస్పీ చెప్పారు. ఊరేగింపుల నిర్వహణపై పట్టణ సీఐ పి.వీరబాబు, పట్టణ ఎస్సై ఎన్ఆర్ కిషోర్‌బాబు, ట్రాఫిక్ ఎస్సై ఎం.ఏసుబాబు పలు సూచనలు చేశారు. సమావేశంలో ఏడు వీధుల పెద్దలు అబ్బిరెడ్డి సురేష్, పనసా బుజ్జి, మామిడిపల్లి రాంబాబు, రాయుడు సత్యరుషి, ఆశెట్టి ఆదిబాబు, రవణం నరసింహారావు, చిక్కం కిట్టు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ అనుబంధ
విభాగాల్లో పలువురి నియామకం
సాక్షి, అమలాపురం: వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల్లో జిల్లాకు చెందిన పలువురు నేతలకు పదవులు దక్కాయి. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీల్లో నియామకాలు చేపట్టారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటన విడుదల చేసింది. అమలాపురం నియోజకవర్గానికి చెందిన గెడ్డం సంపత్‌రావుకు రాష్ట్ర ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ విభాగం ప్రధాన కార్యదర్శిగా, ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన జక్కంశెట్టి బాలకృష్ణకు రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా కప్పల శ్రీధర్ (కొత్తపేట), జిల్లా రైతు విభాగం ఉపాధ్యక్షుడిగా బొర్రా విష్ణుమూర్తి (ముమ్మిడివరం), జిల్లా సోషల్ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శిగా తాడి రాజేష్ (రాజోలు), కార్యదర్శిగా శ్రీకాంత్ పరమట (అమలాపురం), జిల్లా మహిళా విభాగం కార్యదర్శిగా కాడ ఎస్వీ కుమారి (ముమ్మిడివరం), జిల్లా బూత్ కమిటీల విభాగం కార్యవర్గ సభ్యుడిగా పోలమూరి బాబులు (అమలాపురం) నియమితులయ్యారు.
క్యూఆర్ కోడ్ విధానం
నిలుపు చేయాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): బియ్యం బస్తాల క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసే విధానాన్ని తాత్కాలికంగా నిలుపు చేయాలని, రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు నందిపాటి పల్లయ్య డిమాండ్ చేశారు. దీనివల్ల దివ్యాంగులు, వృద్ధులతో పాటు డీలర్లు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్‌కు గురు వారం వినతిపత్రం సమర్పించారు. కొంత మందికి ఇంటికి వెళ్లి రేషన్ సరకులు ఇవ్వడం ఖర్చుతో కూడిన పని అని, ఈ అదనపు సేవలకు గత ప్రభుత్వ హయాంలో ఎండీయూ వాహనదారుల సహాయకులకు ఇచ్చిన విధంగా రూ.5 వేలు ఇవ్వాలని కోరారు.


