ఫినాయిల్‌ తాగిన విద్యార్థిని! | - | Sakshi
Sakshi News home page

ఫినాయిల్‌ తాగిన విద్యార్థిని!

Sep 19 2026 12:16 AM | Updated on Sep 19 2026 12:16 AM

చింతూరు: మండలంలోని లక్కవరం ఏకలవ్య పాఠశాలకు చెందిన ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థి ని ఫినాయిల్‌ తాగినట్లు తెలిసింది. పాఠశాలలో గురువారం జరిగిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. గురువారం ఉదయం ఆమె తండ్రితో కలసి పాఠశాలకు రాగా తండ్రి వెళ్లిన కొద్దిసేపటికి ఆమె డార్మెటరీలో వున్న ఫినాయిల్‌ తాగినట్టు సమాచారం. ఈ విషయాన్ని గమనించిన పాఠశాల సిబ్బంది ఆమెను తొలుత సమీపంలోని తులసిపాక పీహెచ్‌సీకి, అక్కడి నుంచి చింతూరు సీహెచ్‌సీకి తరలించి వైద్యం అందించినట్లు సమాచారం. మెరుగైన వైద్యం నిమిత్తం భద్రాచలం ఆసుపత్రికి తరలించగా ఆమె కోలుకున్నట్లు తెలిసింది. కాగా ఆమె ఫినాయిల్‌ తాగడానికి కారణాలు తెలియరాలేదు. పాఠశాల ప్రిన్సిపాల్‌ దిలీప్‌సింగ్‌ను వివరణ కోరగా తాను ప్రస్తుతం అరకులో వున్నానని, పాఠశాలకు వచ్చిన అనంతరం ఈ ఘటనపై సమాచారం సేకరిస్తానని తెలిపారు.

కోలుకుంటున్న క్షతగాత్రులు

తుని రూరల్‌: బస్‌ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పెళ్లి బృందం సభ్యులు కాకినాడలో వివిధ ప్రైవేట్‌ ఆస్పత్రులలో కోలుకుంటున్నారు. గురువారం తుని మండలం తేటగుంట శివారు రాజుల కొత్తూరు వద్ద ఉప్పాడ కొత్తపల్లి మండలం ఉప్పాడకు వెళ్తున్న పెళ్లి బృందం బస్సును కంటైనర్‌ డీకొనడంతో జరిగిన ప్రమాదంలో 43 మందికి గాయపడగా 108 అంబులెన్సుల్లో తుని ఏరియా ఆస్పత్రికి తరలించగా, ప్రాథమిక చికిత్స అనంతరం తీవ్రంగా గాయపడిన వారు మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడలోని పలు ప్రైవేటు ఆస్పత్రులలో చేరారు. స్వల్పంగా గాయపడిన వారు వారి వారి ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ సంఘటనలో ఎవరికీ ప్రాణాపాయం జరగకపోవడంతో పెళ్లి బృందం ఊపిరి పీల్చుకుంది.

విద్యుదాఘాతంతో

వివాహిత మృతి

తొండంగి: మండలంలోని బెండపూడిలో విద్యుత్‌షాక్‌ గురై వివాహిత మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రౌతులపూడి మండలం గిడజాం గ్రామానికి చెందిన యర్రా శివాజి, యర్రా జ్యోతి (32) దంపతులు వీరికి 13 ఏళ్ల కుమార్తె సత్య, తొమ్మిదేళ్ల కుమారుడు అనిరుధ్‌ ఉన్నారు. జ్యోతి స్వగ్రామమైన బెండపూడిలో ఐదేళ్లుగా అద్దె ఇంట్లో నివసిస్తోంది. శివయ్య స్థానికంగా దాబాలో పనిచేస్తుండగా జ్యోతి బెండపూడి వైజంక్షన్‌ వద్ద ఓ ప్రైవేటు బేకరీ షాపులో పనిచేస్తోంది. శుక్రవారం ఇంట్లో బట్టలు ఉతుకుతూ ఆ తడి చేతులతో విద్యుత్‌ మీటర్‌ వద్ద స్విచ్‌ ఆన్‌ చేయగా షాక్‌కు గురై పక్కనే ఉన్న ఇనుప గేటుకు తగిలింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. జ్యోతి తల్లి సమాచారం మేరకు శివయ్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఫామ్‌హౌస్‌లో చోరీ

సొత్తు విలువ రూ.3.5 లక్షలు

రాజమహేంద్రవరం రూరల్‌: తన భార్యకు చెందిన బొమ్మూరులోని ఫామ్‌హౌస్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి రూ.3.5 లక్షల విలువైన వస్తువులను చోరీ చేశారని శ్యామలానగర్‌కు చెందిన ఎస్‌.కుమార్‌ గురువారం రాత్రి బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసుల సమాచారం మేరకు కుమార్‌ భార్య ఎస్‌.శ్రీలతకు బొమ్మూరు గ్రామంలో ఫామ్‌హౌస్‌ ఉంది. అక్కడ వ్యవసాయ పరికరాలు, ఇతర గృహోపకరణాలను భద్రపరచడానికి ఉపయోగించే ఒక చిన్న ఫామ్‌ హౌస్‌ ఉంది. ఈ నెల పదో తేదీన ఆ క్షేత్రంలో పనిచేసే కోనే ప్రసాద్‌, ఆయన భాగస్వామి పీవీ గోపాలరావు అక్కడికి వెళ్లినప్పుడు, గుర్తు తెలియని వ్యక్తులు ఫామ్‌ హౌస్‌ తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించినట్లు గమనించారు. మూడు పెద్ద పురాతన ఇత్తడి పాత్రలు, రెండు మోటార్లు, ఇత్తడి బ్లింకర్లు (పశువుల కాళ్ళకు కట్టేవి) వంటి వస్తువులను దొంగిలించి పరారయ్యారని, సొత్తు విలువ రూ.3.5 లక్షలు ఉంటుందని కుమార్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇన్‌స్పెక్టర్‌ పి.కాశీవిశ్వనాథం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement