సంగ్రామ రిజర్వేషన్ల ఖరారు | - | Sakshi
Sakshi News home page

సంగ్రామ రిజర్వేషన్ల ఖరారు

Oct 16 2026 12:06 AM | Updated on Oct 16 2026 12:06 AM

● 342 పంచాయతీలు, 3,878 వార్డులకు ప్రకటన

● సర్పంచ్‌ స్థానాల్లో ఎస్సీలకు 96, బీసీలకు 72

● వార్డుల్లో ఎస్సీలకు 1,071, బీసీలకు 786

● మొత్తం 379 ఎంపీటీసీ స్థానాల్లో ఎస్సీలకు 103, బీసీలకు 82

● అన్‌ రిజర్వ్‌డ్‌కు 194 స్థానాలు

సాక్షి, అమలాపురం: గ్రామ పంచాయతీ, మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ) ఎన్నికలకు జిల్లాలో రిజర్వేషన్లు ఖరారయ్యాయి. సర్పంచ్‌ స్థానాలతో పాటు వార్డు సభ్యుల స్థానాలకు కూడా సామాజికవర్గాల వారీగా సిద్ధం చేసిన రిజర్వేషన్లను కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ గురువారం విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో రిజర్వేషన్ల ఖరారుతో ఆశావహుల్లో సందడి నెలకొంది. ఏ గ్రామంలో ఏ సామాజికవర్గానికి అవకాశం లభించిందనే అంశంపై చర్చలు మొదలయ్యాయి. సర్పంచ్‌, ఎంపీపీ, జెడ్పీటీసీ పదవుల కోసం ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్న నాయకులు తమకు అనుకూలంగా ఉన్న రిజర్వేషన్‌ కేటాయించిన గ్రామాలపై దృష్టి పెట్టనున్నారు. వార్డు సభ్యులుగా పోటీ చేయాలనుకునే వారు కూడా తమ వార్డుల రిజర్వేషన్ల వివరాలు పరిశీలిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికపై గ్రామాల్లో ప్రధాన పార్టీల మద్దతుదారులు, స్థానిక నాయకులు దృష్టి సారించనున్నారు.

ఇవీ పంచాయతీ రిజర్వేషన్లు

● సర్పంచ్‌ స్థానాలకు వస్తే జిల్లాలోని మొత్తం 342 పంచాయతీల్లో ఎస్సీలకు 96, బీసీలకు 72 స్థానాలు కేటాయించారు. మిగిలిన 174 స్థానాలు అన్‌ రిజర్వ్‌డ్‌ కేటగిరీలో ఉన్నాయి. ఎస్టీలకు సర్పంచ్‌ స్థానాలు కేటాయించలేదు. ఎస్సీ కేటగిరీలో 41, బీసీ 36, అన్‌ రిజర్వ్‌డ్‌లో 91 చొప్పున స్థానాలను మహిళలకు కేటాయించారు. మొత్తం సర్పంచ్‌ స్థానాల్లో మహిళలకు 168, జనరల్‌ కేటగిరీలో 174 ఉన్నాయి.

● వార్డు సభ్యుల స్థానాల్లోనూ సామాజికవర్గాల వారీగా రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జిల్లావ్యాప్తంగా 3,878 వార్డులు ఉండగా ఎస్టీలకు 1, ఎస్సీలకు 1,071, బీసీలకు 786 స్థానాలు కేటాయించారు. మిగిలిన 2,020 స్థానాలు అన్‌ రిజర్వ్‌డ్‌ కేటగిరీలో ఉన్నాయి. మహిళలకు 1,939 వార్డులు కేటాయించగా, మిగిలిన 1,939 స్థానాలు జనరల్‌ కేటగిరీలో ఉన్నాయి.

ఎంపీటీసీల రిజర్వేషన్లు ఇలా..

● జిల్లావ్యాప్తంగా మొత్తం 379 ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు నిర్ణయిస్తూ కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌ ప్రొఫార్మా–2 విడుదల చేశారు. ఎస్సీలకు 103, బీసీలకు 82, అన్‌ రిజర్వ్‌డ్‌ కేటగిరీకి 194 స్థానాలను కేటాయించారు. ఎస్టీలకు ఒక్క స్థానం కూడా కేటాయించలేదు. మొత్తం స్థానాల్లో మహిళలకు 188 రిజర్వు కాగా, జనరల్‌ కేటగిరీలో 191 ఉన్నాయి. ఎస్సీ కేటగిరీలో 50 స్థానాలు మహిళలకు, 53 జనరల్‌కు కేటాయించారు. బీసీల్లో మహిళలకు 36, జనరల్‌కు 46 స్థానాలు దక్కాయి. అన్‌ రిజర్వ్‌డ్‌ కేటగిరీలో మహిళలకు 102, జనరల్‌కు 92 స్థానాలు కేటాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement