● నేటి నుంచి 18 వరకూ నామినేషన్ల స్వీకరణ
● మంచి రోజు కావడంతో 17న
అధిక సంఖ్యలో దాఖలుకు సన్నాహాలు
అమలాపురం టౌన్: జిల్లాలోని అమలాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీలు, ముమ్మిడివరం నగర పంచాయతీల్లో మున్సిపల్ ఎన్నికలకు తొలి అడుగు పడుతోంది. శుక్రవారం నుంచి ఈ నెల 18 వరకూ నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ మూడు రోజులూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ ఆయా మున్సిపల్ కార్యాలయాల్లో సహాయ ఎన్నికల అధికారులు (మున్సిపల్ కమిషనర్లు) నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 17వ తేదీ సప్తమి కలిసి రావడంతో మంచి రోజుగా భావిస్తూ అధిక సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సమాయత్తమవుతున్నారు. అమలాపురం మున్సిపాలిటీలో 36, రామచంద్రపురంలో 32, ముమ్మిడివరంలో 23 కలిపి మొత్తం 91 వార్డులకు అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. అలాగే, మున్సిపల్ చైర్మన్లకు ఈసారి ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తున్నందున ఆ అభ్యర్థులు కూడా ప్రత్యేకంగా నామినేషన్లు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల బరిలో గెలుపు గుర్రాలను బరిలో దింపేందుకు అన్ని రాజకీయ పార్టీలూ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ముఖ్యంగా వైఎస్సార్ సీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఎన్నికలు, అభ్యర్థుల ఎంపిక కోసం గురువారం ప్రత్యేక సమావేశాలు నిర్వహించుకుని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి.
అధికారుల సన్నాహాలు
ఆయా మున్సిపల్ కార్యాలయాల్లో కమిషనర్లు ఎన్నికల నిర్వహణకు నియమితులైన పోలింగ్ సిబ్బంది, రూట్ ఆఫీసర్లు, అతి సమస్యాత్మక, సమస్యాత్మక ప్రాంతాలను పర్యవేక్షించే అధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పర్యవేక్షణలో ఎన్నికల ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోలింగ్ ఈ నెల 28వ తేదీన జరగనుండగా.. ముందు రోజే ఆయా మున్సిపల్ కార్యాలయాల నుంచి పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది వెళ్లేందుకు వీలుగా డిస్ట్రిబ్యూటరీ సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. అమలాపురం మున్సిపాలిటీలో 71, రామచంద్రపురంలో 50, ముమ్మిడివరంలో 23 కలిపి మొత్తం 144 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.


